కరోనా: ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌ | TS High Court Serious On Government Over Corona Tests | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌

Published Thu, Nov 26 2020 3:25 PM | Last Updated on Thu, Nov 26 2020 4:05 PM

TS High Court Serious On Government Over Corona Tests - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ సర్కారుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వ తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా వైరస్ పరీక్షలపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు రోజుకు 50 వేల పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా అమలు చేయడం లేదని మండిపడింది. అవసరం ఉన్నప్పుడు రోజుకు 50వేల పరీక్షలు చేస్తామని నివేదికలో పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. యశోద, కిమ్స్, కేర్, సన్ షైన్ ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న హైకోర్టు.. జీహెచ్ఎంసీ ఫలితాలేమో కానీ, ఎన్నికలయ్యాక కరోనా రెండో దశ ఫలితాలు వస్తాయని చురకలంటించింది. రెండో దశ కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపించడం లేదని మొట్టికాయ వేసింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. కేసులు ఉన్నపుడే పెంచుతారా: హైకోర్టు

ఈ క్రమంలో ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస రావుకు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని శ్రీనివాస్ రావును హైకోర్టు ఆదేశించింది. రోజుకు 50వేలు, వారానికోసారి లక్ష కరోనా పరీక్షలు చేయాలని ఇటీవల హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోజుకు 50 వేల పరీక్షలు అవసరం ఉన్నప్పుడు చేస్తామని శ్రీనివాస రావు నివేదికలో పేర్కొనగా..  రోజుకు 50 వేలు, వారానికో రోజు లక్ష కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి ఆదేశించింది. కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రాజకీయ సమావేశాలకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, ఐసీఎంఆర్ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. చదవండి: డేటా ఎంతమేరకు భద్రం?

జీఎచ్ఎంసీలో మాస్కులు, భౌతిక దూరం వంటి నిబంధనలు సరిగా అమలు కావడం లేదని హైకోర్టు మండిపడింది. కరోనా జాగ్రత్తలకు సంబంధించిన జీవో 64 అమలు బాధ్యత జీహీచ్ఎంసీకి అప్పగించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జీవో 64 అమలు అధికారం పోలీసులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేట్ ఆస్పత్రుల ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా మరణాలపై ఆడిట్ కమిటీ ఏర్పాటును పరిశీలించాలని తెలిపింది. కరోనా బాధితులకు ధైర్యం కలిగించేలా మానసిక కేంద్రం ఏర్పాటు చేయాలని పేర్కొంది. డిసెంబరు 15లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 17కి వాయిదా వేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement