సాక్షి, మహబూబ్‌నగర్: ఇప్పటికే కరోనా మహమ్మారితో అన్ని వర్గాల జనం అల్లాడుతున్నారు. ఇది చాలదన్నట్లు బ్లాక్ ఫంగస్(మ్యూకోర్ మైకోసిస్) కేసులు వెలుగులోకి రావడం కలవరపెడుతోంది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న ఉమ్మడి పాలమూరు పరిధిలోని నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లికి చెందిన ఒకరు, రంగాపూర్‌కు చెందిన మరొకరు బ్లాక్ ఫంగస్ బారినపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు.
అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూరు మండలంలో ఒక అనుమానితుడిని శుక్రవారం కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రికి తరలించారు. ఇందులో పోల్కంపల్లికి చెందిన యువకుడి కన్ను తీసివేయడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇదే క్రమంలో బ్లాక్ ఫంగస్‌ను కేంద్రం తాజాగా అంటువ్యాధుల జాబితాలో చేర్చడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే దీనిపై ఆందోళన అవసరం లేదని, చికిత్స ఉందని.. ముందు గుర్తిస్తే తొలి దశలోనే నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఎలా గుర్తు పట్టాలి..
మధుమేహం అదుపులో లేనప్పుడు వాడే స్టెరాయిడ్స్ వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుందని.. కరోనా సోకిన వారిలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు అధిక సంఖ్యలో స్టెరాయిడ్స్ వాడాల్సి వస్తుందని.. దీని వల్ల బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు కోలుకున్న తర్వాత ముక్కు రంధ్రాలు మూసుకుపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా.. దవడ ఎముకల్లో నొప్పి వ చ్చినా.. మొహం వాచినా.. ఒకవైపు మాత్రమే నొప్పి ఉన్నా.. కంటి, పంటి నొప్పి ఉన్నా.. ఛాతిలో నొప్పి, జ్వరం వచ్చినా.. వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి.
చికిత్స.. జాగ్రత్తలు
ప్రస్తుతం బ్లాక్‌ఫంగస్ బారిన పడిన వారికి ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చికిత్స చేస్తలేరు. అందరిని హైదరా బాద్ కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రధానంగా ముక్కు నుంచి కంటికి.. ఆ తర్వాత మెదడుకు బ్లాక్‌ఫంగస్ వ్యాప్తి చెందుతుందని వైద్యు లు పేర్కొంటున్నారు. బ్లాక్ ఫంగస్ నిర్ధారణకు ముక్కులోని తెమడను పరీక్షించాలని.. నిర్ధారణ అయితే సిటీ స్కాన్, ఎమ్మారైతో ముక్కు, సైనస్ లోపల ఈ ఫంగస్ ఏయే భాగాలకు సోకిందో తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఆ తర్వాత తగిన సర్జరీ లేదా చికిత్స చేసి ఫంగస్‌ను తొలగించొచ్చని.. ఇతర భాగాలకు సోకకుండా చేయొచ్చని చెబుతున్నారు.
చదవండి: బ్లాక్ ఫంగస్ అంటువ్యాధా.. డాక్టర్లు ఏమంటున్నారు?
బ్లాక్ ఫంగస్ లక్షణాలు..
కళ్లు, మొహం వాపు.. కంటి, చెంప నొప్పి.. కళ్లు ఎర్రగా మారడం.. నొప్పి ఎక్కువగా ఉండడం.. నాలుకపై కురుపులు.. ముక్కు నుంచి నీరు కారడం.. ముక్కు దిబ్బడ.. రక్తంతో కూడిన వాంతుల వంటివి బ్లాక్ ఫంగస్ లక్షణాలు అని.. వీటిని ముందే గుర్తిస్తే ఎలాంటి ప్రాణాపా యం ఉండదని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా కోవిడ్ నుంచి కోలుకున్న మధుమేహ వ్యాధిగ్రస్తులు బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారని.. ఈ మేరకు ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచిస్తున్నారు.
చికిత్స ఉంది.. భయపడొద్దు..
కోవిడ్ బారిన పడిన వారిలో రోగ నిరోధక వ్యవస్థను అదుపు చేయడానికి.. రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు స్టెరాయిడ్స్ వాడుతారు. వీటి వల్ల ప్రధానంగా కరోనా నుంచి కోలుకున్న మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్, బీపీ ఉన్న వారికి అనవసరంగా స్టెరాయిడ్లు ఇవ్వొద్దు. బ్లాక్ ఫంగస్ బారిన పడ్డవారు రోగ నిరోధక శక్తిని అదుపులో ఉంచే మందులు వాడొద్దు. నాలుగు నుంచి ఆరు వారాల పాటు యాంటీ ఫంగల్ చికిత్స తీసుకోవాలి. బ్లాక్ ఫంగస్‌కు చికిత్స ఉంది.. ఎవరూ భయపడొద్దు. ముందే గుర్తిస్తే అవయవాలకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడొచ్చు.
– సంపత్ కుమార్, ఈఎన్‌టీ వైద్యుడు, మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment