న్యూఢిల్లీ : ప్రఖ్యాత కంటి వైద్య నిపుణులు (ఆప్తమాలజిస్ట్) డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామికి గూగుల్ ఘననివాళి అర్పించింది. ఆయన శతజయంతి సందర్భంగా నేడు (అక్టోబర్1, 2018) ప్రత్యేక డూడుల్‌ని రూపొందించి వెంకటస్వామికి అంకితమిచ్చింది.
‘డాక్టర్ వి’ సుపరిచితమైన డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి అక్టోబర్ 1, 1918న తమిళనాడులోని వడమలపురంలో జన్మించారు. మద్రాస్ లోని స్టాన్లీ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించి.. 1951 లో మద్రాసులోని గవర్నమెంట్ ఆప్తాల్మిక్ ఆస్పత్రిలో ఆప్తమాలజీలో ఎమ్మెస్సీతో అర్హత సాధించారు. ఆ తరువాత ప్రభుత్వ వైద్యుడిగా పనిచేశారు. అరవింద్ ఐ అస్పత్రిని నిర్మించి కంటి జబ్బులతో బాధపడేవారికి మంచి వైద్యం అందించేందుకు కృషి చేశారు. కేవలం 11 బెడ్లు, ఓ నలుగురు వైద్యులతో ప్రారంభమైన అరవింద్ అస్పత్రి ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత కంటి ఆసుపత్రుల్లో ఒకటిగా మారింది. డాక్టర్ వెంటకస్వామి తన జీవిత మొత్తాన్ని అంధత్వాన్ని నిర్మూలించడానికి అంకితం చేశారు.
డాక్టర్ వెంకటస్వామి 30 ఏళ్ళ వయసులో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధితో శాశ్వతంగా వికలాంగులయ్యారు. అయితేనేం మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో దేశంలోనే ప్రముఖ కంటి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన వ్యక్తిగతంగా లక్షకు పైగా కంటి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ఒకేరోజు 100 కంటి శస్త్ర చికిత్సలు చేసి చరిత్ర సృష్టించారు. ఆయన 1973లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. జూలై 7, 2006లో వెంటకస్వామి మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment