ఆత్మహత్యకు పాల్పడిన రమేశ్, గుణ సువర్ణ
బెంగళూరు: కరోనా సోకిన అనంతరం బ్లాక్ ఫంగస్ సోకి ఇబ్బందులు ఎదుర్కొంటారనే వార్తలు రావడంతో భయాందోళన చెందిన ఓ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రాణాపాయం ఉందనే వార్తలు టీవీలు, పత్రికల్లో వచ్చిన వాటిని చూసి భయపడిన ఆ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ అంత్యక్రియల కోసం రూ.లక్ష నగదు దాచి ఉంచిన విషయాన్ని చెప్పి మరీ వారు తమ ప్రాణాలను తీసుకున్నారు. ఈ విషాద సంఘటన కర్ణాటకలోని మంగళూరులో జరిగింది.
రమేశ్ (40), గుణ సువర్ణ (35) భార్యాభర్తలు. వీరిద్దరూ మంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. అయితే ఇటీవల అనారోగ్యానికి గురవడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.
అయితే కరోనా సోకిన వారికి బ్లాక్ ఫంగస్ సోకుతుందని వార్తలు వచ్చాయి. ఆ ఫంగస్ ప్రభావం మధుమేహం ఉన్న వారికి తీవ్ర ప్రభావం ఉంటుందని వచ్చిన వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే గుణ సువర్ణకు మధుమేహం ఉంది. తమకు కూడా బ్లాక్ ఫంగస్ సోకితే చికిత్సకు భారీ మొత్తం ఖర్చయితే తాము భరించలేమని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు వీరు వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు కారణాలను వివరించారు.
ఆ వీడియోను మంగళూరు పోలీస్ కమిషనర్ శశికుమార్‌కు పంపించారు. పంపించిన వెంటనే ఇది చూసిన కమిషనర్ వారిని ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. వారు ఎక్కడుంటారో తెలుసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. స్థానిక మీడియాలో కూడా ఇది వివరించి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. చివరకు వారి ఆచూకీ కనుగొనేలోపు ఆ దంపతులు ఆత్మహత్య చేసుకుని తమ నివాసంలో విగతజీవులుగా పడి ఉన్నారు.
చనిపోయిన తర్వాత తమ అంత్యక్రియల కోసం రూ.లక్ష నగదు దాచిన విషయం పోలీసులకు వీడియోలో చెప్పారు. అంతేకాదు తమ దహన సంస్కారాలు సంప్రదాయం ప్రకారం చేయించాలని, దీనికి పోలీస్ కమిషనర్ శశికుమార్, శరణ్ పంప్‌వెల్, సత్యజిత్ సురత్‌కల్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తమ ఇంట్లోని వస్తువులు పేదలకు పంచాలని ఆ దంపతులు వీడియోలో చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే వీరికి పిల్లలు లేరు. సంతాన లేమితో కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు.
చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్ డ్యాన్స్.. ముగ్ధుడైన భర్త
చదవండి: నీరజ్ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
Comments
Please login to add a commentAdd a comment