ఔషధం తయారీకి కావాల్సిన ముడి వస్తువులను పరిశీలిస్తున్న చెవిరెడ్డి, శ్రీధర్
చంద్రగిరి: కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపటా్ననికి చెందిన ఆనందయ్య మందును చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తయారు చేస్తున్నారు. ఈ సంప్రదాయ మందును చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని తలపెట్టిన ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇందుకు చొరవ తీసుకున్నారు. ఆనందయ్య తనయుడు శ్రీధర్, శిష్యుల సహకారం తీసుకున్నారు. ఈ మందు తయారీని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనందయ్య మందును ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు.
అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. కరోనా రాకుండా, శరీరంలో రోగ నిరోధకశక్తి పెంచే విధంగా, బ్లాక్ ఫంగస్ వంటి వాటిని నియంత్రించే ప్రివెంటివ్ (పి) మందు మాత్రమే ఇక్కడ తయారు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 1.6 లక్షల కుటుంబాల్లో 5.20 లక్షలమంది ప్రజలకు ఈ మందును ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాల్లో లభించే వేప, మారేడు, బుడ్డ బుడవ ఆకులు, కొండపల్లేరు కాయలు, తెల్లజిల్లేడు పూలు తీసుకొచ్చారని తెలిపారు. మరో 11 రకాల ముడి సరుకులను సమకూర్చామన్నారు.
రెండు రోజుల్లో నియోజకవర్గంలోని 142 పంచాయతీలు, దాదాపు 1,600 గ్రామాల్లో ఈ మందును పంపిణీ చేస్తామని చెప్పారు. ఆనందయ్య తనయుడు శ్రీధర్ మాట్లాడుతూ కరోనా కట్టడికి ఉపయుక్తమైన సంప్రదాయ మందు తయారీలో ఎమ్మెల్యే చెవిరెడ్డి చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. మందు తయారీలో ఆనందయ్య కుమారుడితోపాటు శిష్యులు చంద్రకుమార్, సురేష్, వంశీకృష్ణ పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment