- గాయపడిన పోలీసులను వైద్యానికి తరలించేందుకే
- ఈసీ ఆదేశాలతో వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు
నక్సల్స్ ప్రాంతాల్లో హెలికాప్టర్లు
Published Wed, Apr 16 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 AM
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసుల కోసం హెలికాప్టర్లు ఏర్పాటు చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. నక్సల్స్ దాడుల్లో ఎవరైనా గాయపడితే, వారిని తక్షణమే ఆస్పత్రులకు తరలించేందుకు వాటిని వినియోగించనుంది. క్షతగాత్రులను తీసుకెళ్లడానికి అంబులెన్సులైతే జాప్యం జరుగుతుందని, అందుకే ఎయిర్ అంబులెన్సులు (హెలికాప్టర్లు) ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఈ మేరకు తొలుత తెలంగాణ ప్రాంతంలో జరిగే ఎన్నికలకు హెలికాప్టర్లు ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత సీమాంధ్రకి తరలించాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రయత్నాలు మొదలెట్టారు. తెలంగాణలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, సీమాంధ్రలో తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు.
ఏదై నా హింస చోటుచేసుకుని పోలీ సులు గాయపడితే వారిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు తీసుకొచ్చేందుకు శిక్షణ పొందిన సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. వైద్య సేవల కోసం సీమాంధ్రలోని రాయల్ ఆస్పత్రి, జీఎస్‌ఎల్ వైద్య కాలేజీ(రాజమండ్రి), సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, రాఘవ ఎమర్జెన్సీ ఆస్పత్రి(కాకినాడ)ని గుర్తించినట్టు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే, తెలంగాణలో ఆస్పత్రులను గుర్తించాల్సి ఉందన్నారు.
Advertisement