సాక్షి, అమరావతి: గిరిజన స్కూళ్లకు మహర్దశ పట్టింది. ఇప్పటి వరకు చెట్ల కింద, పూరిపాకల్లో కొనసాగుతున్న గిరిజన గ్రామాల్లో చదువులకు ప్రభుత్వం కొత్త రూపునిస్తోంది. తక్కువ మంది విద్యార్థులున్న బడులకు సైతం పక్కా భవనాలు నిర్మింస్తోంది. మరిన్ని శిథిలమైన భవనాలకు మెరుగులు అద్దుతోంది. ఆరు జిల్లాల్లో 1,331 గిరిజన సంక్షేమ పాఠశాలలు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో మైదాన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తే.. గిరిజన గ్రామాల్లో పూర్తిగా గాలికి వదిలేశారు.
రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో విద్యను పట్టించుకోకపోవడంతో అక్కడి పిల్లలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’తో దాదాపు 1,331 గిరిజన స్కూళ్లను సుమారు రూ.500 కోట్లతో సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. వీటితో పాటు మరో 817 పాఠశాల భవనాల్లో విద్యుత్, తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు కల్పింస్తున్నారు. ఇప్పటికే నాడు–నేడు మొదటి దశలో 350, రెండో దశలో మరో 74.. మొత్తం 424 గిరిజన సంక్షేమ పాఠశాలలను పూర్తి చేశారు.
కొండ ప్రాంతాల్లోని గూడేల్లో ఎన్నో ఏళ్లుగా పాఠశాలలున్నా వాటిలో అత్యధిక ప్రాంతాల్లో పక్కా భవనాల్లేవు. ఇలాంటి చోట బడులు, పాకలు లేదా చెట్ల కింద నామమాత్రంగా నడుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఉన్న పాఠశాలల భవనాలు బీటలు వారి శిథిలమయ్యాయి. ఇలాంటి పాఠశాలలకు కొత్త భవనాలు నిర్మించడంతో పాటు పాత వాటికి మెరుగులు దిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మారుమూల బడుల్లోనూ సకల సదుపాయాలు
తొలి విడతలో 26 జిల్లాల్లోనూ 20 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులున్న 1,331 స్కూళ్లను గుర్తించారు. వీటిలో కొత్త భవనాలు నిర్మించాల్సినవి దాదాపు 500 వరకూ ఉండగా, మిగిలినవి మెరుగులు దిద్దాల్సినవి. మొత్తం రూ.500 కోట్లతో ఆయా పనులు చేపట్టారు. ఇప్పటికే 424 స్కూళ్ల పనులు పూర్తిచేయగా, మిగిలిన స్కూళ్లను రెండు నెలల్లో పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన విభాగం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కేవలం భవనాలు నిర్మింంచడమే కాకుండా వాటికి విద్యుత్, తాగునీరు, మరుగు దొడ్లను సైతం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం నాడు–నేడు రెండో దశ పనుల్లో భాగంగా ఈ స్కూళ్లను బాగుచేస్తుండగా, మూడో విడతలో ఏజెన్సీలోని 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను తీర్చిదిద్దాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment