సాక్షి, అమరావతి: వైద్యుల పర్యవేక్షణ లేకుండా మితిమీరిన స్టెరాయిడ్స్ వాడకమే బ్లాక్ ఫంగస్‌కు కారణమని ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ కేఎస్ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి ఎక్కువగా బ్లాక్ ఫంగస్ వస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. బ్లడ్ షుగర్ ఎక్కువ ఉండి స్టెరాయిడ్స్ అధికంగా వాడిన వారికి బ్లాక్ ఫంగస్ వస్తోందని వైద్యులు చెబుతున్నారన్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బ్లాక్ ఫంగస్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో 11 టీచింగ్ ఆస్పత్రులు, 2 ఈఎన్‌టీ ఆస్పత్రులను నోటిఫై చేశామని, ఇప్పటికే బ్లాక్ ఫంగస్‌ను ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నామని జవహర్‌రెడ్డి తెలిపారు. బ్లాక్ ఫంగస్ వైద్యం మందుల కోసం కేంద్రాన్ని సంప్రదించామని, ఇప్పటికే కేంద్రం బ్లాక్ ఫంగస్ ట్రీట్‌మెంట్‌లో ఉపయోగించే లైపోజోమల్ ఆంఫోటెరిసిన్- బి ఇంజక్షన్లను రెండు వేలు పంపిందని తెలిపారు. ఈ ఇంజక్షన్స్ కొనుగోలుకు కంపెనీలతో నేరుగా మాట్లాడుతున్నామని, 75 వేల లైపోజోమల్ ఆంఫోటెరిసిన్- బి ఇంజక్షన్లకు ఆర్డర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
20 వేల ఇంజక్షన్ల ఆర్డర్
వీటిలొ మూడు వేల ఇంజక్షన్లు వచ్చాయని, రెండ్రోజుల్లో మరో రెండు వేల డోసులు వస్తాయని ఆశిస్తుస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే దీనికి ముడిపదార్ధాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో అవసరమైన మరో మందు పుష్కలోజోనల్ కోసం కంపెనీలతో మాట్లాడుతున్నామన్నారు. ఇవి ట్యాబ్లెట్స్, ఇంజక్షన్ల రూపంలో ఉంటాయని, లక్ష ట్యాబ్లెట్స్, 20 వేల ఇంజక్షన్లను ఆర్డర్ చేశామని తెలిపారు. సీఎం జగన్ ఆదేశాలతో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వేర్వేరుగా క్వారంటైన్ కేంద్రాలు
అదే విధంగా కోవిడ్ కట్టడికి స్వచ్చంద సంస్థలు సహకరించాలని జవహర్‌రెడ్డి కోరారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ అధికారులతో సమన్వయ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేర్చడంలో స్వచ్చంద సంస్థలు వారధిగా ఉండాలని, కోవిడ్ కుటుంబాలకు మానసిక, సామాజిక మద్దతు అందించాలన్నారు. ఐసోలేషన్, వ్యాక్సినేషన్, టెస్టింగ్ కేంద్రాల నిర్వహణ బాధ్యతను ఎన్జీవోలు స్వీకరించాలని తెలిపారు. సంచార వాహనాల ద్వారా చిన్నారులు, వృద్ధులకు వారి ఇళ్ల వద్దే కోవిడ్ టెస్టింగ్ సేవలు అందించాలని పేర్కొన్నారు. అనాథ బాల, బాలికలకు వేర్వేరుగా క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జవహర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment