సాక్షి, జగిత్యాల: దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో ఉండి పోరాటం చేశామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ తినబోయే ముందు వేరే వాళ్ళు వచ్చి కంచం లాక్కున్నట్టుంది మా పరిస్థితి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కుల గణన ద్వారా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు.
జగిత్యాలలో నేడు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి పోరాటం చేశాం. ఇవాళ తినబోయే ముందు వేరే వాళ్లు వచ్చి కంచం లాక్కున్నట్టుంది మా పరిస్థితి. విప్ లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ జగిత్యాల కాంగ్రెస్ నాయకులకు ఆత్మస్థైర్యం కల్పించే విధంగా అండగా ఉండాలి. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకుందాం. కుల గణన ద్వారా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుంది. నవంబర్ నెల చివరి వరకు సర్వే రిపోర్ట్ వస్తే డిసెంబర్ నెలలో ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక చేసుకోవచ్చు. తద్వారా జనవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం ఉంది అంటూ కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని పదేళ్లు నిండా ముంచారు. పదవులు లేకపోతే కేటీఆర్, కేసీఆర్ ఉండలేకపోతున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నట్టుగా శ్వేతపత్రం విడుదల చేశారు. చేసిన అప్పులు కొరకే ప్రజలను క్షమించమంటూ కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నాడని ప్రజలకు వివరించాలి. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment