గాంధీ ఆస్పత్రి: ఎల్‌బీనగర్‌కు చెందిన ఓ యువకుడు నెల క్రితం కరోనా బారిన పడ్డాడు. కొద్దిరోజుల క్రితం పైదవడ దంతాల నొప్పితో పాటు కదులుతున్నట్లు అనిపించడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. స్కానింగ్‌లు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి బ్లాక్‌ఫంగస్ అని చెప్పడంతో సదరు యువకుడు తీవ్రభయాందోళనకు గురై వెంటనే అదే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు.
రెండు రోజలు వైద్యం అందించి బ్లాక్‌ఫంగస్ మందులు తెచ్చుకోవాలని సూచించారు. సదరు మందులు ప్రైవేటులో అందుబాటులో లేక యువకుడు రిఫరల్‌పై గాంధీ ఆస్పత్రి బ్లాక్‌ఫంగస్ వార్డులో అడ్మిట్ అయ్యాడు. పలు రకాల స్కానింగ్‌లు, వైద్య పరీక్షలు నిర్వహించిన గాంధీ వైద్యులు బ్లాక్ ఫంగస్ కాదని, సాధారణ పిప్పిపన్ను అని నిర్ధారించి, డెంటల్ వైద్యులతో కౌన్సిలింగ్ ఇప్పించి డిశ్చార్జి చేశారు.
► పాతబస్తీకి చెందిన మహిళకు కరోరా పాజిటివ్, మూడు రోజుల క్రితం పక్షవాతం రావడంతో స్థాని క ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. బ్లాక్‌ఫంగస్ లక్షణా లు ఉన్నాయని చెప్పడంతో భయాందోళనకు గురైంది. తెలిసిన వారి సలహా మేరకు గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ కాగా, పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్‌తోపాటు పెరాలసిస్ వచ్చిందని, బ్లాక్‌ఫంగస్ ఆనవాళ్లు లేవని చెప్పి, కరోనాకు ట్రీట్‌మెంట్ ఇచ్చి స్వస్థత చేకూరిన తర్వాత డిశ్చార్జి చేశారు.
► బ్లాక్‌ఫంగస్‌ను బూచిగా చూపిస్తూ ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజలను అడ్డంగా దోచు కుంటున్నాయి. పిప్పిపన్ను, పక్షవాతం వంటి రుగ్మతలను బ్లాక్‌ఫంగస్ ఖాతాలో వేయడంతో బాధితులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
► ఓల్డ్‌సిటీకి చెందిన మరోవ్యక్తికి కరోనా, బ్లాక్‌ఫంగస్ లేవు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. స్వల్ప అస్వస్థతకు గురై స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా, బ్లాక్‌ఫంగస్ సోకిందని చెప్పారు. సదరు వ్యక్తి గాంధీఆస్పత్రిలో చేరగా, నిర్ధారణ పరీక్షల్లో కరోనా, బ్లాక్‌ఫంగస్ లేవని తేలింది. సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి బ్లాక్‌ఫంగస్ వార్డులో రిఫరల్‌పై చేరిన ఆరుగురు బాధితులకు ఫంగల్ లక్షణాలు మచ్చుకైనా లేవని గుర్తించారు. ఆయా విభాగాలకు చెందిన వైద్య నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించి బాధితులను డిశ్చార్జి చేశారు.
ఆరుగురు బాధితులను గుర్తించి డిశ్చార్జి చేశాం
ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి రిఫరల్‌పై గాంధీఆస్పత్రి బ్లాక్‌ఫంగస్ వార్డులో చేరిన ఆరుగురికి ఫంగల్ లక్షణాలు లేవు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి డిశ్చార్జీ చేశాము. వీరిలో ముగ్గురు దంత సంబంధ సమస్యలతో... మరో ముగ్గురు పెరాలసిస్ (ఫిట్స్)తో బాధపడుతున్నారు. స్కానింగ్ చేసిన తర్వాత బ్లాక్‌ఫంగస్ సోకినట్లు భావించిన అవయవ భాగాల నుంచి శాంపిల్స్ సేకరించి ఫంగల్ కల్చర్ టెస్ట్‌కు మైక్రోబయోలజీ ల్యాబ్‌కు పంపిస్తాము. బయాప్సీ నివేదిక ఆధారంగా బ్లాక్‌ఫంగస్‌గా నిర్ధారిస్తాము. ప్రజలు భయాందోళనకు గురికావద్దు. గాంధీ, ఈఎన్‌టీ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో బ్లాక్‌ఫంగస్ నివారణకు వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – రాజారావు, గాంధీ సూపరింటెండెంట్
చదవండి: చనిపోయాడని తెలియక.. రాత్రంతా మృతదేహంపై నిద్ర..!
Comments
Please login to add a commentAdd a comment