Anxiety symptoms vs COVID-19 (coronavirus) symptoms, Doctor Suggestion - Sakshi
Sakshi News home page

కరోనా వచ్చి పోయినా జలుబు తగ్గట్లేదు.. బ్లాక్‌ ఫంగసా?

Published Mon, May 17 2021 10:38 AM | Last Updated on Thu, May 20 2021 10:46 AM

Anxiety On Coronavirus Symptoms, Doctor Suggestion - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఖమ్మం: కరోనా సోకిన వారు అనవసర ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండి.. వైద్యులు సూచించిన మందులు వాడడం ద్వారా మహమ్మారిని జయించొచ్చని ఖమ్మంలోని సాయిరాం గ్యాస్ట్రో, లివర్‌ హాస్పిటల్‌ గ్యాస్ట్రెంటాలజిస్ట్‌ డాక్టర్‌ జంగాల సునీల్‌ కుమార్‌ అన్నారు. మంచి ఆహారం, ప్రశాంత జీవనం, కంటినిండా నిద్ర ద్వారా త్వరగా కోలుకోవచ్చని తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉండి కూడా మనో నిబ్బరంతో కరోనా గండాన్ని అధిగమించిన వారు అనేకమంది ఉన్నారని తెలిపారు. గాలి, వెలుతురు ఉన్న గదిలో ఉంటూ, ఎక్కువ శాతం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

ఇంట్లో వారితో  దూరం పాటిస్తూ ఉండాలని, ప్రతిరోజూ 3 నుంచి∙4 లీటర్ల మంచినీళ్లు తాగుతూ, ప్రొటీన్, విటమిన్లతో కూడిన ఆహారం తీసుకోవాలన్నారు. సాక్షి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అనేకమంది ఫోన్‌ చేసి సందేహాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ జంగాల సునీల్‌ కుమార్‌ వాటిని నివృత్తి చేశారు. 


డాక్టర్‌ జంగాల సునీల్‌ కుమార్, గ్యాస్ట్రెంటాలజిస్ట్, సాయిరాం గ్యాస్ట్రో లివర్‌ హాస్పిటల్, ఖమ్మం 

చదవండి: Corona: పిల్లల్లో కోవిడ్‌ లక్షణాలను ఎలా గుర్తుపట్టాలి?

ఆ వివరాలు ఇలా..
ఖమ్మం నుంచి సాంబయ్య: నేను పది రోజుల్నుంచి హోం ఐసోలేషన్‌లో ఉన్నా. కరోనా ఎప్పుడు తగ్గిపోతుంది సార్‌?
డాక్టర్‌:
ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటే 15 రోజుల్లో తగ్గిపోతుంది. ఆ తర్వాత సాధారణ జీవనాన్ని కొనసాగించవచ్చు. కరోనా తగ్గినా చాలా మందికి నీరసంగా ఉంటుంది. బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది. 

కామేపల్లి నుంచి సంతోష్‌: ఈ రోజుల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
డాక్టర్‌:
లక్షణాలు ఉన్న వారు ప్రతిరోజూ లిక్విడ్‌ ఫుడ్‌ తీసుకోవడం మంచిది. తరచూ పండ్ల జ్యూస్, పెరుగన్నం, కొబ్బరి నీళ్లు, జావ, ఉడక బెట్టిన గుడ్లు తీసుకోవాలి. లక్షణాలు తగ్గిన తర్వాత చేపలు, కాయగూరలు, పన్నీరు, డ్రైఫ్రూట్స్, వాటర్‌ మిలన్‌ సీడ్స్, గుమ్మడి కాయసీడ్స్, పొద్దుతిరుగుడు గింజలతో కూడినవి తీసుకోవాలి. అలాగే ప్రొటీన్‌ ఫుడ్‌ కూడా తీసుకోవాలి.

ఖమ్మం నుంచి నాగేశ్వరరావు: నాకు కరోనా వచ్చి పోయింది. కానీ జలుబు తగ్గట్లేదు ఎందుకు?
డాక్టర్‌:
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్లాక్‌ ఫంగస్‌కి సాధారణంగా కళ్లు, ముఖం వాపు, జ్వరం, తదితర లక్షణాలు ఉంటాయి. ఇది అలాంటిది కాదులెండి. సిట్రజిన్‌ టాబ్లెట్‌ వేసుకోండి. రెండు, ముడు రోజుల్లో తగ్గుద్ది.

ఖమ్మం నుంచి షర్ఫుద్దీన్‌: నాకు 20 రోజులుగా ఆయాసం వస్తోంది. కరోనా అనుకోవచ్చా డాక్టర్‌? 
డాక్టర్‌:
పల్స్‌ ఆక్సిమీటర్‌తో చెక్‌ చేసుకుంటే 95 శాతానికి పైగా ఉంటే ఇబ్బంది లేదు. అంతకన్నా తక్కువైతే డాక్టర్‌ను సంప్రదించండి. కరోనా లక్షణాలు ఉన్న వారు 7 రోజులకు సీటీ స్కాన్‌ చేయించుకుంటే కచ్చితమైన రిపోర్ట్‌ వస్తుంది. 

చింతకాని నుంచి అనంత్‌: నాకు కరోనా వచ్చి రెండు వారాలైంది. ఆక్సిజన్‌ లెవెల్స్‌ 85 శాతానికి పడిపోయాయి. ఏం చేయాలి?
డాక్టర్‌: ఆక్సిజన్‌ లెవెల్స్‌ 95 శాతానికి పడిపోతే ఇబ్బంది ఉంటుంది. ఆక్సిజన్‌ రేటు సాధారణ స్థితికి వచ్చే వరకు ఆక్సిజన్‌ పెట్టుకోవాలి. భయపడకుండా ఉండండి. తగ్గిపోతుంది. 

ముదిగొండ నుంచి సీతారామరాజు: బీపీ, షుగర్‌ ఉన్న వారు టీకా తీసుకోవచ్చా?
డాక్టర్‌:
బీపీ, షుగర్‌కు టీకా తీసుకోవడానకి ఎలాంటి సంబంధం లేదు. నిర్భంయంగా తీసుకోవచ్చు. తర్వాత కొందరికి జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తుంటాయి. అంతమాత్రాన ఆందోళన చెందకూడదు. ఒకటి, రెండు రోజులు మాత్రమే ఉంటాయి. 

బల్లేపల్లి నుంచి రఘురాం: కోవిషీల్డ్‌ రెండో డోసు ఎప్పుడు వేయించుకుంటే మంచిది?
డాక్టర్‌:
సాధారణంగా కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ 6 నుంచి 8 వారాల మధ్య వేసుకోవాలి. ఇటీవల ఐసీఎంఆర్‌ 12 నుంచి 16 వారాల మధ్య వేసుకోవచ్చని సూచించింది. కరోనా నుంచి బయట పడాలంటే వ్యాక్సిన్‌ వేయించుకోవడం ఒక్కటే మార్గం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement