
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులకు తగినట్లుగా కేంద్ర ప్రభుత్వం యాంఫోటెరిసిన్ బి ఇంజక్షన్లను సరఫరా చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,400 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా కేంద్రం కేటాయించిన ఇంజక్షన్లు 13,830 మాత్రమేనని, ఇవి రోగులకు ఏ మాత్రం సరిపోవని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఇంజక్షన్లు కొనుగోలు చేసేందుకు ఫార్మా కంపెనీ మైలాన్‌కు ఆర్డర్ ఇచ్చినా కేంద్రం సరఫరాను నియంత్రించడం వల్ల తగినన్ని ఇంజక్షన్లు పొందలేకపోతున్నట్లు న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. హైకోర్టు దీనిపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. 1,400 కేసులున్నప్పుడు కేవలం 13,830 ఇంజక్షన్లు కేటాయిస్తే రోగుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. కేటాయింపులు పెంచాల్సిందేనని స్పష్టం చేసింది. తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని స్పష్టం చేస్తూ ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
చిన్నారులు జాగ్రత్త..
కోవిడ్ థర్డ్‌వేవ్ వల్ల చిన్న పిల్లలు ఎక్కువగా ప్రభావితం అవుతారన్న వార్తలు వస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. బెడ్లు, ఆక్సిజన్ కంటే ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సింగ్, ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, దీన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
తగినంత మంది చిన్న పిల్లల డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 500 బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రి మాదిరిగా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటుపై పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజయలక్ష్మీ, జస్టిస్ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.
బిల్లులపై నోడల్ అధికారి సంతకం తప్పనిసరి..
హైకోర్టు ధర్మాసనం సూచనలను పరిగణలోకి తీసుకుంటూ కరోనా చికిత్సకు సంబంధించిన బిల్లులపై ఆయా ఆసుపత్రులు నోడల్ అధికారుల సంతకం తప్పనిసరిగా తీసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ నివేదించారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం రాష్ట్రవ్యాప్తంగా 19 ఆసుపత్రులను నోటిఫై చేశామని, ఒక్కో రోగికి రోజుకు నాలుగు ఇంజక్షన్ల చొప్పున 15 రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. చిన్నారులకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు పీడియాట్రిక్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది...
దీనిపై ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎన్.హరినాథ్‌ను వివరణ కోరడంతో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు ప్రతి రోగికి ప్రాథమికంగా అవసరం ఉండదని, కొరత తీవ్రంగా ఉన్నందున కేసుల తీవ్రతను బట్టి కేటాయిస్తున్నామని చెప్పారు. దేశంలో వీటి తయారీ చాలా తక్కువని, ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని తెలిపారు. అయితే ఇవన్నీ తమకు అవసరం లేదని, దాదాపు 13 వేల ఇంజక్షన్లతో 1,400 మందికి ఎలా చికిత్స అందిగలరని ప్రశ్నిస్తూ లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment