సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు సేవలకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నప్పటికీ ఫీజులను ఏ మేరకు వసూలు చేయాలనే విషయమై ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇచ్చింది. అదేవిధంగా ప్రైవేటు ల్యాబ్‌లు కరోనా పరీక్షలు చేసేలా వెసులుబాటు కల్పించింది. కరోనా పరీక్షకు రూ. 2,200 ఫీజును ఖరారు చేసింది. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో అందించే చికిత్సలో భాగంగా రోజుకు ఐసోలేషన్ ఫీజు రూ. 4 వేలు, ఐసీయూలో వెంటిలేటర్ అవసరం లేకుండా రోజుకు రూ. 7,500, ఐసీయూలో వెంటిలేటర్ అవసరం ఉంటే రోజుకు రూ. 9 వేలుగా ధరలు ఖరారు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి తదితరులతో కలసి ఆయన మీడియా సమవేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నందున మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, పది రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు పటాన్‌చెరు నియోజకవర్గంలో 50 వేల పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అవసరమైతే ఈ టెస్టుల సంఖ్యను మరింత పెంచుతామన్నారు. ప్రభుత్వం కరోనా టెస్ట్‌లు చేయడం లేదంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని, కానీ ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే తాము తొలిరోజు నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
సోమవారం మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్. చిత్రంలో సీఎస్ సోమేశ్‌కుమార్
భరోసా కల్పించేందుకే పరీక్షలు...
కరోనా కట్టడిలో ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడం, లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేయడం వల్లే తెలంగాణలో కేసులు తక్కువగా ఉన్నాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. లక్షణాల్లేని వారికి ఎలాంటి చికిత్స అందించాలి, లక్షణాలున్న వారికి ఎలాంటి చికిత్స ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపట్టిందని, తర్వాత ఐసీఎంఆర్ సైతం రాష్ట్ర విధానాన్ని అనుసరిస్తూ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా, క్షేత్రస్థాయిలో పరిస్థితికి అనుగుణంగా పనిచేస్తోందని, లేకుంటే ఢిల్లీ, ముంబై తరహాలో హైదరాబాద్‌లో పరిస్థితి నెలకొనేదన్నారు. ప్రజల్లో భరోసా కల్పించేందుకే టెస్టుల సంఖ్యను పెంచుతున్నట్లు ఈటల చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ల్యాబ్‌లలో రోజుకు 4,500 పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందని, త్వరలో అన్ని మెడికల్ కాలేజీల్లో ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయని, పరీక్షల కోసం మరో మిషన్‌ను సిద్ధం చేస్తున్నామని, దీంతో రోజుకు 7,500 పరీక్షలు నిర్వహించే స్థాయికి చేరుకుంటామన్నారు. హైదరాబాద్‌లో ఇంటింటి సర్వే నిర్వహిస్తామని, కేసుల సంఖ్య ప్రకారం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో సమూహ వ్యాప్తి లేదని, అన్ని రకాల సర్వేలు ఇదే రిపోర్టు చెబుతున్నాయన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ సడలింపుల తర్వాత సీఎం కేసీఆర్ లోతుగా పరిస్థితిని సమీక్షించి చర్యలు తీసుకుంటున్నారన్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులిలా..
- రోజుకు ఐసోలేషన్ ఫీజు - రూ. 4,000
- ఐసీయూలో వెంటిలేటర్ అవసరం లేకుండా రోజుకు.. - రూ. 7,500
- ఐసీయూలో వెంటిలేటర్ అవసరం ఉంటే రోజుకు.. - రూ. 9,000
ప్రైవేటుపై టాస్క్‌ఫోర్స్...
ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు, పరీక్షలపై ఆయా యాజమాన్యాలు ప్రతిక్షణం ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని, వాటి ఆధారంగా కంటైన్మెంట్ ఏర్పాటు తదితర చర్యలు తీసుకుంటామన్నారు. ఈటల తెలిపారు. ప్రైవేటు ఆస్పతులు, ల్యాబ్‌లపై నిఘా కోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ బృందం పనిచేస్తుందన్నారు. ప్రైవేటు యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే ప్రజలు టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఈటల సూచించారు. కరోనాపై యుద్ధం చేస్తున్న ప్రతి రంగాన్నీ రక్షించుకుంటామని, వైద్యులు, వైద్య సిబ్బందితోపాటు పోలీసులు, జర్నలిస్టులకు ప్రభుత్వం సంతృప్తికర స్థాయిలో వైద్య పరీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. కింగ్‌కోఠిలోని జిల్లా ఆస్పత్రికి వచ్చే వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని, వాటిలో దాదాపు 5 వేల పడకల ద్వారా ఆక్సిజన్‌తో కూడిన చికిత్స అందించే వీలుందన్నారు. సీజనల్ వ్యాధులపై పకడ్బందీ సర్వే నిర్వహించనున్నామని, ఇందుకు తాత్కాలిక పద్ధతిలో ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లను నియమించుకొని ఇంటింటి సర్వే చేపడతామన్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవాళ్లు మాత్రమే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాలని, మిగతా వర్గాలన్నీ ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సకల వసతులు ఏర్పాటు చేశామన్నారు.
పడకల కొరత లేదు: సీఎస్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. పెయిడ్ పేషెంట్లు మాత్రమే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలని, ప్రభుత్వ ఉద్యోగులు సహా ఇతర కేటగిరీ వారంతా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాలన్నారు. ఐసీఎంఆర్ గుర్తించిన ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లకు అనుమతిచ్చిన నేపథ్యంలో ఎవరూ మార్కెటింగ్ చేసుకోవద్దని, అలాంటి పనులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎస్ హెచ్చరించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలను బ్లాక్ చేయొద్దని, రోగులు, పడకల వివరాలు డిస్‌ప్లేలో తప్పకుండా ప్రదర్శించాలని స్పష్టం చేశారు. యాజమాన్యాలు అన్నివేళలా పడకల వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మున్సిపల్ అధికారులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తోపాటు నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశామన్నారు. కరోనా లక్షణాలు లేనివారు ఆస్పత్రుల్లో చేరొద్దని, హోం ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిద్ధంగా ఉన్న పడకలు- 17,000
- ‘ఆక్సిజన్’తో చికిత్స అందించే వీలున్న పడకలు- 5,000
Comments
Please login to add a commentAdd a comment