ఓటమి ఎరుగని వీరుడు.. గామా ది గ్రేట్‌! | Google Doodle Celebrates Gama Pehlwans 144th Birth Anniversary | Sakshi
Sakshi News home page

ఓటమి ఎరుగని వీరుడు.. గామా ది గ్రేట్‌!

Published Mon, May 23 2022 2:09 AM | Last Updated on Mon, May 23 2022 1:36 PM

Google Doodle Celebrates Gama Pehlwans 144th Birth Anniversary - Sakshi

ఆదివారం (నిన్న) గూగుల్‌ డూడుల్‌ చూశారా? ఆయనెవరో గుర్తుపట్టారా? తన జీవితంలో ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని రెజ్లింగ్‌ చాంపియన్‌ ‘గామా పహిల్వాన్‌’.. ఇంకా చెప్పాలంటే ‘గామా ది గ్రేట్‌’. మనోడే.. ఆయనను చూస్తేనే ప్రపంచంలోని ప్రఖ్యాత రెజ్లర్లు గడగడా వణికిపోయేవారంటే.. గామా పహిల్వాన్‌ రేంజ్‌ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం ఆయన 144వ జయంతి సందర్భంగా గూగుల్‌ ప్రత్యేకమైన ‘డూడుల్‌’తో నివాళి అర్పించింది. సోమవారం (మే 23) ఆయన 62వ వర్ధంతి కూడా.. ఈ నేపథ్యంలో ఆ మహాబలుడి గురించి తెలుసుకుందామా..
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

గామా పహిల్వాన్‌ అసలు పేరు గులామ్‌ మహమ్మద్‌ భక్ష్‌ భట్‌. పంజాబ్‌లోని జబ్బోవల్‌ గ్రామంలో 1878 మే 22న జన్మించాడు. చిన్నవయసు నుంచే వ్యాయామాలు అలవాటు చేసుకున్న ఆయన.. 1888లో జరిగిన స్క్వాట్స్‌ పోటీలో పాల్గొన్నాడు. దేశవ్యాప్తంగా 400 మందికిపైగా రెజ్లర్లు పాల్గొన్న ఆ పోటీలో గెలవడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించాడు. 15 ఏళ్లకే రెజ్లింగ్‌ మొదలుపెట్టాడు. 1910లో 22 ఏళ్ల వయసులోనే భారత ప్రపంచ హెవీ వెయిట్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ గెలుచుకున్నాడు. 1927లో ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సాధించాడు.  

ఓటమి మాటే తెలియకుండా.. 
సాధారణంగా బాక్సర్లకు తమ ఎత్తు బాగా కలిసొస్తుంది. మరి గామా పహిల్వాన్‌ ఎత్తు 5.7 అడుగులే. 120 కిలోల బరువు ఉండేవాడు. రోజుకు 5 వేల స్క్వాట్స్‌ (గుంజిళ్ల వంటివి), మరో మూడు వేల పుషప్స్‌ చేసేవాడు. రాళ్లతో తయారుచేసిన 96 కిలోల బరువున్న చక్రాన్ని ఎత్తుకుని స్క్వాట్స్‌ చేసేవాడు. మరెన్నో ప్రత్యేక వ్యాయామాలనూ రూపొందించాడు. తాను 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే.. 1,200 కిలోల గుండ్రాయిని ఎత్తి రికార్డు సృష్టించాడు. అది ఇప్పటికీ బరోడా మ్యూజియంలో ఉంది. 

♦ పోటీ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా సరే.. గామా పహిల్వాన్‌ కొద్ది నిమిషాల్లోనే ముగించేవాడు. 1927 ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీల్లో, ఆ తర్వాత జరిగిన విదేశీ టోర్నీల్లో.. అప్పటి ప్రపంచ ప్రఖ్యాత యూరప్, అమెరికన్‌ రెజ్లర్లు ఫ్రాంక్‌ గోట్చ్, బెంజమిన్‌ రోలర్, మౌరిస్‌ డెరిజ్, జోహన్‌ లెమ్, జెస్సీ పీటర్సన్‌ వంటివారిని వరుసగా ఓడించాడు.  

