పల్లెలపై ఫోకస్‌ | AP Govt has decided to increase monitoring of villages about Covid | Sakshi
Sakshi News home page

పల్లెలపై ఫోకస్‌

Published Thu, May 20 2021 3:24 AM | Last Updated on Thu, May 20 2021 10:45 AM

AP Govt has decided to increase monitoring of villages about Covid - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా సెకండ్‌ వేవ్‌ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిన నేపథ్యంలో గ్రామాలపై పర్యవేక్షణ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీకాలు వేయడంతో పాటు ప్రతి ఒక్కరినీ పరీక్షించాలని.. వైరస్‌ ప్రభావిత వ్యక్తులను వేరుగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తద్వారా వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఇవీ మార్గదర్శకాలు
► ప్రతి గ్రామంలో జ్వర బాధితులపై నిఘా ఉంచాలి. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలి. రోజూ ఆరోగ్య ఉప కేంద్రాల్లో జ్వర పరీక్షలు చేయాలి. గంట సేపు గ్రామాల్లో దండోరా వేయించాలి.
► గ్రామ వలంటీర్లతో పాటు ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి లక్షణాలున్న వారిని గుర్తించాలి. జ్వర లక్షణాలున్న వ్యక్తి ఇంటికే వెళ్లి ఏఎన్‌ఎంలు పరీక్షించాలి. అలాంటి వారికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్‌తో పరీక్ష చేయించాలి. ఫలితాలను బట్టి పేషెంట్‌కు వైద్యం చేయాలి.
► ఇళ్లలో ఒంటరిగా ఉన్న వ్యక్తులకు టెలీ కన్సల్టేషన్‌ అందుబాటులో ఉండాలి. లేదా 104 సేవ ద్వారా సలహా ఇవ్వాలి.    తీవ్రమైన కోవిడ్‌ లక్షణాలుండి, ఆక్సిజన్‌ తక్కువగా ఉంటే మెడికల్‌ ఆఫీసర్‌ దగ్గరకు లేదా కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు పంపించాలి.
► ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్‌లు ఆరోగ్య ఉప కేంద్రాలు, పీహెచ్‌సీలలో అందుబాటులో ఉంచాలి. కోవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ సాంద్రతపై ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలి.
► పల్సాక్సీ మీటర్‌తో ఆక్సిజన్‌ సాంద్రత, థర్మామీటర్‌తో జ్వరం ప్రతిరోజూ నిర్ధారణ చేయాలి.
► 94 కంటే ఆక్సిజన్‌ తక్కువగా ఉంటే కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు వెళ్లాల్సిందిగా సూచించాలి. గ్రామాల్లోనే మినీ కోవిడ్‌ కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి.. ఇంట్లో ఉండలేని వారిని అక్కడకు తీసుకెళ్లాలి. మినీ కేంద్రాలను వైద్యాధికారి సందర్శించాలి.
► ఆస్పత్రికి తీసుకెళ్లడానికి గ్రామ సచివాలయం ఒక వాహనాన్ని అద్దెకు తీసుకోవచ్చు. పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు, వైద్యం అందేలా చూడాలి. 
► గ్రామాల్లో కోవిడ్‌ పరిస్థితులను రోజువారీ పర్యవేక్షించడానికి గ్రామ కమిటీ ఉంటుంది. దీనికి సర్పంచ్‌ చైర్మన్‌గా, ఏఎన్‌ఎంలు సభ్యులు, కన్వీనర్‌గా ఉంటారు. ఆశా కార్యకర్త, గ్రామ వలంటీర్‌తో పాటు మరో ఇద్దరు సభ్యులు ఉంటారు.
► ఆయా కమిటీలు కోవిడ్‌పై విస్తృత ప్రచారం కల్పించి, నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement