సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్ తక్కువగా ఉండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌తో ఊపిరితిత్తులు దెబ్బతిన్న రోగులకు ఆక్సిజన్ అత్యవసరమని, ఆక్సిజన్ బెడ్స్ కొరత కారణంగా వారి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆక్సిజన్ బెడ్స్ సంఖ్యను వెంటనే పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోవిడ్ చికిత్సలకు సంబంధించి దాఖలైన 20 ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ప్రజా ఆరోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తండ్రి ఈ నెల 7న చనిపోయారని, దీంతో ఆయన సెలవులో ఉన్నారని... గతంలో ఇచ్చిన ఆదేశాలపై నివేదిక సమర్పించేందుకు మరో రెండు వారాలు గడువు ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అభ్యర్థించారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవ పరిస్థితికి తేడా ఉంది. మహారాష్ట్రలో రోజుకు 1.5 లక్షల పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలో రోజుకు 40 వేల పరీక్షలు చేస్తామని గతంలో ధర్మాసనానికి హామీ ఇచ్చారు. అయినా అప్పుడప్పుడు పరీక్షల సంఖ్య తగ్గుతోంది. కొన్నిసార్లు పరీక్షలు పూర్తిగా ఆపినట్లుగా పత్రికల్లో చదివాం. పరీక్షల సంఖ్య పెంచాల్సి ఉన్నా ఎందుకు తగ్గిస్తున్నారు? పరీక్షలు పెంచాలని ఇప్పటికి అనేక పర్యాయాలు ఆదేశించాం. కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్ కొరత తీవ్రంగా ఉంది. ఈ మేరకు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. అనేక మంది ద్వారానూ మాకు ఇదే సమాచారం వస్తోంది. ఆక్సిజన్ బెడ్స్ పెంచేందుకు సంబంధించిన ప్రణాళిక ఏమైనా ఉందా?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ బెడ్స్‌ను ఆక్సిజన్ బెడ్స్‌గా మారుస్తున్నామని, త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ఏజీ వివరించారు. పరీక్షల సంఖ్య ఎందుకు తగ్గించారో తదుపరి విచారణకు డాక్టర్ శ్రీనివాసరావు వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.
రోగులు, ఆక్సిజన్ బెడ్స్ నిష్పత్తి పెంచాలి
‘‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల మేరకు ప్రతి వెయ్యి మంది రోగులకు 5 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉండాలి. ఇతర రాష్ట్రాల్లో ప్రతి 1,000 మంది రోగులకు 3 అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందికి 1 బెడ్ మాత్రమే అందుబాటులో ఉంటోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బెడ్స్ సంఖ్య చాలా తక్కువ. గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుకు సంబంధించి పూర్తి వివరాలు అక్టోబర్ 6లోగా సమర్పించండి’’ అని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment