సాక్షి, జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గం 1957లో ఆవిర్భవించింది. చారిత్రకంగా, వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత డివిజన్ కేంద్రం కాస్తా 2014లో జిల్లా కేంద్రంగా మారడంతో జగిత్యాల రూపురేఖలు మారిపోయాయి. ఇక్కడ సుమారు రూ.26 కోట్లతో సమీకృత కలెక్టరేట్ భవనం నిర్మించారు. ఎస్పీ కార్యాలయం, వైద్య, నర్సింగ్, వ్యవసాయ కళాశాలలు, మాతాశిశు సంరక్షణ, డయాగ్రోస్టిక్ కేంద్రాలు, 50 బెడ్లతో క్రిటికల్ కేర్ యూనిట్, న్యాక్ సెంటర్ ఏర్పాటయ్యాయి. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి 330 బెడ్స్‌గా అప్‌గ్రేడ్ అయ్యింది. జగిత్యాల మున్సిపాలిటీతోపాటు, జగిత్యాల అర్బన్, రూరల్, రాయికల్, సారంగాపూర్, బీర్‌పూర్ మండలాలున్నాయి.
ఉమ్మడి జిల్లాలోనే గుర్తింపు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీయే ఎక్కువగా తొమ్మిదిసార్లు విజయం సాధించింది. 1983లో ఎన్టీ రామారావు టీడీపీని ప్రారంభించగా ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆ పార్టీ తరఫున పోటీ చేసి, గెలిచారు. కానీ, ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోవడంతో 1985లో బై ఎలక్షన్ వచ్చింది. అప్పుడు తెలుగుదేశం తరఫున ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ రాజేశంగౌడ్ గెలుపొందారు. జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి, 1989లో విజయం సాధించారు.
జీవన్ రెడ్డి గెలుపునకు బ్రేక్ వేసిన రమణ
జీవన్‌రెడ్డి గెలుపునకు ఎల్.రమణ బ్రేక్ వేశారు. 1994లో అనూహ్యంగా తెలుగుదేశం టికెట్ దక్కడంతో జీవన్‌రెడ్డిని ఓడించారు. దీంతో రమణకు చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రి పదవి సైతం దక్కింది. కానీ, సంవత్సరానికే ఎంపీ ఎన్నికలు రావడంతో కరీంనగర్ నుంచి పోటీ చేసి, చొక్కారావును ఓడించి జాయింట్ కిల్లర్‌గా పేరుగాంచారు. 1996లో జరిగిన బై ఎలక్షన్‌లో జీవన్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు.
విచిత్రం ఏమిటంటే ప్రభుత్వం టీడీపీ ఉంటే జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే మరో పార్టీకి చెందినవారు ఉండేవారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఎమ్మెల్యేగా ఎల్.రమణ, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా జీవన్‌రెడ్డి కొనసాగారు. 2014లో బీఆర్‌ఎస్ నుంచి డాక్టర్ సంజయ్‌కుమార్ పోటీ చేసినప్పటికీ జీవన్‌రెడ్డినే ప్రజలు గెలిపించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా 60 వేల మెజారిటీతో డాక్టర్ సంజయ్‌కుమార్ గెలుపొందారు.
ఎన్టీఆర్, వైఎస్సార్ మంత్రివర్గాల్లో చోటు..
జగిత్యాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత జీవన్‌రెడ్డికే దక్కింది. అలాగే మొదటిసారి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో ఎకై ్సజ్ శాఖ మంత్రిగా, అనంతరం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా అవకాశాలు దక్కాయి. అలాగే, టీడీపీ నుంచి మొదటిసారి గెలిచిన ఎల్.రమణ చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో చేనేత, జౌళిశాఖ మంత్రిగా, ఖాదీబోర్డు చైర్మన్‌గానూ పని చేశారు. మొదటిసారి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సంజయ్‌కుమార్ ఓటమిపాలవగా, రెండోసారి అత్యధిక మెజారిటీతో జీవన్‌రెడ్డిపై గెలుపొందారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపుపై ధీమాగా ఉండి, ప్రచారంలో దూసుకుపోతున్నారు.
నియోజకవర్గ ఓటర్ల వివరాలు..
పురుషులు: 1,09,300
మహిళలు: 1,17,315
ట్రాన్స్‌జెండర్లు : 20
మొత్తం : 2,26,635
పలు హామీలు పెండింగ్..
జగిత్యాల నియోజకవర్గం వ్యవసాయాధారిత ప్రాంతం. రైతులు ఎక్కువగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలు పండిస్తుంటారు. ఎస్సారెస్పీ ప్రధాన నీటి వనరు. ఉద్యానవన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని నాయకులు చెబుతున్నా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. అలాగే, జగిత్యాలలో యావర్ రోడ్ విస్తరణ పెండింగ్ ఉంది. ఇటీవలే ప్రభుత్వం అనుమతించడంతో కదలిక వచ్చి, మార్కింగ్ చేశారు.
నియోజకవర్గంలో మామిడి ఉత్పత్తి కూడా ఎక్కువే. మామిడి మార్కెట్ సైతం ఉంది. ఇక్కడి నుంచి విదేశాలకు మామిడికాయలను ఎగుమతి చేస్తున్నారు. ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేస్తే మామిడి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నాయకులు ఏటా హామీ ఇస్తున్నా అమలులో సాధ్యం కావడం లేదు. రాయికల్ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఇక్కడ డిగ్రీ కళాశాల, ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే, సారంగాపూర్‌లో రూ.135 కోట్లతో రోళ్లవాగు ప్రాజెక్టు పూర్తయింది.
Comments
Please login to add a commentAdd a comment