‘సాక్షి’ఇంటర్వ్యూలో డీఎంఈ రమేశ్‌రెడ్డి స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా లైపోజోమల్ యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షన్ల కొరత ఉంది. ఈ విషయం తెలిసి కూడా కొంతమంది వైద్యులు వాటినే రాస్తున్నారు. మార్కెట్లో అందుబాటులో లేని ఈ మందులు రాసి రోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది ఏమాత్రం సరికాదు’ అని వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి చెప్పారు. మంగళవారం ‘సాక్షి’ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. బ్లాక్ ఫంగస్ రోగుల నిష్పత్తికి అనుగుణంగా అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంచుతున్నట్లు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎన్ని నమోదయ్యాయి?
హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో 230 మంది రోగులు చికిత్స పొందుతుండగా, గాంధీ ఆస్పత్రి కోవిడ్ సెంటర్‌లో మరో 110 మంది ఉన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో 300 మంది వరకు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
రోగులకు పడకలు దొరకట్లేదు కదా?
నిజమే. బ్లాక్ ఫంగస్ గురించి ఊహించలేదు. అకస్మాత్తుగా కేసులు వెలుగు చూశాయి. ఆ వెంటనే వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిని బ్లాక్ ఫంగస్ నోడల్ కేంద్రంగా ప్రక టించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో పడకలన్నీ రోగుల తో నిండిపోయాయి. ఈఎన్‌టీ, గాంధీ ఆస్పత్రు లపై భారం తగ్గించేందుకు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లోనూ బ్లాక్ ఫంగస్ చికిత్సల కోసం 1,500 పడకలు కేటాయించాలని నిర్ణయించాం. వచ్చిన ప్రతి రోగిని చేర్చుకుని పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందిస్తాం.
బ్లాక్ ఫంగస్ కోసం ఏ ఆస్పత్రిలో ఎన్ని పడకలు ఏర్పాటు చేస్తున్నారు?
ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఇప్పటికే 250 పడకలు ఏర్పాటు చేశాం. వీటిని 300కు పెంచుతున్నాం. గాంధీలో 350, సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో 200, టిమ్స్‌లో 50, కింగ్‌కోఠిలో 30, కొండాపూర్‌లో 50 పడకలచొప్పున కేటాయించాలని ఇప్పటికే ఆయా ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశాం. జిల్లా ఆస్పత్రులు, ఇతర టీచింగ్ ఆస్పత్రుల్లోనూ పడకలు సమకూర్చుతున్నాం.
బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరత నిజమేనా?
బ్లాక్ ఫంగస్ చికిత్సలో లైపోజోమల్ యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షన్లు వాడుతుంటారు. అయితే ఇప్పటివరకు ఈ తరహా కేసులు పెద్దగా నమోదు కాకపోవడంతో ఫార్మా కంపెనీలు ఆ మేరకు ఉత్పత్తి చేయలేదు. ఒక్క తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఈ ఇంజెక్షన్ల కొరత ఉంది. కేంద్రం ఇప్పటివరకు 23,680 ఇంజెక్షన్లను ఆయా రాష్ట్రాలకు పంపగా.. వీటిలో తెలంగాణకు 890 వయల్స్ మాత్రమే కేటాయించింది. కేటాయించిన దానిలోనూ సగమే సరఫరా కావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
యాంఫోటెరిసిన్–బికి ప్రత్యామ్నాయ మందులు ఉన్నాయా?
యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షన్లకు ప్రత్యామ్నాయం గా పొసకొనజోల్, ఫ్లూకోనజోల్ ఇంజెక్షన్లు ఉన్నా యి. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరిన వారికి ఈ మందులు వాడుతున్నాం. ప్రైవేటు ఆçస్పత్రుల్లోని వైద్యులకు కూడా ఇదే సూచిస్తున్నాం. కానీ కొంత మంది వైద్యులు మార్కెట్‌లోదొరకని వాటిని రాసి రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది సరికాదు.
Comments
Please login to add a commentAdd a comment