సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న కర్ఫ్యూను జూన్ 10 వరకు కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆంక్షలు కట్టుదిట్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల వ్యాక్సినేషన్‌కు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగ వీసాలపై విదేశాలకు వెళ్లే వారికి కూడా టీకాలు ఇచ్చి ధృవీకరణ పత్రాలు అందేలా చూడాలన్నారు. కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
కోవిడ్ లేకున్నా బ్లాక్ ఫంగస్..!
బ్లాక్‌ఫంగస్ బాధితులకు అందుతున్న వైద్యంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. చికిత్సకు అవసరమైన ఇంజక్షన్లు, మాత్రలు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు 1,179 నమోదు కాగా 1,068 మందికి వైద్యం అందుతోందని, 97 మందికి నయం అయిందని అధికారులు తెలిపారు. 14 మంది మరణించినట్లు వెల్లడించారు. కోవిడ్ సోకకున్నా బ్లాక్ ఫంగస్ వస్తుందన్న విషయం తమ పరిశీలనలో తేలిందని పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్ వచ్చిన వారిలో 1,139 మంది కోవిడ్ సోకినవారు కాగా 40 మందికి కరోనా లేకున్నా బ్లాక్ ఫంగస్ వచ్చిందని తెలిపారు. డయాబెటిస్ ఉన్నవారికి అధికంగా వస్తోందని, కేంద్రం కేటాయింపులు ప్రకారమే ఇంజక్షన్లు వస్తున్నాయని వివరించారు. మాత్రలను అవసరమైన మేర సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంజక్షన్ల కోసం కూడా కృషి చేస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిల్వ ట్యాంకులుండాలి...
కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా, నిల్వలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఆక్సిజన్ వినియోగం 490 టన్నులకు తగ్గిందని అధికారులు వెల్లడించారు. మే 29వ తేదీన 654 టన్నులను సేకరించామని, స్థానికంగా 230 టన్నుల ఉత్పత్తి అయినట్లు తెలిపారు. ఆక్సిజన్ సేకరణ, నిల్వలపై అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిల్వ చేసే ట్యాంకులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు.
సరైన పథకాల్లో మదుపు చేయాలి..
కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన చిన్నారుల పేరిట సరైన పథకాల్లో డబ్బు మదుపు చేయడం ద్వారా ఆర్థిక భద్రతతోపాటు ప్రతి నెలా కనీస అవసరాల కోసం మెరుగైన వడ్డీతో డబ్బులు అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 92 మంది పిల్లలను ఇప్పటివరకూ గుర్తించామని, వీరిలో 43 మందికి రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేశామని అధికారులు వెల్లడించారు.
అన్ని జిల్లాల్లో కేసులు తగ్గుముఖం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించారు. ప్రతి పది లక్షల జనాభాకు పట్టణాల్లో 2632 కేసులు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 1859 కేసులు ఉన్నట్లు తెలిపారు. పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందన్నారు. మే 16న పాజిటివిట్ రేటు 25.56 శాతం ఉండగా 30వతేదీ నాటికి 15.91 శాతానికి తగ్గినట్లు చెప్పారు. ఒకదశలో రెండు లక్షలకుపైగా ఉన్న యాక్టివ్ కేసులు 1.6 లక్షలకు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడిందని, మే 7వతేదీన 84.32 శాతంగా ఉన్న రికవరీ రేటు ప్రస్తుతం దాదాపు 90 శాతానికి చేరుకున్నట్లు వివరించారు. ఇక 104 కాల్‌సెంటర్‌కు మే 3వతేదీన 19,175 కాల్స్ రాగా 29వ తేదీన కేవలం 3,803 కాల్స్ మాత్రమే వచ్చాయని, కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందనేందుకు ఇది సంకేతమని పేర్కొన్నారు.
– సమీక్షలో ఉపముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, 104 కాల్ సెంటర్ ఇన్‌ఛార్జ్ ఏ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ మల్లిఖార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు, ఆయుష్ కమిషనర్ వి.రాములు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 10 వరకు కర్ఫ్యూ
Published Tue, Jun 1 2021 4:05 AM | Last Updated on Tue, Jun 1 2021 7:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment