అపార్‌కార్డు
సాక్షి, నిర్మల్: ‘ఆధార్’ తరహాలో విద్యార్థుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అపార్(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) పేరుతో ’వన్ నేషన్–వన్ ఐడీ’ కార్డును అందుబాటులోకి తేనున్నారు. వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర విద్యావనరులశాఖ తాజాగా ఆదేశించింది.
అపార్ ఐడీ కార్డును దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్నారు. ఈ అపార్ సంఖ్యనే విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. ఇందులో విద్యార్థి అకడమిక్ జర్నీ, విద్యా ప్రయాణం, విజయాలు నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైన సమయంలో ట్రాక్ చేయొచ్చని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి సమ్మతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలను కోరింది. ఈ అపార్ ఐడీ ప్రాముఖ్యతను వివరించాలని చెప్పింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించాలని సూచించింది. ఇందుకు ఓకే చెప్పిన తల్లిదండ్రులు ఆతర్వాత ఎప్పుడైనా దాన్ని ఉపసంహరించుకోవచ్చని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
ప్రయోజనం ఏమిటి?
విద్యార్థి కేజీ నుంచి పీజీ వరకు చదివిన, చదువుతున్న సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు వస్తాయి. ఎల్‌కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా ఈ కార్డు ఉపయోగపడనుంది. ఈ కొత్త కార్డును ఆధార్ సంఖ్యతో పాటు ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)’ అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించబడి ఉంటుంది.
పాఠశాల విద్యలోని పిల్లలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘చైల్డ్ ఇన్ఫో’ పేరిట ఒక్కో విద్యార్థికి, ఒక్కో సంఖ్య విధానాన్ని కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ అమలు చేయబోతున్న ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా 1 నుంచి 12వ తరగతి వరకు దాదాపు 26 కోట్ల మంది విద్యార్థులకు 12 అంకెలున్న సంఖ్యను కేటాయిస్తారు.
‘అపార్’ నిర్వహణ ఇలా..
కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంకు ఈ బాధ్యతను అప్పగించింది. దీనికి చైర్మన్‌గా ఏఐసీటీఈ మాజీ చైర్మన్ ఆచార్య సహస్రబుద్దే వ్యవహరిస్తున్నారు. ఆధార్‌తో అనుసంధానం చేసిన ప్రత్యేక సంఖ్యను నమోదుచేస్తే విద్యార్థి కుటుంబ వివరాలు, మార్కుల సర్టిఫికెట్లు, నైపుణ్యాలు, పొందిన స్కాలర్‌షిప్స్, తదితర వివరాలన్నీ తెలుసుకునే వీలుంటుంది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందే సమయంలోనూ ధ్రువీకరణ పత్రాలను భౌతికంగా కాకుండా డిజిటల్‌లో పరిశీలించి సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లోనూ ఈ సంఖ్యను నమోదుచేస్తే సరిపోతుందని ఏఐసీటీఈ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
నమోదు ప్రక్రియ..
తల్లిదండ్రుల సమ్మతితో పాఠశాలలో నమోదు ప్రక్రియ నిర్వహించబడుతుంది, వారు ఏ సమయంలోనైనా వారి సమ్మతిని ఉపసంహరించుకోవచ్చు. అవసరమైతే సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే డేటాను పంచుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పాఠశాలల ద్వారా ప్రతీ విద్యార్థిపై సేకరించిన డేటా జిల్లా సమాచార పోర్టల్‌లో నిల్వ చేయబడుతుంది.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 వేలకుపైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, దాదాపు 200కు పైగా ఇంటర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 4 లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ స్థాయిలో చైల్డ్ ఇన్ఫో ద్వారా ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ఐడీ నంబరు కేటాయించబడింది. కళాశాల స్థాయిలో మరో గుర్తింపు సంఖ్య ఉంటుంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న అపార్ ఐడీ కార్డు ద్వారా మొత్తం ఒకే కార్డులో పూర్తి విద్య ప్రగతి, సమాచారం నిక్షిప్తమై అందుబాటులోకి రానుంది.
విద్యార్థులకు సౌలభ్యం!
విద్యార్థి తన విద్యాభ్యా స దశలో వివిధ రకాల ప్రాంతాల్లో అభ్యసిస్తా డు. వీటన్నింటిని ఒకే గొడుగు కిందికి తేవడం అనేది శుభ పరిణామం. ఈ అపార్ ఐడీ విధానం విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుంది. పదేపదే టీసీలు, బోనఫైడ్, పత్రాలు సేకరించడం వంటి సమస్యలు తీరుతాయి. విద్యార్థి ప్రగతి నైపుణ్యాలు ఒకేచోట నిక్షిప్తం చేయబడతాయి. – జిలకరి రాజేశ్వర్, తపస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు, నిర్మల్
ప్రయోజనకరంగా ఉంటుంది
విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం ఏకీకృతంగా అపార్ కార్డు ద్వారా అందుబాటులోకి రావడం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన సమాచారం ఒకే ఐడీ నంబర్ ద్వారా నిక్షిప్తమై ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించిన తర్వాత వారి అనుమతితేనే విద్యాశాఖ ముందుకెళ్తుంది. – డాక్టర్ రవీందర్‌రెడ్డి, డీఈవో, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment