సాక్షి, హైదరాబాద్/ గన్‌ఫౌండ్రి: రాష్ట్రంలో త్వరలో ఎయిర్ అంబులెన్సులు ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ఏ మూలన అత్యవసర పరిస్థితి ఏర్పడినా రోగులను హెలికాప్టర్ ద్వారా దవాఖానాకు తరలిస్తామన్నారు. కోటీశ్వరులకే పరిమితమైన ఈ సేవలను పేదలకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. సోమవారం రవీంద్రభారతిలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పదేళ్ల ప్రగతి నివేదికను ఆయన విడుదల చేశారు. అలాగే 310 మంది ఫార్మసిస్టులకు పోస్టింగ్ ఆర్డర్లు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత తొమ్మిదేళ్లలో వైద్య ఆరోగ్యశాఖలో 22,600 పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. మరో 7,291 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇందులో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టులకు పరీక్ష పూర్తయిందని, వారం పది రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. మరో 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు, 1,931 ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్ (దరఖాస్తు దశ) పోస్టులు కూడా ఉన్నాయని వివరించారు. ఇవి కూడా పూర్తయితే పదేళ్లలోనే 30 వేల ఉద్యోగాలు వైద్య ఆరోగ్యశాఖలో ఇచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ
పదేళ్ల ప్రయాణంలో ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. అరవై ఏళ్లలో సాధ్యం కాని అద్భుతాలను దశాబ్ద కాలంలోనే ఆవిష్కరించిందన్నారు. 2014లో నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో 11 వ స్థానంలో ఉంటే, ఇప్పుడు మూడో ర్యాంకుకు చేరుకున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైద్య రంగానికి రూ.12,364 కోట్ల బడ్జెట్ పెట్టామని, ఒక్కొక్కరి వైద్యానికి చేస్తున్న తలసరి ఖర్చు రూ.3,532 అని తెలిపారు.
తద్వారా దేశంలో మూడో స్థానంలో నిలిచామని చెప్పారు. తెలంగాణ వైద్య ఆరోగ్య రంగం మొత్తం 50 వేల పడకలతో కరోనా కాదు దాని తాత వచ్చినా ఎదుర్కొనేలా సిద్ధమైందని మంత్రి పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిలో అవయవ మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో దేశ విదేశాల నుంచి వచ్చి అవయవ మార్పిడులు చేసుకునేలా ప్రభుత్వ ఆస్పత్రులు మారబోతున్నాయని చెప్పారు.
ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్‌లో ప్రతినెల సగటున 8 మందికి బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ ఉచితంగా చేస్తున్నారని తెలిపారు. ఔషధాల అందుబాటు, పంపిణీ ప్రక్రియలో తెలంగాణ త్వరలో రెండో స్థానానికి చేరనున్నట్టు హరీశ్‌రావు వివరించారు. ఔషధాలను సమకూర్చడం, రోగులకు అందించడంలో ఫార్మాసిస్టులది కీలక పాత్ర అంటూ కొత్త ఫార్మాసిస్టులకు ఆయన స్వాగతం పలికారు.
త్వరలో పేదలకు ఎయిర్ అంబులెన్స్‌లు
Published Tue, Sep 26 2023 4:44 AM | Last Updated on Tue, Sep 26 2023 4:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment