Air Ambulances
-
త్వరలో పేదలకు ఎయిర్ అంబులెన్స్‌లు
సాక్షి, హైదరాబాద్/ గన్‌ఫౌండ్రి: రాష్ట్రంలో త్వరలో ఎయిర్ అంబులెన్సులు ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ఏ మూలన అత్యవసర పరిస్థితి ఏర్పడినా రోగులను హెలికాప్టర్ ద్వారా దవాఖానాకు తరలిస్తామన్నారు. కోటీశ్వరులకే పరిమితమైన ఈ సేవలను పేదలకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. సోమవారం రవీంద్రభారతిలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పదేళ్ల ప్రగతి నివేదికను ఆయన విడుదల చేశారు. అలాగే 310 మంది ఫార్మసిస్టులకు పోస్టింగ్ ఆర్డర్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత తొమ్మిదేళ్లలో వైద్య ఆరోగ్యశాఖలో 22,600 పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. మరో 7,291 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇందులో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టులకు పరీక్ష పూర్తయిందని, వారం పది రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. మరో 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు, 1,931 ఎంపీహెచ్ఏ (ఫిమేల్ (దరఖాస్తు దశ) పోస్టులు కూడా ఉన్నాయని వివరించారు. ఇవి కూడా పూర్తయితే పదేళ్లలోనే 30 వేల ఉద్యోగాలు వైద్య ఆరోగ్యశాఖలో ఇచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ పదేళ్ల ప్రయాణంలో ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. అరవై ఏళ్లలో సాధ్యం కాని అద్భుతాలను దశాబ్ద కాలంలోనే ఆవిష్కరించిందన్నారు. 2014లో నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో 11 వ స్థానంలో ఉంటే, ఇప్పుడు మూడో ర్యాంకుకు చేరుకున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైద్య రంగానికి రూ.12,364 కోట్ల బడ్జెట్ పెట్టామని, ఒక్కొక్కరి వైద్యానికి చేస్తున్న తలసరి ఖర్చు రూ.3,532 అని తెలిపారు. తద్వారా దేశంలో మూడో స్థానంలో నిలిచామని చెప్పారు. తెలంగాణ వైద్య ఆరోగ్య రంగం మొత్తం 50 వేల పడకలతో కరోనా కాదు దాని తాత వచ్చినా ఎదుర్కొనేలా సిద్ధమైందని మంత్రి పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిలో అవయవ మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో దేశ విదేశాల నుంచి వచ్చి అవయవ మార్పిడులు చేసుకునేలా ప్రభుత్వ ఆస్పత్రులు మారబోతున్నాయని చెప్పారు. ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్లో ప్రతినెల సగటున 8 మందికి బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ ఉచితంగా చేస్తున్నారని తెలిపారు. ఔషధాల అందుబాటు, పంపిణీ ప్రక్రియలో తెలంగాణ త్వరలో రెండో స్థానానికి చేరనున్నట్టు హరీశ్‌రావు వివరించారు. ఔషధాలను సమకూర్చడం, రోగులకు అందించడంలో ఫార్మాసిస్టులది కీలక పాత్ర అంటూ కొత్త ఫార్మాసిస్టులకు ఆయన స్వాగతం పలికారు. -
నక్సల్స్ ప్రాంతాల్లో హెలికాప్టర్లు
గాయపడిన పోలీసులను వైద్యానికి తరలించేందుకే ఈసీ ఆదేశాలతో వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసుల కోసం హెలికాప్టర్లు ఏర్పాటు చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. నక్సల్స్ దాడుల్లో ఎవరైనా గాయపడితే, వారిని తక్షణమే ఆస్పత్రులకు తరలించేందుకు వాటిని వినియోగించనుంది. క్షతగాత్రులను తీసుకెళ్లడానికి అంబులెన్సులైతే జాప్యం జరుగుతుందని, అందుకే ఎయిర్ అంబులెన్సులు (హెలికాప్టర్లు) ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు తొలుత తెలంగాణ ప్రాంతంలో జరిగే ఎన్నికలకు హెలికాప్టర్లు ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత సీమాంధ్రకి తరలించాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రయత్నాలు మొదలెట్టారు. తెలంగాణలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, సీమాంధ్రలో తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు. ఏదై నా హింస చోటుచేసుకుని పోలీ సులు గాయపడితే వారిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు తీసుకొచ్చేందుకు శిక్షణ పొందిన సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. వైద్య సేవల కోసం సీమాంధ్రలోని రాయల్ ఆస్పత్రి, జీఎస్ఎల్ వైద్య కాలేజీ(రాజమండ్రి), సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, రాఘవ ఎమర్జెన్సీ ఆస్పత్రి(కాకినాడ)ని గుర్తించినట్టు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే, తెలంగాణలో ఆస్పత్రులను గుర్తించాల్సి ఉందన్నారు.