పశ్చిమగోదావరి జిల్లా నడిపూడిలో వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్లు, సిబ్బంది
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్ల పర్యవేక్షణలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య శాఖ షెడ్యూల్ ప్రకారం వైద్య శిబిరాలను జోరుగా నిర్వహిస్తోంది. శిబిరాల్లో ప్రజలు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా స్పెషలిస్ట్ వైద్యుల సేవలను పొందుతున్నారు. డాక్టర్లు సూచించిన మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి పరిష్కరించేలా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే.
నాలుగు రోజుల్లో 7.16 లక్షల మంది
ప్రభుత్వ సెలవు దినాలను మినహాయిస్తే గురువారం వరకూ నాలుగు రోజుల పాటు వైద్య శాఖ 2,427 శిబిరాలను నిర్వహించింది. గ్రామాల్లో 2,261 శిబిరాలను నిర్వహించగా పట్టణాలు, నగరాల్లో 166 శిబిరాలు ఏర్పాటయ్యాయి. ప్రతి శిబిరంలో ఇద్దరు పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్లతో పాటు గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ఇతర స్పెషాలిటీల నుంచి ఇద్దరు చొప్పున మొత్తంగా నలుగురు వైద్యులను అందుబాటులో ఉంచారు. నాలుగు రోజుల్లో ఏకంగా 7,16,101 లక్షల మంది సొంత ఊళ్లలో ఉచిత చికిత్సలు పొందారు. వెద్య సేవలను వినియోగించుకున్న వారిలో అత్యధికంగా 4 లక్షల మందికిపైగా మహిళలే ఉండటం గమనార్హం. ఒక్కో శిబిరంలో సగటున 277 మంది వైద్య సేవలు పొందారు. మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు భావించిన 20,798 మందిని పెద్దాస్పత్రులకు రిఫర్ చేశారు.
ఉచితంగా పరీక్షలు.. మందులు
ప్రతి క్యాంపులో 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరం మేరకు కంటి పరీక్షలు, ఈసీజీ, రక్త పరీక్షలు, ఫుడ్ సప్లిమెంటేషన్ మ్యాపింగ్ చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేసిన వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఫ్యామిలీ డాక్టర్లు, ఏఎన్‌ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) పర్యవేక్షిస్తున్నారు. ఐదు దశల్లో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
టోకెన్లు లేకున్నా వైద్య సేవలు
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని ఏఎన్‌ఎం, సీహెచ్‌వోలు సందర్శించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి వైద్య శిబిరాలకు హాజరు కావాలని కోరుతూ టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్లు లేకున్నా కూడా తమ గ్రామం/పట్టణంలో శిబిరం నిర్వహించే ప్రాంతానికి నేరుగా వెళ్లి వైద్య సేవలు పొందవచ్చు.
– జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్
మహిళలకు ప్రత్యేక కౌంటర్
– పకూర్ బీ, క్రిష్టిపాడు, దొర్నిపాడు మండలం, నంద్యాల జిల్లా
జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో మహిళలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇద్దరు మహిళా వైద్యులు అన్ని పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. గతంలో వైద్యం కోసం మండల కేంద్రానికి వెళ్లే వాళ్లం. ఇప్పుడు మా గ్రామానికే వైద్యులు వస్తున్నారు. డబ్బు ఖర్చు లేకుండా ఊళ్లోనే వైద్యం అందించడం చాలా సంతోషంగా ఉంది. మాకు వ్యయ ప్రయాసలు లేకుండా వైద్యులే గ్రామాల్లోకి వచ్చి వైద్యం చేయడం ఎంతో మేలు చేస్తోంది.
ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే రూ.5 వేలు ఖర్చయ్యేవి
– కర్రి లక్ష్మి, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా కర్రి లక్ష్మి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా))
ఆరోగ్య సురక్ష శిబిరంలో నేను, నా భర్త వైద్య సేవలు పొందాం. ముందుగానే వలంటీర్, ఏఎన్‌ఎం మా ఇంటికి వచ్చి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భీమవరంలో నిర్వహించిన సురక్ష శిబిరంలో కొన్ని పరీక్షలు చేసి స్పెషలిస్ట్ వైద్యులు ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. ఇదే వైద్య సేవల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి చూపించుకుంటే మాకు సుమారు రూ.5 వేలు ఖర్చయ్యేవి. ముఖ్యమంత్రి జగన్ మా ఇంటి వద్దకే వైద్యులను పంపించి ఉచితంగా సేవలు అందించడం చాలా బాగుంది.
ఈ శిబిరాలు పేద, మధ్యతరగతి వారికి ఎంతో ఉపయోగపడతాయి.
4 వేల మంది స్పెషలిస్టు వైద్యులు: మంత్రి విడదల రజని
చిలకలూరిపేట: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపును మంత్రి రజని గురువారం సందర్శించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 10,574 వైద్య శిబిరాలను జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
మెరుగైన వైద్యం అవసరమని గుర్తించిన వారికి పెద్ద ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందుతుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో వైద్యం అందించేందుకు ఏకంగా 4 వేల మంది స్పెషలిస్టు వైద్యులను నియమించినట్లు తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment