
న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌లో తొలి మంకీపాక్స్(ఎంపాక్స్) కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం అధికారిక ప్రకటన చేసింది. ఢిల్లీలో ఇద్దరు వ్యక్తుల్లో లక్షణాలు గుర్తించిన ఆరోగ్య శాఖ.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే నిర్ధారణ పరీక్షల్లో ఇద్దరిలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు తేలింది.
బాధితుడిని ఆదివారం ఐసోలేషన్‌లో ఉంచి నమూనాలు సేకరించామని, ఎంపాక్స్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. అయితే.. అతనికి సోకిన వేరియెంట్ క్లేడ్-2 అని, అది అంత ప్రమాదకరం కాదని, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గతంలో( (జులై 2022 టైంలో) భారత్‌లో ఇలాంటి కేసులే 30 దాకా నమోదయ్యాయి. ఇక..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. అందుకు కారణం క్లేడ్-1 రకం. పశ్చిమాఫ్రికా నుంచి ఈ వేరియెంట్ విజృంభించి.. ప్రపంచ దేశాలను వణికించింది.
#UPDATE | The previously suspected case of Mpox (monkeypox) has been verified as a travel-related infection. Laboratory testing has confirmed the presence of Mpox virus of the West African clade 2 in the patient. This case is an isolated case, similar to the earlier 30 cases… https://t.co/R7AENPw6Dw pic.twitter.com/ocue7tzglR
— ANI (@ANI) September 9, 2024
మంకీపాక్స్ లక్షణాలు..
జ్వరం, చర్మం మీద నొప్పితో కూడిన దద్దు, పొక్కులు ఏర్పడటం ప్రధాన లక్షణాలు. పొక్కులకు చీము కూడా పట్టొచ్చు. వైరస్ ఒంట్లోకి ప్రవేశించిన 717 రోజుల తర్వాత దద్దు రూపంలో బయటపడుతుంది. ఎంపాక్స్‌లో ముందు తీవ్రమైన జ్వరం, తర్వాత చర్మం మీద దద్దు తలెత్తుతుంది. మొదట్లో జ్వరంతో పాటు తీవ్ర అలసట, ఒళ్లునొప్పులు, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆకలి లేకపోవటం, గొంతులో గరగర, గొంతునొప్పి ఉంటాయి. ఇవి తీవ్రంగానూ ఉంటాయి. జ్వరం తగ్గిన తర్వాత దద్దు మొదల వుతుంది. ఇది చాలావరకు ముఖం లేదంటే చేతుల మీద ఆరంభ మవుతుంది.ఆపై ఛాతీ, పొట్ట, వీపు మీదికి విస్తరిస్తుంది. అరిచేతులు, అరికాళ్లలోనూ పొక్కులు ఏర్పడొచ్చు. శరీరం మీద దద్దు చాలా నెమ్మదిగా విస్తరిస్తుంది. పొక్కులు కూడా నెమ్మదిగా వస్తాయి కాబట్టి మానటానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. దురద అంత ఎక్కువగా ఏమీ ఉండదు. 46 రోజుల తర్వాత కొత్త పొక్కులేవీ ఏర్పడవు. పొక్కులు మానిన తర్వాత మచ్చలు పడతాయి. పొక్కులు మాని, చెక్కు కట్టిన తర్వాత వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. లింఫ్‌గ్రంథులు పెద్దగా అవటం మరో ప్రత్యేక లక్షణం. దద్దు రావటానికి ఒకట్రెండు రోజుల ముందు మెడ, చంకలు, గజ్జల వద్ద బిళ్లలు కడతాయి. ఇవి బాగా నొప్పి పెడతాయి.
ఇదీ చదవండి: మంకీపాక్స్ ఎంపాక్స్‌గా ఎందుకు మారిందంటే..
జాగ్రత్తలు
ఎంపాక్స్ అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పీసీఆర్ పరీక్ష చేయించు కోవాలి. బయట తిరగకూడదు. ఇంట్లో కుటుంబ సభ్యులంతా మాస్కు ధరించాలి. ఇన్‌ఫెక్షన్ గలవారు వాడే దుస్తులు, వస్తువుల వంటివి విడిగానే ఉంచాలి. మిగతా వాటితో కలపకూడదు. వీరికి సపర్యలు చేసేవారు గ్లౌజులు, మాస్కు విధిగా ధరించాలి.
తొలిసారి గుర్తించారిలా..
మంకీపాక్స్ వ్యాధిని 1958లో తొలిసారి గుర్తించినప్పటికీ.. మొదటిసారి 1970లో ఓ మనిషికి ఇది వ్యాప్తి చెందింది. ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా ఈ వ్యాధి కనిపించేది. అయితే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేయడంతో.. 2022లో భారీ స్థాయిలో మంకీపాక్స్ వ్యాపించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనలను స్టార్ట్ చేశాయి.
మంకీపాక్స్‌లో రెండు వేరియంట్లు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు..
ఒకటి క్లాడ్-1 (కాంగోబేసిన్ క్లాడ్),
రెండు క్లాడ్-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్)
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లాడ్-1 ఐబీ వేరియంట్ విజృంభిస్తోంది. లైంగిక సంబంధాల కారణంగా ఈ వేరియంట్ మరింత వేగంగా వ్యాపిస్తోంది.
ఎంపాక్స్ ఎలా సోకుతుందంటే..
ఇన్‌ఫెక్షన్‌కు గురైన జంతువులకు గానీ మనుషులకు గానీ సన్నిహితంగా మెలిగినప్పుడు ఎంపాక్స్ సంక్రమిస్తుంది. ఇన్‌ఫెక్షన్‌కు గురైనవారి ఉమ్మి, మూత్రం వంటి శరీర స్రావాలు చర్మానికి తగిలినప్పుడు ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తుంది. ముఖానికి ముఖం, చర్మానికి చర్మం, నోటికి నోరు, నోటికి చర్మం తగలటం.. ఇలా ఏ రూపంలోనైనా సోకొచ్చు. ఇది ఒంట్లోకి ప్రవేశించటానికి తగిన పరిస్థితులూ కలిసి రావాలి. చర్మం ఎక్కడైనా గీసుకుపోయినా, గాయాలైనా, పుండ్లు పడినా.. అక్కడ ఇన్‌ఫెక్షన్‌కు గురైనవారి శరీర స్రావాలు అంటుకుంటే వైరస్ ప్రవేశిస్తుంది. పెద్దవాళ్ల కన్నా పిల్లలకు.. ముఖ్యంగా పదేళ్ల లోపు వారికి ముప్పు ఎక్కువ. ఇన్‌ఫెక్షన్ గలవారితో లైంగిక సంపర్కంలో పాల్గొన్నా సంక్రమించొచ్చు.
చికిత్స ఉంది, కానీ..
ఇప్పుడు ఎంపాక్స్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నప్పటికీ కొత్త జబ్బేమీ కాదు. దీని గురించి ఇంతకు ముందే తెలుసు. చికిత్సలూ ఉన్నాయి. జ్వరం తగ్గటానికి పారాసిటమాల్ ఉపయోగపడుతుంది. పొక్కులు చీము పట్టే అవకాశముంది కాబట్టి యాంటీబయాటిక్స్ అవసర మవుతాయి. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా తగినంత నీరు, ద్రవాహారం తీసుకోవాలి. మంచి పోషకాహారం తినాలి. కొందరికి రక్తనాళం ద్వారా సెలైన్ ఎక్కించాల్సి రావొచ్చు. ఉపశమన చికిత్సలతోనే చాలా మంది కోలుకుంటారు. భయమేమీ అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండటం అవసరం. సమస్య తీవ్రమైతే ప్రాణాంతకంగా పరిణమించొచ్చు.