♦ తర్వాత కూడా తనతో పోటీకి రావాలని అమెరికా, యూరప్‌ రెజ్లర్లతోపాటు జపాన్‌కు చెందిన టారో మియాకె, రష్యాకు చెందిన జార్జ్‌ హకెన్‌షిమిట్‌ వంటివారికీ గామా పహిల్వాన్‌ సవాల్‌ చేశాడు. కానీ ఎవరూ ముందుకురాలేదు. చివరికి ఒకరి తర్వాత ఒకరుగా 20 మంది రెజ్లర్లు వచ్చినా అందరితో పోరాడుతానని.. తాను ఓడిపోతే ప్రపంచ చాంపియన్‌షిప్‌ ప్రైజ్‌మనీని కూడా తిరిగిచ్చేస్తానని సవాల్‌ చేశాడు. అయినా గామాతో పోటీ పడేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడం గమనార్హం. 

నిజాం యోధులనూ ఓడించి 
1940లో నిజాం రాజు గామా పహిల్వాన్‌ను హైదరాబాద్‌కు పిలిపించి పోటీలు నిర్వహించాడు. నిజాం జనానాలోని మల్లయోధులందరినీ గామా పహిల్వాన్‌ ఓడించాడు. దీనితో నిజాం అతడిని సన్మానించి పంపాడు. 

గామాకు బ్రూస్‌లీ ఫ్యాన్‌.. 
గామా పహిల్వాన్‌కు ప్రపంచ ప్రఖ్యాత మార్షల్‌ ఆర్టిస్ట్‌ బ్రూస్‌లీ పెద్ద ఫ్యాన్‌. గామా నుంచి స్ఫూర్తి పొంది కొన్ని వ్యాయామాలను తాను అనుసరించినట్టు బ్రూస్‌లీ చాలాసార్లు చెప్పడం గమనార్హం. 

♦ గామా పహిల్వాన్‌ శకం నడిచినప్పుడు భారత్‌ బ్రిటీషు పాలనలో ఉంది. బ్రిటిష్‌ రాచ కుటుంబానికి చెందిన ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ గామాను సన్మానించి.. ఒక వెండి గదను బహూకరించాడు.  

హిందువులను కాపాడి.. 
దేశ విభజన సమయంలో గామా పహిల్వాన్‌ పాకిస్తాన్‌కు వెళ్లిపోయాడు. ఆ సమయంలో అక్కడి హిందువులు ఎంతో మందిని ఆయన కాపాడారని చెప్తారు. పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భార్య కుల్సుమ్‌ గామా పహిల్వాన్‌ మనవరాలే. 50 ఏళ్లకుపైగా రెజ్లింగ్‌లో ఎదురులేని వీరుడిగా నిలిచి.. 74 ఏళ్ల వయసులో 1952లో రిటైరయ్యాడు. తర్వాత ఎనిమిదేళ్లకు 1960 మే 23న లాహోర్‌లో కన్నుమూశాడు.  

పారిపోయిన ప్రపంచ చాంపియన్‌ 
1910 లండన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీల్లో అప్పటివరకు ప్రపంచ చాంపియన్‌గా ఉన్న బ్రిటిష్‌  స్టానిస్లస్‌ జిబిజ్కో.. గామా పహిల్వాన్‌ ధాటిని తట్టుకోలేకపోయాడు. ఓటమిని అంగీకరించకుండా.. తరచూ బోర్లా పడుతూ మ్యాట్‌ను పట్టుకుని ఉండిపోతూ వచ్చాడు. ఇలా రెండున్నర గంటలకుపైగా సాగిన మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. తర్వాత వారం రోజులకే వారిద్దరి మధ్య మళ్లీ పోటీ పెట్టారు.

జిబిజ్కో భయంతో మ్యాచ్‌కు రాకపోవడంతో.. గామా పహిల్వాన్‌ను విజేతగా ప్రకటించారు. తర్వాత 1928లో మన దేశంలోని పటియాలాలో జరిగిన చాంపియన్‌షిప్‌లో జిబిజ్కో–గామా పహిల్వాన్‌ మధ్య పోటీ పడింది. జిబిజ్కోను గామా కేవలం రెండు నిమిషాల్లో మట్టికరిపించాడు. అప్పుడే ‘గామా పహిల్వాన్‌ పులి’ అంటూ జిబిజ్కో ప్రకటించాడు. (క్లిక్‌: చరిత్ర సృష్టించిన ఐపీఎల్‌ 2022..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement