జబల్పూర్‌ని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బ్లాక్‌ఫంగస్ బాధితుడు
సాక్షి,, న్యూఢిల్లీ: దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్టెరాయిడ్లను అధికంగా వాడటం వల్ల ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతోందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. కరోనాతో పాటు ఇప్పుడు దేశాన్ని వణికిస్తున్న మ్యూకోర్‌మైకోసిస్ కేసులను నియంత్రించేందుకు ఆయన పలు సూచనలు చేశారు. కోవిడ్ రోగులలో కనిపించే ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రాబల్యం ప్రస్తుతం పెరిగిందని, షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవారు కరోనా బారిన పడటం వలన మ్యూకోర్‌మైకోసిస్ ప్రమాదం పెరుగుతుందని గులేరియా అన్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో వ్యాధి తీవ్రత చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, స్పష్టమైన సంకేతాలు లేనప్పటికీ స్టెరాయిడ్లను ఎక్కువ మోతాదులో ఉపయోగించడం ఇతర ఇన్ఫెక్షన్లకు కారణమవుతోందన్నారు.
లక్షణాలు లేని రోగులకు అధిక మోతాదులో స్టెరాయిడ్లు ఇస్తే, వారికి రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగి మ్యూకోర్‌మైకోసిస్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. దీనిని నివారించేందుకు..రక్తంలో షుగర్ లెవల్స్‌ని నియంత్రించుకోవాలని, స్టెరాయిడ్స్ వాడుతున్నవారు రోజూ వారి రక్తంలో షుగర్ లెవల్స్‌ను చెక్ చేసుకోవాలని తెలిపారు. ముడి ఆహారాన్ని తినడం ద్వారా మ్యూకోర్‌మైకోసిస్ వ్యాప్తి చెందుతోందనే విషయం ధృవీకరించడానికి ఎలాంటి డేటా లేదని వివరించారు. అదే సమయంలో కోవిడ్ చికిత్స సమయంలో ఆక్సిజన్ వాడకంతో బ్లాక్ ఫంగస్‌కు సంబంధం లేదని పేర్కొన్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న కొందరు కరోనా రోగుల్లోనూ బ్లాక్ ఫంగస్‌ను ధృవీకరిస్తున్నారని డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment