సాక్షి, అమరావతి: ‘కరోనా బాధితుల్లో 10 నుంచి 15 శాతానికి మించి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉండరు. వారిలోనూ వెయ్యిలో ఒకరికి కూడా బ్లాక్‌ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) రాదు. బ్లాక్‌ఫంగస్‌పై భయాందోళన కలిగించేలా వెలువడుతున్న కథనాలు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి. స్టెరాయిడ్స్ వాడటం వల్ల మధుమేహం నియంత్రణలోకి రాక ఇబ్బందులు పడుతున్న వారిలో తీవ్ర భయం కలుగుతోంది. వాస్తవానికి షుగర్‌ను నియంత్రణలో ఉంచుకుంటే బ్లాక్‌ఫంగస్ గురించి భయపడాల్సిన పనే లేదు’ అని వైద్యులు చెబుతున్నారు.
గ్లూకోమీటర్ తప్పనిసరి
షుగర్ చెక్ చేసుకోవడానికి ఇంట్లో గ్లూకోమీటర్ ఉంచుకోవడం తప్పనిసరి అని.. రోజూ ఉదయం పరగడుపున షుగర్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆ సమయంలో షుగర్ లెవెల్ 125 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. టిఫిన్ తిన్న గంటన్నర తర్వాత చెక్ చేసుకుంటే 250 కంటే తక్కువగా ఉండాలంటున్నారు. వీలైతే ఒకసారి ల్యాబ్‌కు వెళ్లి హెచ్‌బీ ఏ1సీ (మూడు మాసాల సగటు) చూపించుకోవాలని.. గరిష్టంగా 7.2 కంటే తక్కువగా ఉంటే ఇబ్బంది లేదని చెబుతున్నారు.
ఇన్సులిన్ నిరభ్యంతరంగా వాడొచ్చు
కరోనా బాధితుల్లో స్టెరాయిడ్స్ వాడిన తర్వాత షుగర్ ఎక్కువ అవుతుందని, అప్పుడు మందులతో నియంత్రణలోకి రాదని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి వాళ్లు షుగర్ నియంత్రణలోకి వచ్చేవరకూ ఇన్సులిన్ వాడుకోవచ్చని, నియంత్రణలోకి వచ్చాక ఇన్సులిన్ ఆపేసి తిరిగి మందులు వాడొచ్చని స్పష్టం చేస్తున్నారు. చాలామంది బరువు పెరుగుతామని, ఇతర ఇబ్బందులొస్తాయని ఇన్సులిన్ వాడకానికి వెనక్కు తగ్గుతున్నారని.. ఇది సరికాదని చెబుతున్నారు.
కార్బొహైడ్రేట్స్‌కు దూరంగా ఉండాలి
కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం షుగర్ స్థాయిలను పెంచుతుంది. ఉదాహరణకు బియ్యంతో చేసిన అన్నం, ఇడ్లీలు, దోశలు, పఫ్‌లు, బంగాళ దుంప వంటి వాటికి దూరంగా ఉండాలి. జొన్న, రాగులు, కొర్రలు, అండు కొర్రలు వంటి వాటితో చేసిన ఆహారం, పీచు పదార్థాలు కలిగిన కూరగాయలు (బీరకాయ, సొరకాయ, చిక్కుడు, గోరు చిక్కుడు వంటివి), సిట్రస్ జాతికి చెందిన పైనాపిల్, నిమ్మ వాడొచ్చు. జామ పండ్లు తినొచ్చు. ఇవి తింటే షుగర్ లెవెల్స్ పెరగవు. పైగా వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. ఫంగస్ వచ్చే అవకాశమే ఉండదు. సామాజిక మాధ్యమాల్లో దీనిపై ఎక్కువ వార్తలు రావడంతో మందులు బ్లాక్‌లో అమ్ముతున్నారు.
