Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌తో అప్రమత్తం! | All You Need To Know About Black Fungus | Sakshi
Sakshi News home page

Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌తో అప్రమత్తం!

Published Sun, May 16 2021 4:54 AM | Last Updated on Thu, May 20 2021 10:55 AM

All You Need To Know About Black Fungus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  బ్లాక్‌ ఫంగస్‌.. కోవిడ్‌ బారినపడి చికిత్స పొందుతున్న కొందరిలో తలెత్తుతున్న సమస్య ఇది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయానికీ దారితీసే ఈ బ్లాక్‌ ఫంగస్‌ (మ్యూకోర్మైకోసిస్‌) కేసులు ఇప్పటికే దేశవ్యాప్తంగా పలుచోట్ల నమోదయ్యాయి. తాజా తెలంగాణలోనూ ఇలాంటి కేసులు వస్తున్నట్టు గుర్తించిన వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. శరీరంలో ఫంగస్‌ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు తక్షణమే జాగ్రత్తలు చేపట్టాలని, లేకుంటే పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కోవిడ్‌ పేషెంట్లు బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సల కోసం ప్రత్యేకంగా నోడల్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో.. హైదరాబాద్‌ కోఠిలోని ఈఎన్‌టీ (చెవి, ముక్కు, నోరు) హాస్పిటల్‌ను నోడల్‌ ఆస్పత్రిగా ఖరారు చేసింది. దానితోపాటు గాంధీ ఆస్పత్రిలోనూ బ్లాక్‌ ఫంగస్‌కు చికిత్స అందించనున్నట్టు ప్రకటించింది. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలో ఆప్తమాలజిస్ట్‌ (కంటి వైద్య నిపుణుల) సేవలు అవసరమైతే.. మెహిదీపట్నం సరోజినీ దేవి కంటి ఆస్పత్రి వైద్యుల సహకారం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈఎన్‌టీ, గాంధీ, సరోజినీదేవి ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు వైద్యవిద్య డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 

బ్లాక్‌ ఫంగస్‌ ఎలా వస్తుంది? 
శరీరంలో ఫంగస్‌ ఇన్ఫెక్షన్లు రావడానికి కారణం రోగనిరోధక శక్తి తగ్గిపోవడమే. దీర్ఘకాలిక జబ్బులున్నవారు, ఇప్పటికే శస్త్రచికిత్సలు జరిగినవారు.. ప్రస్తుతం కోవిడ్‌ చికిత్సలో మోతాదుకు మించి స్టెరాయిడ్లు వాడితే వారిలో రోగ నిరోధక శక్తి ఒక్కసారిగా తగ్గిపోతుంది. అదేవిధంగా శరీరంలో చక్కెర స్థాయిలు గాడి తప్పుతాయి. ఇలాంటి సమయంలో ఫంగస్‌ శరీరంలోకి ప్రవేశిస్తే.. విపరీతంగా వృద్ధి చెంది, ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఈ ఫంగస్‌ ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఆక్సిజన్‌ తీసుకుంటున్న పేషెంట్లకు సైతం బ్లాక్‌ ఫంగస్‌ సోకే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

శరీరంలోకి వెళ్లే ఆక్సిజన్‌లో తేమ నిర్దేశిత స్థాయిలలో లేకుంటే కూడా ఫంగస్‌ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ ఫంగస్‌ చికిత్సలో వినియోగించే లైపోజోమల్‌ ఆంఫోటెరిసిన్‌ బి మందుకు దేశవ్యాప్తంగా కొరత ఉన్నందున.. ప్రత్యామ్నాయ మందులైన పోసాకొనజోల్, ఫ్లూకనజోల్‌ మందులను వినియోగించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచించారు. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఇప్పటికే లైపోజోమల్‌ ఆంఫోటెరిసిన్‌–బి కొనుగోలుకు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.

పాటించాల్సిన జాగ్రత్తలివే.. 

  • కోవిడ్‌ చికిత్స పొందుతున్న రోగులు మ్యూకోర్‌ మైకోసిస్‌ బారిన పడకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పలు సూచనలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 
  • కోవిడ్‌ రోగులకు స్టెరాయిడ్లు వినియోగించినప్పుడు.. ముందు, తర్వాత రోగి చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చూడాలి. స్టెరాయిడ్లను సరైన మోతాదులో, సరైన విధంగా ఇవ్వాలి. 
  • రోగికి ఆక్సిజన్‌ అందిస్తున్నప్పుడు డిస్టిల్డ్‌ లేదా స్టెరైల్‌ నీటిని వినియోగించాలి. ఫంగల్‌ ఇన్ఫెక్షన్లకు తావులేకుండా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. వేడిచేయని నల్లా నీళ్లు, మినరల్‌ వాటర్‌ను అస్సలు వినియోగించవద్దు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement