ICMR Issues Advisory Over Black Fungus Covid Patients Here Is What You Need To Know- Sakshi
Sakshi News home page

‘బ్లాక్‌ ఫంగస్‌’: పట్టించుకోకపోతే ప్రాణాలే పోతాయి..

Published Mon, May 10 2021 5:14 PM | Last Updated on Thu, May 20 2021 10:57 AM

ICMR Issues Advisory Over Black Fungus Covid Patients - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: సూరత్‌లో కొద్ది రోజుల క్రితం కోవిడ్‌ నుంచి కోలుకున్న ఎనిమింది మంది కంటి చూపు కోల్పోయిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్నామని సంతోషించేలోపే వారి జీవితాలు అంధకారం అయ్యాయి. వీరు చూపు కోల్పోవడానికి కారణం బ్లాక్‌ ఫంగస్‌. ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర చోట్ల ఈ ఫంగస్‌ను గుర్తించారు. తాజాగా దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు పెరుగుతండటంతో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సంయుక్తంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేశాయి. దీని లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీటిలో తెలిపారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే కోవిడ్‌ మాదిరి ఈ ఫంగస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం లేదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. 

ఏమిటి బ్లాక్‌ ఫంగస్‌..
బ్లాక్‌ ఫంగస్‌, ‘మ్యూకోర్‌మైకోసిస్‌’గా పిలిచే ఈ వ్యాధి కొత్తదేం కాదు. గతంలో కూడా ఉంది. కానీ తాజాగా కోవిడ్‌ సోకిన వారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీని వల్ల బాధితుడికి ప్రాణాపాయం తలెత్తవచ్చు. వాతావరణంలో సహజంగానే ఉండే ‘మ్యూకోర్‌’ అనే ఫంగస్‌ వల్ల ఇది వస్తుంది. అరుదుగా మనుషులకు సోకుతుంటుంది. ముఖ్యంగా కరోనా సోకిన వారిలో, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో అధిక మొత్తంలో స్టెరాయిడ్స్‌ వినియోగించిన వారికి ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉంది. గాలి పీల్చుకొన్నప్పుడు ఈ ఫంగస్‌ ఊపిరితిత్తుల్లో, సైనస్‌ వద్ద చేరుతుంది. ఇది మెదడుకు చేరితో ప్రాణాపాయం తప్పదు అంటున్నారు నిపుణులు. 

బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని గుర్తించడం ఎలా...
బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారిలో చాలా వరకు కోవిడ్‌-19 లక్షణాలే కనిపిస్తాయి. ఒళ్లునొప్పులు, కళ్లు, ముక్కుచుట్టూ ఎర్రబారిపోవడం, జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పంటి నొప్పి, దంతాలు కదిలిపోవడం, కళ్ల నొప్పి, చూపు మందగించడం, వాంతులైతే రక్తపు జీరలు పడటం, మతి భ్రమించడం, శరీరంలో షుగర్‌ లెవల్స్‌ సడెన్‌గా పడిపోవడం, గతంలో ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టడం వంటి తదితర లక్షణాలు కనిపిస్తే బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని అనుమానించాలి.  

ఏం చేయాలి..

  • రక్తంలో షుగర్‌ లెవల్స్‌ని అదుపులో ఉంచుకోవాలి.
  • కరోనా నుంచి కోలుకున్నా.. ఎప్పటికప్పుడు షుగర్‌ లెవల్స్‌ని పరీక్షించుకోవాలి.
  • సమాయానికి, సరైన మోతాదులో డాక్టర్లు సూచించిన స్టెరాయిడ్లను మాత్రమే వాడాలి.
  • ఆక్సిజన్‌ థెరపీ సమయంలో తేమ కోసం పరిశుభ్రమైన నీటిని మాత్రమే వాడాలి.
  • డాక్టర్లను సూచన మేరకు యాంటీబయోటిక్స్‌, యాంటీఫంగల్‌ ఔషధాలను తీసుకోవచ్చు.

నిరోధించడం ఎలా..

  • బహిరంగ ప్రదేశాలు, దుమ్ముదూళి ఉన్న ప్రాంతాల్లోకి వెళ్తే తప్పని సరిగా మాస్కు ధరించాలి.
  • వీలైనంత వరకు శరీరం మొత్తం కవర్‌ అయ్యేలా పొడవాటి దుస్తులు ధరించాలి. చేతులకి గ్లోవ్స్‌, కాళ్లకు సాక్సులు వేసుకోవాలి.
  • వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.

‘మ్యూకర్‌మైకోసిస్’ అంటే
మ్యూకోర్‌మైకోసిస్ ఒక అరుదైన ఇన్ఫెక్షన్. సాధారణంగా మట్టిలో, మొక్కల్లో, ఎరువులో, కుళ్లిపోతున్న పండ్లు, కూరగాయల్లో కనిపించే మ్యూకర్(బూజు లాంటిది) వల్ల వస్తుంది. ఇది అన్నిచోట్లా ఉంటుంది. మట్టిలో, గాల్లో, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల ముక్కులో, చీమిడిలో కూడా ఉంటుందన్నారు వైద్యనిపుణులు. ఇది సైనస్, మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది.

డయాబెటిక్ రోగులకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే క్యాన్సర్, హెచ్ఐవీ లాంటివి ఉన్న రోగులకు ఇది ప్రాణాంతకం కావచ్చు. మరణాల రేటు 50 శాతం వరకూ ఉన్న మ్యూకోర్‌మైకోసిస్‌కు స్టెరాయిడ్స్ ఉపయోగించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఇదే చికిత్సతో బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడిన రోగుల ప్రాణాలను కాపాడవచ్చని వైద్యనిపుణులు తెలిపారు. 

చదవండి: కలకలం: కరోనా నుంచి కోలుకోగానే కళ్లు పోయాయి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement