ఢిల్లీ: దేశంలో అనుమానిత మంకీపాక్స్ కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీచేసింది. మంకీపాక్స్ లక్షణాలుంటే వెంటనే పరీక్షలు నిర్వహించాలని, వారి కాంటాక్ట్ లిస్ట్‌ను తయారు చేయాలని సూచించింది. ఈ మేరకు సోమవారం కీలక అడ్వైజరీ జారీ చేసింది.
కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) కింద వ్యాధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది.
మంకీపాక్స్ సాధారణ సంకేతాలు, లక్షణాలు, రోగనిర్ధారణ తర్వాత తీసుకోవలసిన చర్యల గురించి తెలుసుకోవాలని అన్నీ రాష్ట్రాలకు జారీచేసిన ఆదేశాల్లో పేర్కొంది. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యల విషయంలో శ్రద్ధ వహించాలని తెలిపింది.
99,176 కేసులు.. 208 మరణాలు
యూరప్, ఆఫ్రికా దేశాల్లో ఇటీవల మంకీపాక్స్ వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను ‘అంతర్జాతీయ ఆరోగ్య విపత్తు’గా ఆగస్టు 14న ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి 2022లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఆఫ్రికాలో కొత్త రకం ఎంపాక్స్ పుట్టుకొచ్చినట్లు తేలింది. 2022 వైరస్ కంటే ఇది మరింత ప్రాణాంతకమని తేలింది. కొత్త వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. 2022 నుంచి 2023 దాకా 116 దేశాల్లో 99,176 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. 208 మంది మరణించారు. 2024లో 15,600కు పైగా కేసులు నమోదయ్యాయి. 537 మంది మృతిచెందారు. 2022 నుంచి భారత్‌లో కనీసం 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. చివరిసారిగా ఈ మార్చి నెలలో ఒక కేసు బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment