సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘కరోనా విషయంలో సీఎం కేసీఆర్ విఫల మయ్యారని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. కొన్ని పత్రికలూ అదే రాస్తున్నాయి. మరి పాస్ అయిందెవరో, కరోనాను పూర్తిగా ఎవరు నిర్మూలిం చారో ప్రపంచంలో.., అలాగే దేశంలో ఒక్కరిని చూపించండి. ఎవరైనా నాయకుడు లేదా ఏదైనా ఒక ప్రభుత్వం గొప్పగా ఏ పనైనా చేసిందా? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చేత సాయం, మాట సాయం చేయాలే తప్ప విమర్శలు తగవు. కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం. 55 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్లు రైతుబంధు కింద అందించాం. పెన్షన్లూ ఇస్తున్నాం. ఏదైనా ఉంటే నిర్మాణాత్మక సూచన లివ్వండి.. వాటిని కచ్చితంగా పాటిస్తాం’అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలసి సోమవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవన ప్రారంభం, బైపాస్‌రోడ్డు, వీరన్నపేటలో రూ.40 కోట్లతో నిర్మించిన 660 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం, వీధి వ్యాపారులు, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు, మహిళా సంఘాలకు రూ.145 కోట్ల రుణ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రుణ పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగిస్తూ, ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా వైద్యానికి నిరాకరిస్తు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లిన వారు డబ్బులు కడతామన్నా.. పడకలు లేవని వారిని వెళ్లగొడుతున్నాయని, ప్రైవేట్ రంగం తిరస్కరించినా కరోనా రోగులకు ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య సిబ్బందే అండగా నిలుస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో నాలుగు కోట్ల మందికి ఒక్క గాంధీ ఆస్పత్రిలో మాత్రమే చికిత్స అందుతున్నట్లు ప్రజలు అపో హలో ఉన్నారన్నారు. అది నిజం కాదని, వికేంద్రీకరణతో స్థానికంగా ఎక్కడికక్కడ కరోనా వైద్య సేవలందిస్తున్నామని స్పష్టంచేశారు. దాదాపు అన్ని జిల్లాలకూ రాపిడ్ యాంటిజన్ కిట్లు సరఫరా చేశామని చెప్పిన మంత్రి.. కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభించామన్నారు.
కలచివేస్తున్న సామాజిక వెలి..
కరోనా వైరస్ అనేది ఎవరికీ అతీతం కాదని ఇది ఎవరికైనా సోకవచ్చని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయ, సినీ ప్రముఖులు కూడా వైరస్ బారిన పడ్డారన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగుల సామాజిక వెలి వంటి సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకోవడం దారుణమన్నారు. ఎక్కువ కేసులున్న జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా మృతుల శవాలు తారుమారవుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో చనిపోయిన వారిని గుర్తించడానికి కుటుంబసభ్యులు కూడా రావడం లేదన్నారు.
చాలా మంది మృతదేహాలను తీసుకెళ్లేందుకూ ఇష్టపడడం లేదన్నారు. జీవితంలో ఊహించని పరిస్థితి మన కళ్లముందు ఉందన్నారు. కరోనాపై ప్రజలకు ఉన్న అపోహలు తొలగించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కరోనా వైరస్ సోకిన 94 ఏళ్ల వృద్ధురాలు, 20 రోజుల పాప కూడా ఆరోగ్యంగా బయటపడినట్లు వివరించారు. వాక్సిన్లు వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలన్న మంత్రి, కరోనాతో సహజీవనం తప్పదనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నారు.
కరోనా పరీక్షలు పెంచుతాం..
కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో ప్రతిపక్షాలు నోరు పారేసుకుంటున్నాయని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం లేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షలను ఇంకా పెంచమంటే పెంచుతామని స్పష్టం చేశారు. విమర్శలకు ఇది సమయం కాదని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 34 వేల మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, వారిలో 98 శాతం మంది పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్తున్నారని చెప్పారు. కేవలం 2 శాతం మంది మాత్రమే చనిపోతున్నారన్నారు. ‘ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే కరోనా కేసుల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. మరి దీనికి ప్రధాని మోదీ వైఫల్యమనుకోవాలా?’అని ప్రశ్నించారు. కరోనా వ్యాక్సిన్ కోసం దేశంలో ఆరు ఫార్మా కంపెనీలు పని చేస్తుంటే వాటిలో భారత్ బయోటెక్, ఇండియన్ ఇమ్యునలాజికల్స్, బయలజికల్ ఇవాన్స్, శాంతా బయోటెక్స్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పని చేయడం మనం గర్వించదగ్గ విషయమన్నారు.
ఆరేళ్లలో ఐదు మెడికల్ కాలేజీలు: మంత్రి ఈటల
సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటు విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ సీఎం అయిన తర్వాత గత ఆరేళ్లలో రాష్ట్రంలో మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, బీబీనగర్‌లో మెడికల్ కాలేజీలు మంజూరు చేశారన్నారు. వైద్య సేవల విషయంలో కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణ దేశంలో మూడో స్థానంలో దూసుకు పోతోందన్నారు. కరోనాపై అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఈటల.. ప్రభుత్వం, వైద్యుల సూచనలను అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రగతిభవన్ ఓ దేవాలయం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రగతిభవన్‌ను ఓ దేవాలయంగా అభివర్ణించారు. రుణమేళా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రతిపక్షాల తీరుపై ధ్వజమెత్తారు. ‘కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలేవీ ఆపకుండా, అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌ను కొందరు మూర్ఖులు విమర్శిస్తున్నారు. ప్రగతిభవన్‌లో ఏం చేస్తున్నారంటూ అడుగుతున్నారు.. ప్రగతిభవన్ అనేది ఓ దేవాలయం.
రైతుబంధు, పెన్షన్లు, రైతుబీమా వంటి ఎన్నో అద్భుత పథకాల నిలయం ప్రగతిభవన్ అనే విషయాన్ని తెలుసుకోవాలి’అని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ కె.దామోదర్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, బాల్క సుమన్, రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ వెంకట్రావ్, జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణాసుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ ప్రారంభం
రానున్న రోజుల్లో మహబూబ్‌నగర్‌లోని ఎకో పార్క్ అందాలు చూడటానికి హైదరాబాద్ నగరవాసులతో పాటు వివిధ ప్రాంతాల పర్యాటకులు వస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా 2,087 ఎకరాల్లో నిర్మించిన కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్‌ను సోమవారం ఆయన రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్‌తో కలసి ప్రారంభించారు. అనంతరం హరితహారంలో భాగంగా ఈత మొక్కలు నాటారు. ఈ పార్క్‌లో చైన్‌లింక్ ఫెన్సింగ్‌తో పాటు రూ.155.6 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను సైతం ఆయన ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment