అద్భుత అవకాశాల లైబ్రరీ సైన్స్
అప్ కమింగ్ కెరీర్: భారత్‌లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన విద్యాసంస్థలు, పరిశోధనా కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. దేశం క్రమంగా విజ్ఞాన ఆధారిత సమాజంగా రూపుదిద్దుకుంటోంది. దీంతో లైబ్రరీ సైన్స్‌కు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు నానాటికీ విసృ్తతమవుతున్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం రంగ ప్రవేశం చేయడంతో అన్ని రంగాల్లో మాదిరిగానే లైబ్రరీ సైన్స్‌లో కూడా సంప్రదాయ విధానాలకు భిన్నంగా ఆధునిక పోకడలు ప్రవేశించాయి. లైబ్రేరియన్‌లు ఇప్పుడు సీడీలు, ఇంటర్నెట్, ఈ-లైబ్రరీల ద్వారా సమాచారం అందిస్తున్నారు.
వేధిస్తున్న నిపుణుల కొరత
పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా, అభివృద్ధి సంస్థలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, కార్పొరేట్ సెక్టార్, మీడియా సంస్థల్లో ప్రస్తుతం లైబ్రరీ ప్రొఫెషనల్స్‌కు భారీ డిమాండ్ ఉందని, కన్సల్టెంట్‌గా కూడా స్వయం ఉపాధి పొందొచ్చని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. దేశంలో విద్యారంగం ప్రైవేటీకరణ, పారిశ్రామిక ప్రగతి, బహుళజాతి కంపెనీల ఏర్పాటుతో లైబ్రేరియన్లకు అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయి. దాంతో నిపుణులైన లైబ్రేరియన్ల కొరత నెలకొంది. పేరున్న గ్రంథాలయాల్లో ఉన్నత స్థానాల్లో ఖాళీలు అనేకం.
భారీ వేతనాలు
భారత్‌లో లైబ్రేరియన్ ఉద్యోగంపై ఇప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన లేదు. లైబ్రేరియన్ అంటే గ్రంథాలయాల్లో పుస్తకాలు ఇచ్చే వ్యక్తి మాత్రమే అని భావిస్తున్నారు. దీనివల్ల ఈ రంగంలో ప్రవేశించేందుకు ఎక్కువమంది ఇష్టపడడం లేదు. ప్రతిభ కలిగిన అభ్యర్థులు ఇందులోకి రావడం లేదు. కానీ, దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం ఖాయం. అనుభవం కలిగిన లైబ్రేరియన్ వేతనం యూనివర్సిటీ ప్రొఫెషర్‌తో సమానంగా ఉంటుంది.
ఏడాదికి రూ.5 లక్షల వరకు వేతనం తీసుకుంటున్న లైబ్రేరియన్‌లు ఉన్నారు. కొన్ని ప్రభుత్వ సంస్థల్లో లైబ్రేరియన్ హోదా అదనపు కార్యదర్శి హోదాతో సమానం. లైబ్రేరియన్‌గా రాణించాలంటే మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు 70 శాతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మిగతా 30 శాతం సంప్రదాయ లైబ్రేరియన్‌షిప్ ద్వారా సమాచారం పొందుతున్నారు. కాబట్టి లైబ్రేరియన్‌కు తప్పనిసరిగా ఐటీ స్కిల్స్ కూడా అవసరమే. పాఠకులకు సేవలందించాలంటే ఆశయం, ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలోకి ప్రవేశించొచ్చు.
లైబ్రేరియన్‌కు ఉండాల్సిన లక్షణాలు
1. పాఠకుల అవసరాలకు గుర్తించగల నైపుణ్యం
2. ముఖ్యమైన అంశాలపై కనీస పరిజ్ఞానం
3. పాఠకులు చెప్పేది ఓపిగ్గా వినగలిగే నేర్పు
లైబరీ సైన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్
వెబ్‌సైట్: www.niscair.res.in
ఉస్మానియా యూనివర్సిటీ
వెబ్‌సైట్: http://www.osmania.ac.in/
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
వెబ్‌సైట్: http://www.uohyd.ac.in/
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం
వెబ్‌సైట్: http://www.ignou.ac.in/
డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: http://www.braou.ac.in/