New schools
-
గిరిసీమలో ‘కొత్త’బడులు
సాక్షి, అమరావతి: గిరిజన స్కూళ్లకు మహర్దశ పట్టింది. ఇప్పటి వరకు చెట్ల కింద, పూరిపాకల్లో కొనసాగుతున్న గిరిజన గ్రామాల్లో చదువులకు ప్రభుత్వం కొత్త రూపునిస్తోంది. తక్కువ మంది విద్యార్థులున్న బడులకు సైతం పక్కా భవనాలు నిర్మింస్తోంది. మరిన్ని శిథిలమైన భవనాలకు మెరుగులు అద్దుతోంది. ఆరు జిల్లాల్లో 1,331 గిరిజన సంక్షేమ పాఠశాలలు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో మైదాన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తే.. గిరిజన గ్రామాల్లో పూర్తిగా గాలికి వదిలేశారు. రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో విద్యను పట్టించుకోకపోవడంతో అక్కడి పిల్లలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’తో దాదాపు 1,331 గిరిజన స్కూళ్లను సుమారు రూ.500 కోట్లతో సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. వీటితో పాటు మరో 817 పాఠశాల భవనాల్లో విద్యుత్, తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు కల్పింస్తున్నారు. ఇప్పటికే నాడు–నేడు మొదటి దశలో 350, రెండో దశలో మరో 74.. మొత్తం 424 గిరిజన సంక్షేమ పాఠశాలలను పూర్తి చేశారు. కొండ ప్రాంతాల్లోని గూడేల్లో ఎన్నో ఏళ్లుగా పాఠశాలలున్నా వాటిలో అత్యధిక ప్రాంతాల్లో పక్కా భవనాల్లేవు. ఇలాంటి చోట బడులు, పాకలు లేదా చెట్ల కింద నామమాత్రంగా నడుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఉన్న పాఠశాలల భవనాలు బీటలు వారి శిథిలమయ్యాయి. ఇలాంటి పాఠశాలలకు కొత్త భవనాలు నిర్మించడంతో పాటు పాత వాటికి మెరుగులు దిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. మారుమూల బడుల్లోనూ సకల సదుపాయాలు తొలి విడతలో 26 జిల్లాల్లోనూ 20 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులున్న 1,331 స్కూళ్లను గుర్తించారు. వీటిలో కొత్త భవనాలు నిర్మించాల్సినవి దాదాపు 500 వరకూ ఉండగా, మిగిలినవి మెరుగులు దిద్దాల్సినవి. మొత్తం రూ.500 కోట్లతో ఆయా పనులు చేపట్టారు. ఇప్పటికే 424 స్కూళ్ల పనులు పూర్తిచేయగా, మిగిలిన స్కూళ్లను రెండు నెలల్లో పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన విభాగం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కేవలం భవనాలు నిర్మింంచడమే కాకుండా వాటికి విద్యుత్, తాగునీరు, మరుగు దొడ్లను సైతం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం నాడు–నేడు రెండో దశ పనుల్లో భాగంగా ఈ స్కూళ్లను బాగుచేస్తుండగా, మూడో విడతలో ఏజెన్సీలోని 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. -
తొలి వర్చువల్ స్కూల్ షురూ.. దేశంలో ఎక్కడి నుంచైనా చేరొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే తొలి వర్చువల్ స్కూల్‌ను ప్రారంభించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థలు ఈ స్కూల్లో చేరేందుకు అర్హులేనని తెలిపారు. ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్-డీఎంవీఎస్లో బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. 9-12వ తరగతి వరకు 13 నుంచి 18 ఏళ్ల వయసు విద్యార్థులు చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. నీట్, సీయూఈటీ, జేఈఈ వంటి పరీక్షలకు వర్చువల్ పాఠశాలలో నిపుణులతో శిక్షణ ఇస్తామని తెలిపారు కేజ్రీవాల్. ఢిల్లీ మోడల్ వర్చువల్ పాఠశాలను దేశ విద్యారంగంలో మైలురాయిగా అభివర్ణించారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ‘దూరం వంటి అనేక కారణాలతో చాలా మంది పిల్లలు బడికి వెళ్లలేకపోతున్నారు. అమ్మాయిలను దూరప్రాంతాలకు పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడంలేదు. అలాంటి వారందరి కోసమే ఢిల్లీ వర్చువల్ స్కూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. వర్చువల్ విధానంలోనే తరగతులు జరుగుతాయి. టీచర్లు పాఠాలు చెప్పే వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు.’ అని వెల్లడించారు కేజ్రీవాల్. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా ఈ వర్చువల్ స్కూల్ పనిచేస్తుంది. మార్కుల మెమోలు, ఇతర ధ్రువీకరణ పత్రాలు అన్నీ డీబీఎస్ఈ జారీ చేస్తుంది. ఇవి ఇతర బోర్డులు ఇచ్చే ధ్రువపత్రాలతో సమానం. వీటి ఆధారంగా విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరవచ్చు. వర్చువల్ స్కూల్లో చేరే విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయరు. తొలి బ్యాచ్‌లో ఎంత మంది విద్యార్థులను తీసుకోవాలో ఇంకా ఏమీ నిర్ణయించలేదని, రిజిస్ట్రేషన్ల ఆధారంగా నిర్ణయించనున్నట్లు అధికారులు తెలిపారు. స్కూల్‌నెట్, గూగుల్ కలిసి అభివృద్ధి చేసిన స్కూలింగ్ ప్లాట్‌ఫాం ద్వారా ఆన్లైన్లో పాఠాలు బోధిస్తారు. విద్యార్థుల అటెండన్స్ తీసుకునేందుకు ఈ ఆన్లైన్ ప్లాట్‌ఫాంలోనే ప్రత్యేక ఫీచర్ ఉంటుంది. పరీక్షలు వర్చువల్ మోడ్‌లో జరిగినా కాపీకి ఆస్కారం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక్కో టాపిక్‌పై విద్యార్థుల అవగాహనను తెలుసుకునేలా పరీక్షలు ఉంటాయి. వీటిలో కాపీ కొట్టేందుకు అవకాశాలు చాలా తక్కువ. అయితే.. రెండు టెర్మ్-ఎండ్ పరీక్షల కోసం విద్యార్థులు తప్పనిసరిగా ఢిల్లీకి రావాల్సి ఉంటుంది. ఢిల్లీలోని ఎంపిక చేసిన పాఠశాలల్లో కంప్యూటర్ ద్వారా విద్యార్థులు ఈ పరీక్షలు రాయాలి. వర్చువల్ స్కూల్లో ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో పాఠాలు బోధిస్తారు. आज शिक्षा के क्षेत्र में बहुत बड़ी क्रांति की शुरुआत हो रही है। आज देश का पहला वर्चुअल स्कूल दिल्ली में शुरू। https://t.co/PIms2geisB — Arvind Kejriwal (@ArvindKejriwal) August 31, 2022 ఇదీ చదవండి: ప్రాక్టికల్స్‌లో ఫెయిల్.. టీచర్‌ను చెట్టుకు కట్టేసి చితకబాదిన విద్యార్థులు -
వైఎస్సార్ జిల్లాలో 250 కోట్లతో 1048 కొత్త పాఠశాలలు అభివృద్ధి
-
రూ.1,500 కోట్లతో బిట్స్ మేనేజ్మెంట్ స్కూల్
న్యూఢిల్లీ: బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ.. బిట్స్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (బీఐటీఎస్‌ఓఎం)ను ప్రారంభించనుంది. ఈ ఏడాది జూలైలో 120 మంది విద్యార్థులతో తొలి బ్యాచ్ మొదలుకానుంది. సెంట్రల్ ముంబైలోని పోవై తాత్కాలిక క్యాంపస్‌లో బోధనా తరగతులుంటాయి. రూ.1,500 కోట్ల పెట్టుబడులతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.60 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇది 2024 నాటికి సిద్ధమవుతుందని బిట్స్ పిలానీ చాన్సలర్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు. రెండేళ్ల రెసిడెన్షియల్ బిజినెస్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను అందించనున్నారు. కోర్స్ ఫీజు రూ. 24 లక్షలు. న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్, వార్టన్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, సింగపూర్ మేనేజ్ మెంట్ యూనివర్శిటీ, కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్స్ ప్రొఫెసర్లతో విద్యా బోధన ఉంటుంది. ‘‘ఎం బీఏ కంటెంట్, డెలివరీ ఫార్మాట్స్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ద్వారా వ్యాపార నమూనాలు, విధానాలు ఎలా మారుతున్నాయో, కొనుగోలుదారులు అవసరాలకు తగ్గ డిజైన్స్ ఎలా పరిష్కరించబడుతున్నాయో అలాంటి మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని’’ కుమార్ మంగళం పేర్కొన్నారు. -
