సాక్షి, అమరావతి: కరోనా బాధితుల్లో ఇప్పుడు బ్లాక్ ఫంగస్ గుబులు రేపుతోంది. నాసో ఆర్బిటల్ మెనింగ్ మ్యుకర్ మైకోసిస్ లేదా రీనో సెరిబ్రల్ మ్యుకర్ మైకోసిస్‌గా పిలిచే ఈ ఫంగస్ వల్ల ఇది ఉత్పన్నమై ప్రాణాపాయం వరకూ తీసుకెళుతుంది. ముక్కు నుంచి కంటికి, కంటి నుంచి మెదడుకు చేరుకుని అవయవాలను పాడు చేస్తోంది. నియంత్రణలో లేని మధుమేహ రోగుల్లో బ్లాక్ ఫంగస్ సోకుతుందని నిపుణులు తేల్చారు. దీంతోపాటు సైనసైటిస్ (ముక్కు లేదా శ్వాసకు సంబంధించిన అలర్జీ) ఉన్న వారిలో ఎక్కువగా వస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. బ్లాక్ ఫంగస్‌పై ఆందోళన వద్దని వారు సూచించారు.
మధుమేహ బాధితుల్లోనే ఎందుకంటే..
కరోనా సోకిన పరిస్థితి తీవ్రమైన వారికి స్టెరాయిడ్స్ వాడటం తప్పనిసరి. కరోనా తగ్గిపోవాలనే ఉద్దేశంతో మధుమేహ రోగులకు విచక్షణా రహితంగా స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. స్టెరాయిడ్స్ వల్ల మధుమేహ బాధితుల్లో ఫంగస్ వచ్చే అవకాశం ఎక్కువ. స్టెరాయిడ్స్ ప్రాణాధార మందులే అయినా.. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ ఫంగస్ గాలి పీల్చుకోవడం ద్వారా ఎక్కువగా రావచ్చనేది ప్రాథమిక అంచనా. హెచ్‌ఐవీ బాధితులకు అనుబంధంగా టీబీ ఎలా వచ్చి వాలుతుందో మధుమేహ రోగులకు ఫంగస్ అలా చేరేందుకు ఎక్కువగా అవకాశాలున్నాయి.
ఇతర కారణాలూ ఉండొచ్చు
వెంటిలేటర్లను శుభ్రం చేయకుండా ఎక్కువ కాలం వాడటం వల్ల కూడా బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం ఆక్సిజన్‌పై ఉన్న రోగులకు కూడా ఫంగస్ సోకే అవకాశం ఉంది. ముక్కుకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు అంటే సైనసైటిస్ వంటివి ఉన్నప్పుడు బ్లాక్ ఫంగస్ రావడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటీ స్టడీలు లేవని వైద్యులు చెబుతున్నారు
ఇలా గుర్తించవచ్చు..
ముందుగా ముఖంలో వాపు ఉన్నప్పుడు లక్షణాలు బయటపడతాయి. కంటిగుడ్డు కింద ఎర్రబడి దురదగా ఉండటం (ఆఫ్తాల్మో ప్లీజియా). ముక్కులో దురదగా ఉండటం, పదేపదే ముక్కును నలిపేయాలనిపించడం. కళ్లపైన లేదా కళ్ల కింద చిన్న ఉబ్బులు కనిపించడం. కంటిచూపు తగ్గినట్టుగా లేదా మసకగా అనిపించడం. దంతాల్లో నొప్పిగా ఉండటం. ముఖంపై నొప్పి, తిమ్మిరి, వాపు వంటితో పాటు మొద్దుబారడం వంటివి కూడా దీని లక్షణాలు.
జాగ్రత్తలే మందు : ఐసీఎంఆర్
మధుమేహాన్ని వీలైనంత మేరకు అదుపులో ఉంచుకోవడం. మోతాదుకు మించి స్టెరాయిడ్స్ వాడకుండా జాగ్రత్త పడటం. ఇమ్యునో మోడ్యులేటింగ్ డ్రగ్స్‌ను నిలిపివేయడం. లక్షణాలు కనిపించగానే ఇంటర్నల్ మెడిసిన్/న్యూరాలజిస్ట్/ఈఎన్‌టీ సర్జన్/ లేదా కంటివైద్యులు/ దంత వైద్యులు/మైక్రో బయాలజిస్ట్ వంటి వారిని కలిసి చూపించుకోవాలని ఐసీఎంఆర్ సూచిస్తోంది.
(చదవండి: ప్రాంతీయతత్వంతో... ప్రజల ప్రాణాలు తీస్తారా?)
స్టెరాయిడ్స్ ప్రభావమే ఎక్కువ
స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం వల్ల ఫంగస్ అటాక్ అవుతుంది. దీన్నే ఆపర్చ్యునిస్టిక్ (అవకాశవాద) ఇన్ఫెక్షన్ అంటాం. సైనసైటిస్ ఉన్నవారికి కూడా బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. నియంత్రణలో లేని షుగర్ బాధితులకే ఇది ఎక్కువగా ఉంటుంది.
– డా.వరప్రసాద్, అనస్థీషియా నిపుణులు, కర్నూలు ప్రభుత్వాస్పత్రి
మధుమేహ నియంత్రణతో బయటపడొచ్చు
బ్లాక్ ఫంగస్ కొత్తగా పుట్టుకొచ్చిందేమీ కాదు. ఇమ్యునో కాంప్రమైజ్ పర్సన్స్‌కు ఇది వస్తుంది. లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌గా భావించే స్టెరాయిడ్స్ వాడితే ఆటోమేటిగ్గా షుగర్ పెరుగుతుంది. కరోనా తగ్గాక కూడా ప్రతిరోజూ మధుమేహంపై పర్యవేక్షణ చేసుకుంటూ ఉంటే బ్లాక్ ఫంగస్ నుంచి బయటపడొచ్చు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ మెషిన్ల నుంచి ఫంగస్ సోకుతున్న దాఖలాలను ఇంకా గుర్తించలేదు.
– డాక్టర్ కిషోర్, ఈఎన్‌టీ సర్జన్, కర్నూలు
(చదవండి: ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో ఏపీ పురోగతి)
Comments
Please login to add a commentAdd a comment