బ్లాక్ ఫంగస్ తరహాలోనే మనపై దాడిచేసే మరో మహమ్మారి.. వైట్ ఫంగస్. దీని అసలు పేరు కాండిడా అల్బికాన్స్. ఇది సోకడం వల్ల నోటిలో అంగిలి, నాలుక, చర్మం, జననేంద్రియాలు.. తదితర ప్రాంతాల్లో తెల్లటి మచ్చలు వస్తాయి. అందువల్ల దీనిని వైట్ ఫంగస్ అని పిలుస్తుంటారు.
ఎందుకు సోకుతుంది?
బ్లాక్ ఫంగస్ తరహాలో వైట్ ఫంగస్ కూడా మన చుట్టూ ఉన్న వాతావరణంలో, చాలా మంది శరీరంలోనూ ఉంటుంది. కరోనాకు స్టెరాయిడ్లు అతిగా వాడి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడినప్పుడు, షుగర్ లెవల్స్ తీవ్రంగా పెరిగిపోయినప్పుడు ఇది దాడి చేస్తుంది. ఒకవేళ వైట్ ఫంగస్ పెరుగుదలను అడ్డుకునే పరిస్థితి లేకుంటే చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. కరోనా సోకి ఆక్సిజన్ తీసుకుంటున్న వారికి ఆ పైపుల ద్వారా ఊపిరితిత్తులలోకి, నోటిలోకి ఈ ఫంగస్ ప్రవేశించి ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు చెప్తున్నారు.
దేనిపై ప్రభావం చూపుతుంది?
బ్లాక్ ఫంగస్ ప్రధానంగా ఊపిరితిత్తులు, నోరు, కళ్లు, ముక్కు, మెదడు వంటి భాగాలపై ఎక్కువ ప్రభావం చూపితే.. వైట్ ఫంగస్ ఊపిరితిత్తులతో పాటు కడుపు, పేగులు, కిడ్నీలు, చర్మం, గోర్లు, జననేంద్రియాలకూ సోకుతుంది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. మహిళలు, చిన్న పిల్లల్లోనూ ఇది ప్రభావం చూపిస్తుంది.
లక్షణాలు ఎలా ఉంటాయి?
నోటిలో, గొంతులో, నాలికపై కురుపులు, తెల్లని మచ్చలు ఏర్పడుతాయి. సైనస్ వాపు, గొంతునొప్పి ఉంటుంది. తీవ్రంగా ఆయాసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. జననేంద్రియాలు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు ఉంటాయి. ఈ లక్షణాలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. పేగులకు ఫంగస్ ఇన్‌ఫెక్ట్ అయితే మలబద్ధకం, గ్యాస్, డయేరియా లక్షణాలు ఉంటాయి. బాహుమూలాలు, మోచేతులు, మోకాళ్లు వంటి చోట్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి. కీళ్లనొప్పులు తలెత్తుతాయి.
ఎలా బయటపడాలి? వైట్ ఫంగస్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీ ఫంగల్ ఔషధాలు, ఇంజెక్షన్లు వాడాల్సి ఉంటుంది. అదే సమయంలో తగిన పోషకాహారం తీసుకోవడం, వీలైనంత వరకు తీపి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment