
పాకిస్థానీ గాయకుడికి గూగుల్ నివాళి
ప్రముఖ పాకిస్థానీ గాయకుడు నస్రత్ ఫతే అలీఖాన్ కు ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్ తనదైన శైలిలో నివాళి అర్పించింది.
ఢిల్లీ: ప్రముఖ పాకిస్థానీ గాయకుడు నస్రత్ ఫతే అలీఖాన్ కు ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్ తనదైన శైలిలో నివాళి అర్పించింది. ఫతే అలీ ఖాన్ జయంతిని పురస్కరించుకుని ఆయన ఫోటోను 'డూడుల్'గా పెట్టింది. తన బృందంతో కలిసి ఆయన కచేరీ చేస్తున్న చిత్రాన్ని పోస్ట్ చేసింది.
ఫతే అలీ ఖాన్ తన్మయత్వంతో పాటుతున్నట్టుగా ఈ ఫోటోలో ఉంది. గానంలో లీనమై పైకి ఎత్తిన ఆయన ఎడమ చేతిని గూగుల్ లోని 'ఎల్' అక్షరానికి బదులుగా డూడుల్ లో చూపించింది. ఫతే అలీ ఖాన్ 1948, అక్టోబర్ 13న జన్మించారు. ఖవ్వాలీ గాయకుడిగా ఆయన ప్రఖ్యాతి గాంచారు. 49 ఏళ్ల వయసులో 1997, ఆగస్టు 16న గుండెపోటుతో కన్నుమూశారు.