పండుగ తరువాతే టీచర్ల బదిలీ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఉత్తర్వుల జారీ ప్రక్రియను సంక్రాంతి సెలవుల అనంతరమే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. పండుగ సెలవుల తర్వాతే ఆయా టీచర్లు తమకు కేటాయించిన కొత్త పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. టీచర్ల బదిలీల ప్రక్రియలో భాగంగా ఆప్షన్ల నమోదును ఇప్పటికే పూర్తిచేయించిన విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం వాటిని పూర్తిగా ఫ్రీజ్ చేశారు. నిజానికి సంక్రాంతికి ముందే బదిలీ ఉత్తర్వులు జారీచేయాలని ముందు భావించినప్పటికీ కొన్ని కారణాలవల్ల సెలవుల తర్వాతకు ఆ ప్రక్రియను వాయిదా వేశారు. బదిలీల ప్రక్రియలో విద్యాశాఖ జాగ్రత్తలు.. ఈసారి బదిలీల ప్రక్రియకు సంబంధించి విద్యాశాఖ పలు జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా బదిలీల కారణంగా ఏజెన్సీ, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా చర్యలు చేపట్టింది. అలాగే.. – టీచర్లలో ఒకే స్కూలులో 8 ఏళ్లు సర్వీసు నిండిన వారికి, ప్రధానోపాధ్యాయుల్లో ఒకేచోట 5 ఏళ్లు సర్వీసు పూర్తిచేసిన వారికి తప్పనిసరి బదిలీ నిబంధన పెట్టారు. – ఇతరులలో ఒకేచోట కనీసం రెండేళ్లు నిండిన వారికి బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చారు. – రెండేళ్ల కన్నా తక్కువ సర్వీసు పూర్తిచేసిన వారికి కారణాలతో కూడిన అభ్యర్థన పూర్వక బదిలీ దరఖాస్తుకు వీలు కల్పించారు. 16వేల పోస్టులు బ్లాక్ మారుమూల ప్రాంతాల స్కూళ్లకు ఇబ్బంది లేకుండా.. అందరూ పట్టణ, మైదాన ప్రాంతాలకు వెళ్లిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందుజాగ్రత్తగా 16వేల పోస్టులను విద్యాశాఖ బ్లాక్ చేసింది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లోని పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకం ఉండదు. పోస్టులను బ్లాక్ చేస్తున్న అంశాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారికంగా వెల్లడించారు. అలాగే, ఈ సమాచారాన్ని మండలాల వారీగా అందరికీ తెలిసేలా బోర్డుల్లో ప్రదర్శించారు. పోస్టులు బ్లాక్ చేయకుంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న 145 మండలాల్లోని 5,725 స్కూళ్లలో ఉన్న 10,198 పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉండిపోయే ప్రమాదముంది. దీనివల్ల ఉపాధ్యాయుల్లేక ఆ పాఠశాలలు మూతపడే అవకాశముండేది. 76వేల బదిలీలకు వెబ్ ఆప్షన్లు ఇదిలా ఉంటే.. 76,119 బదిలీలకు సంబంధించి దాదాపు అంతా బదిలీకి వీలుగా వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. కంపల్సరీ కేటగిరీలో 26,117 పోస్టులు, రిక్వెస్టు కేటగిరి కింద 50,002 ఖాళీ పోస్టులకు వెబ్ ఆప్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినా విద్యాశాఖ వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించింది. అలాగే, వెబ్ ఆప్షన్ సమయంలో సర్వర్లు మొరాయిస్తున్నాయన్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని, జిల్లాల వారీగా సర్వర్లు విభజించారు. పాయింట్ల ఆధారంగా బదిలీలు ఉపాధ్యాయుల సర్వీసుతో పాటు వారి పనితీరును కూడా బదిలీల్లో విద్యాశాఖ పరిగణనలోకి తీసుకుంది. వీటికి కొన్ని పాయింట్లను కేటాంచింది. విడో, భార్యాభర్తలు, తీవ్ర ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఇలా కొన్ని కేటగిరీల వారికి ప్రాధాన్యతనిస్తూ అదనపు పాయింట్లు ఇచ్చింది. ఆ ప్రకారం పాయింట్ల మెరిట్ ప్రాతిపదికన బదిలీలు చేయనున్నారు. ఈ ప్రక్రియ మేన్యువల్‌గా కాకుండా పారదర్శకంగా కంప్యూటర్ ద్వారా ఆటోమేటిగ్గా జరిగేలా కంప్యూటర్ జనరేటెడ్ బదిలీ ఉత్తర్వులు జారీచేయనున్నారు. -
అద్భుత అవకాశాల లైబ్రరీ సైన్స్
అప్ కమింగ్ కెరీర్: భారత్‌లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన విద్యాసంస్థలు, పరిశోధనా కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. దేశం క్రమంగా విజ్ఞాన ఆధారిత సమాజంగా రూపుదిద్దుకుంటోంది. దీంతో లైబ్రరీ సైన్స్‌కు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు నానాటికీ విసృ్తతమవుతున్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం రంగ ప్రవేశం చేయడంతో అన్ని రంగాల్లో మాదిరిగానే లైబ్రరీ సైన్స్‌లో కూడా సంప్రదాయ విధానాలకు భిన్నంగా ఆధునిక పోకడలు ప్రవేశించాయి. లైబ్రేరియన్లు ఇప్పుడు సీడీలు, ఇంటర్నెట్, ఈ-లైబ్రరీల ద్వారా సమాచారం అందిస్తున్నారు. వేధిస్తున్న నిపుణుల కొరత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా, అభివృద్ధి సంస్థలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, కార్పొరేట్ సెక్టార్, మీడియా సంస్థల్లో ప్రస్తుతం లైబ్రరీ ప్రొఫెషనల్స్‌కు భారీ డిమాండ్ ఉందని, కన్సల్టెంట్‌గా కూడా స్వయం ఉపాధి పొందొచ్చని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. దేశంలో విద్యారంగం ప్రైవేటీకరణ, పారిశ్రామిక ప్రగతి, బహుళజాతి కంపెనీల ఏర్పాటుతో లైబ్రేరియన్లకు అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయి. దాంతో నిపుణులైన లైబ్రేరియన్ల కొరత నెలకొంది. పేరున్న గ్రంథాలయాల్లో ఉన్నత స్థానాల్లో ఖాళీలు అనేకం. భారీ వేతనాలు భారత్‌లో లైబ్రేరియన్ ఉద్యోగంపై ఇప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన లేదు. లైబ్రేరియన్ అంటే గ్రంథాలయాల్లో పుస్తకాలు ఇచ్చే వ్యక్తి మాత్రమే అని భావిస్తున్నారు. దీనివల్ల ఈ రంగంలో ప్రవేశించేందుకు ఎక్కువమంది ఇష్టపడడం లేదు. ప్రతిభ కలిగిన అభ్యర్థులు ఇందులోకి రావడం లేదు. కానీ, దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం ఖాయం. అనుభవం కలిగిన లైబ్రేరియన్ వేతనం యూనివర్సిటీ ప్రొఫెషర్తో సమానంగా ఉంటుంది. ఏడాదికి రూ.5 లక్షల వరకు వేతనం తీసుకుంటున్న లైబ్రేరియన్లు ఉన్నారు. కొన్ని ప్రభుత్వ సంస్థల్లో లైబ్రేరియన్ హోదా అదనపు కార్యదర్శి హోదాతో సమానం. లైబ్రేరియన్‌గా రాణించాలంటే మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు 70 శాతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మిగతా 30 శాతం సంప్రదాయ లైబ్రేరియన్షిప్ ద్వారా సమాచారం పొందుతున్నారు. కాబట్టి లైబ్రేరియన్‌కు తప్పనిసరిగా ఐటీ స్కిల్స్ కూడా అవసరమే. పాఠకులకు సేవలందించాలంటే ఆశయం, ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలోకి ప్రవేశించొచ్చు. లైబ్రేరియన్‌కు ఉండాల్సిన లక్షణాలు 1. పాఠకుల అవసరాలకు గుర్తించగల నైపుణ్యం 2. ముఖ్యమైన అంశాలపై కనీస పరిజ్ఞానం 3. పాఠకులు చెప్పేది ఓపిగ్గా వినగలిగే నేర్పు లైబరీ సైన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ వెబ్సైట్: www.niscair.res.in ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: http://www.osmania.ac.in/ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్: http://www.uohyd.ac.in/ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వెబ్సైట్: http://www.ignou.ac.in/ డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్: http://www.braou.ac.in/