బ్లాక్ ఫంగస్‌కు భయపడాల్సిన పనిలేదు
బ్లాక్ ఫంగస్ అనేది లక్షలో ఒకరికి వచ్చేది. దానికి భయపడాల్సిన పనిలేదు. అది కూడా అక్కడక్కడా షుగర్ పేషెంట్లకు మాత్రమే. మొత్తం కరోనా బాధితుల్లో 10 శాతం మంది కూడా షుగర్ బాధితులు ఉండరు. ఉన్న వాళ్లు.. షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. షుగర్ స్థాయి 250 కంటే తక్కువగా ఉంటే ఫంగస్ రాదు. ప్రాథమికంగా గుర్తిస్తే నివారించవచ్చు.
– డాక్టర్ సీహెచ్ ప్రభాకర్‌రెడ్డి, హృద్రోగ నిపుణులు, కర్నూలు
రెండు లక్షల్లో నాలుగైదు కూడా లేవు
బ్లాక్ ఫంగస్ దశాబ్దాల నుంచీ ఉన్నదే. ఇది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. రాష్ట్రంలో 2 లక్షల పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉంటే నాలుగైదు కూడా ఫంగస్ కేసులు రాలేదు. దీని గురించి భయాందోళన అవసరం లేదు. పరిమితికి మించి స్టెరాయిడ్స్, యాంటీ బయోటిక్స్ వాడిన.. నియంత్రణలో లేని డయాబెటిక్ వారికి మాత్రమే వస్తుంది. అది కూడా అరుదు. దీనిగురించి మధుమేహ రోగులు గానీ, సాధారణ కోవిడ్ బాధితులు గానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేనే లేదు.
– డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి, న్యూరో ఫిజీషియన్ (చైర్మన్–ఏపీఎంఎస్‌ఐడీసీ)
ఎలా సోకుతుందంటే..
వాతావరణంలో సహజంగానే ఉండే మ్యుకోర్ అనే ఫంగస్ వల్ల అరుదుగా ఇది మనుషులకు సోకుతుంది. గాలి పీల్చుకున్నప్పుడు ఈ ఫంగస్ ఊపిరితిత్తుల్లో, సైనస్ వద్ద చేరుతుంది. ముఖ్యంగా కోవిడ్ సోకిన వారిలో ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా లేదా రోగ మితిమీరి స్పందించకుండా వ్యాధి నిరోధక శక్తిని కట్టడి చేయడానికి స్టెరాయిడ్స్ వినియోగించిన వారికి ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉంది. అవయవ మార్పిడి జరిగిన వారిలో, ఐసీయూలో చికిత్స పొందిన వారికి దీని ముప్పు ఎక్కువే. దీర్ఘకాలిక జబ్బులున్న వారు, శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు, ప్రస్తుతం కోవిడ్ చికిత్సలో మోతాదుకు మించి స్టెరాయిడ్లు వాడితే వారిలో రోగ నిరోధక శక్తి ఒక్కసారిగా తగ్గిపోతుంది. వారి శరీరంలో చక్కెర స్థాయిలు గాడి తప్పుతాయి. ఇలాంటి సమయంలో ఫంగస్ శరీరంలోకి ప్రవేశిస్తే.. విపరీతంగా వృద్ధి చెంది, ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కృత్రిమ ఆక్సిజన్ తీసుకుంటున్న పేషెంట్లకు సైతం బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం ఉండొచ్చు.
లక్షణాలివీ..
► ముఖంలో వాపు ఉన్నప్పుడు ముందుగా ఈ లక్షణాలు బయటపడతాయి.
► కంటిగుడ్డు కింద ఎర్రబడి దురదగా ఉండటం (ఆఫ్తాల్మో ప్లీజియా).
► ముక్కులో దురదగా ఉండటం, పదేపదే ముక్కును నలిపేయాలనిపించడం.
► కళ్లపైన లేదా కళ్ల కింద చిన్న ఉబ్బులు కనిపించడం. కంటిచూపు తగ్గినట్టుగా లేదా మసకగా అనిపించడం.
► దంతాల్లో నొప్పిగా ఉండటం. ముఖంపై నొప్పి, తిమ్మిరి, వాపు వంటితో పాటు మొద్దుబారడం కూడా వంటివి కూడా దీని లక్షణాలు.
Comments
Please login to add a commentAdd a comment