సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. జిల్లా అంతటా పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పారు. ఒకే నియోజకవర్గం నుంచి ఎదిగి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆ నియోజకవర్గం ఏదో చూద్దాం. అక్కడ నుంచి ఎదిగి చక్రాలు తిప్పిన ఆ నేతలపై ఓ లుక్కేద్దాం.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎన్నికల సమయంలోనే ఆ ప్రత్యేకతలు బయటకొస్తాయి. ప్రచారం పొందుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్థన్నపేట నియోజకవర్గం అలాగే ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. ఓరుగల్లు జిల్లా అంతటా విస్తరించారు. అన్ని చోట్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందారు.
రాష్ట్ర మంత్రులయ్యారు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చక్రాలు తిప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరరావు, ఎర్రబెల్లి వరదరాజేశ్వరరావు, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, బోయినపల్లి వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వన్నాల శ్రీరాములు...ఇలా చాలా మంది నేతలు వర్థన్నపేట నియోజకవర్గానికి చెందినవారే. వీరిలో పురుషోత్తమరావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు.
వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం పట్టణం, పల్లెలు కలిసి వరంగల్ మహానగరం చుట్టూ విస్తరించి ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం ఆధ్యాత్మిక, వాణిజ్య, వైద్య, విద్యరంగాల్లో పేరుగాంచింది. వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, హనుమకొండ, ఖిలావరంగల్, కాజీపేట, హసన్‌పర్తి, వరంగల్ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్ధన్నపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో జరిగిన పునర్విభజనలో వర్థన్నపేట ఎస్సీ నియోజకవర్గంగా మారింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండేటి శ్రీధర్ విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో తెరాస తరపున బరిలో నిలిచిన అరూరి రమేశ్ గెలుపొందారు. హ్యాట్రిక్ సాధిస్తానంటూ మూడోసారి ఆరూరి రమేష్ వర్థన్నపేట నుంచి బరిలో దిగారు.
ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉంటూ.. పాలకుర్తి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి 4వ సారి బరిలో నిలిచిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి పురుషోత్తమరావు స్వగ్రామం వర్థన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి. ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సొంత గ్రామం ఇదే నియోజకవర్గంలోని ఐనవోలు మండలం పున్నేలు. ఇలా ఎందరో ప్రముఖ నాయకులను అందించిన గడ్డగా వర్థన్నపేట రాష్ట్రంలోనే పేరు పొందింది.
ఇవి చదవండి: గంగుల.. నా సహనాన్ని పరీక్షించొద్దు! దొంగ వీడియోలు సృష్టిస్తే.. : బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment