సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఇప్పటి వరకు బ్లాక్‌ఫంగస్ నియంత్రణకు వాడే యాంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లు 3 వేలు పంపిణీ చేశామని, ఎప్పటికప్పుడు కేసుల పరిశీలన చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ఇంజక్షన్ల లభ్యతను బట్టి రాష్ట్రానికి తెప్పిస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న మందుపై నాలుగు రోజుల్లో స్పష్టత ఇస్తామన్నారు. ఇప్పటికే ఈ మందు నమూనాలు హైదరాబాద్ ల్యాబొరేటరీతో పాటు సెంట్రల్ ఆయుర్వేదిక్ ల్యాబొరేటరీకి వెళ్లాయని, ఫలితాలు రెండు మూడు రోజుల్లో రానున్నాయని, వచ్చిన వెంటనే నిర్ణయం వెలువరిస్తామన్నారు.
రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల నుంచి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల డిమాండ్ బాగా తగ్గిందని, గడిచిన 24 గంటల్లో 5,640 ఇంజక్షన్లు మాత్రమే ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో 22 వేల ఇంజక్షన్లు అందుబాటులో ఉండగా, ఇప్పుడు 41 వేలకు పైగా ఉన్నాయన్నారు. బుధవారం నాటికి ప్రభుత్వాస్పత్రుల్లో 75 వేల ఇంజక్షన్లు అందుబాటులో ఉంటాయన్నారు. గత 24 గంటల్లో 767 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి తీసుకొచ్చామని, 650 మెట్రిక్ టన్నుల వినియోగం జరుగుతోందన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆక్సిజన్ నిల్వ చేస్తున్నామన్నారు. బ్లాక్ ఫంగస్‌తో మృతిచెందినట్టు తమకు సమాచారం లేదన్నారు. నేడు, రేపు కోవాగ్జిన్ సెకండ్ డోసు పంపిణీ చేస్తున్నామన్నారు. 78 వేల కోవాగ్జిన్ డోసులు రావాల్సి ఉందన్నారు. 45 ఏళ్లు దాటి, ప్రజలతో సత్సంబంధాలు కలిగిన ఉద్యోగులకు కోవిషీల్డ్ మొదటి డోస్ ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్టాకును జూన్ 15 వరకు మొదటి డోసుగా వేస్తామని, తర్వాత కేంద్రం నుంచి వచ్చే స్టాకును బట్టి రెండో డోస్ వేస్తామన్నారు.
జిల్లాలకు 3 వేల బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు
Published Wed, May 26 2021 4:44 AM | Last Updated on Wed, May 26 2021 7:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment