ప్రైవేటు దోపిడీకి చెక్ | Private exploited check | Sakshi
Sakshi News home page

ప్రైవేటు దోపిడీకి చెక్

Published Mon, Feb 23 2015 3:23 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

ప్రైవేటు దోపిడీకి చెక్ - Sakshi

ప్రైవేటు దోపిడీకి చెక్

స్వైన్ ఫ్లూ పరీక్షకు రూ.3,750    
* ధర నిర్ణయించిన సర్కారు

సాక్షి, చెన్నై : స్వైన్ ఫ్లూ పరీక్షల పేరిట కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాలు సాగిస్తున్న దోపిడీకి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటుగా పరీక్షలు చేయించుకునే వారి కోసం ధరను ప్రభుత్వం నిర్ణయించింది. రూ.3750 మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ భయం ప్రజల్ని వెంటాడుతున్నది. ఈ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది.

కొన్ని ప్రాంతాల్లో డెంగీ జ్వరం తాండ వం చేస్తుంటే, మరికొన్ని చోట్ల స్వైన్ ఫ్లూ లక్షణాలు ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నాయి. ఇప్పటి వరకు రెండు వందలకు పైగా స్వైన్ ఫ్లూ బాధితులు చికిత్స పొందారు. పదుల సంఖ్య లో ఆసుపత్రుల్లోని ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ స్వైన్ ఫ్లూ పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేస్తున్నారు. అయితే, రిపోర్ట్ రావడానికి ఆలస్యం అవుతోన్నది. దీంతో ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు పరిశోధనా కేంద్రాలను ఆశ్రయించే వాళ్లు అధికంగా ఉన్నారు.

జ్వరం , జలుబు, దగ్గుతో వచ్చే వాళ్లకు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు స్వైన్ ఫ్లూ పరీక్షలకు సిఫారసు చేస్తున్నాయి. దీంతో ఆ ఆసుపత్రుల్లోని ల్యాబ్‌లతో పాటుగా కొన్ని నర్సింగ్ హోంల నుంచి వచ్చే సిఫారసులతో ప్రైవేటు ల్యాబ్ యాజమాన్యాలు దోపిడీ బాట పట్టాయి. రూ.8 వేల వరకు వీరు పరీక్షల ఫీజును గుంజుతున్నట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఫిర్యాదులు చేరాయి.
  ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ప్రైవేటు దోపిడీకి చెక్ పెట్టేందుకు ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఆ పరీక్షలకు అయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకుని దోపిడీకి కళ్లెం వేసే పనిలో పడింది.

రూ.3750గా ప్రైవేటు ల్యాబ్, ఆస్పత్రుల్లో స్వైన్ ఫ్లూ పరీక్షకు ధరను నిర్ణయిస్తూ ప్రకటనను ఆరోగ్య శాఖ వెలువరించింది. డాక్టర్ల సిఫారసు మేరకు ఈ పరీక్షలు నిర్వహించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా ఎవరైనా వసూలు చేసిన పక్షంలో ల్యాబ్ లెసైన్సులు రద్దు అవుతాయన్న హెచ్చరికను ఆరోగ్య శాఖ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత పరీక్షలతో పాటుగా ప్రత్యేక వార్డుల్ని ఏర్పాటు చేసి ఉన్నామని గుర్తు చేస్తూ, జ్వరం బారిన పడ్డ వారు తప్పని సరిగా వైద్యుల్ని సంపద్రించాలని సూచించారు. ఆదివారం మరో ఆరు కేసులు నమోదయ్యాయి. తంజావూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, నాగర్ కోవిల్‌లో ఇద్దరు, కోయంబత్తూరు పెరియనాయగన్ పాళయంలో ఒకరు స్వైన్ ప్లూతో అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరారు. వీరికి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement