సాక్షి, న్యూఢిల్లీ: మృతదేహాలను ఆసుపత్రి నుంచి తరలించే ముందు కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కరోనా టెస్టులు తగి నన్ని నిర్వహించడం లేదంటూ పీఎల్ విశ్వేశ్వర్‌రావు, డాక్టర్ చెరుకు సుధాకర్ తదితరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం లో మే 26 నాటి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం సంబంధిత పిటిషన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది శ్యాందివాన్, న్యాయవాది ఉదయ్ కుమార్‌సాగర్ వాదనలు వినిపిస్తూ ఐసీఎంఆర్ వద్ద కూడా తగినన్ని టెస్ట్ కిట్లు లేవని, అవసరమైన సందర్భాల్లోనే పరీక్షలు జరపాలన్న నిబంధనలు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రతివాదులకు నోటీసులు జారీచేయడంతో పాటు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అలాగే స్వస్థలాలకు వచ్చిన వలస కార్మికుల సంఖ్య, వారికి జరిపిన కరోనా పరీక్షల సంఖ్య, కోవిడ్ కట్టడి జోన్లు గ్రీన్ జోన్లుగా మార్చిన వివరాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కోర్టు ధిక్కరణ హెచ్చరికలపైనా స్టే
సదరు కేసులో తాము ఇచ్చిన ఉత్తర్వులు పాటించడం లేదని, కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందంటూ హైకోర్టు జూన్ 8న జారీచేసిన ఉత్తర్వులను అపరిపక్వమైనవే కాకుండా.. ఈ దశలో అలాంటి ఉత్తర్వులు సరైనవి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన మరో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కూడా విచారించిన జస్టిస్ అశోక్‌భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం హైకోర్టు జూన్ 8న జారీచేసిన ఉత్తర్వులపైన కూడా స్టే విధించింది.
Comments
Please login to add a commentAdd a comment