సూపర్‌స్టార్‌ను జ్ఞాపకం చేసిన గూగుల్
బెంగళూరు: కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్‌కు గూగుల్ ఘన నివాళి అర్పించింది. ఆయన 88వ జయంతి సందర్భంగా ప్రత్యేక డూడుల్‌తో ఆకట్టుకుంది. ఓ తెరమీద బ్యాక్ గ్రౌండ్‌లో గూగుల్ అని ఉండి యువకుడిగా రాజ్‌కుమార్ చిరునవ్వు చిందిస్తుండగా ఎదురుగా ప్రేక్షకులు కూర్చొని ఆయనను చూస్తున్నట్లుగా ఆ డూడుల్ ఉంది. 1929లో అంబరీష్ సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజుగా జన్మించిన ఆయన వెండి తెర వెలుగుపైకి రాగానే రాజ్‌కుమార్‌గా మారిపోయారు.
దాదాపు నాలుగు దశాబ్దాలు కన్నడ చిత్ర పరిశ్రమను ఏలారు. 1954 బేదారా కన్నప్పా అనే కన్నడ చిత్రం ద్వారా సినీలోకంలో అడుగుపెట్టిన ఆయన దాదాపు 200 చిత్రాల్లో నటించింది. ఆయన జీవితం మొత్తం కన్నడ చిత్ర పరిశ్రమకే అంకితం చేశారు. ఆయన మంచి గాయకుడిగా కూడా పేరు సంపాధించుకున్నారు. 300వందల పాటలు కూడా పాడారు. పద్మభూషణ్, దాదా సాహేబ్ పాల్కే వంటి అవార్డులు కూడా పొందారు. ప్రస్తుతం ఆయన కుమారులు శివరాజ్‌కుమార్, పునీత్ రాజకుమార్ కూడా కన్నడ చిత్ర సీమలో ప్రముఖులుగా ఉన్నారు.