
అన్ని అవయవాలు సవ్యంగా ఉన్నా చాలా మంది ఆటలు ఆడటానికి ఆసక్తి చూపరు. కానీ ఒక కాలు లేకపోయినా ఓ యువకుడు కుస్తీ పోటీలో పాల్గొనడమే కాకుండా, విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తానెవరికీ తీసిపోనని క్రీడాభిమానుల సాక్షిగా నిరూపించాడు. సంకల్ప బలానికి వైకల్యం అడ్డురాదని చాటిచెప్పాడు.
పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు దివ్యాంగ మల్లయోధుడు యు. సాయిలు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో బేడీల మైసమ్మ ఉత్సవాల్లో భాగంగా సోమవారం కుస్తీపోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం మల్లయోధులు తరలి వచ్చారు. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) నారాయణఖేడ్ పట్టణానికి చెందిన దివ్యాంగ మల్లయోధుడు (Divyang Wrestler) సాయిలు కూడా ఈ కుస్తీ పోటీల్లో పాల్గొన్నాడు. ఆయన రూ.500 కుస్తీ పోటీల్లో ఓ మల్లయోధునితో కుస్తీ పట్టి విజయం సాధించాడు. దీంతో సాయిలు పోరాటానికి మెచ్చిన ప్రేక్షకులు రూ.3 వేల వరకు విరాళాలు అందజేశారు. వివిధ విభాగాల్లో కుస్తీపోటీల్లో గెలుపొందిన మల్లయోధులకు నిర్వాహకులు నగదును బహుమానంగా అందజేశారు.
కట్టె కాసులు తెచ్చి పెట్టె
తెల్లబంగారం (White Gold) సాగులో ఆదిలాబాద్ జిల్లాది ఆసియాలోనే ప్రథమ స్థానమని చెప్పొచ్చు. జిల్లాలో 90 శాతం మంది రైతులు పత్తి పంటనే సాగు చేస్తున్నారు. పత్తితీత అనంతరం మిగిలిన చెట్లను గతంలో ట్రాక్టర్ల సాయంతో పెరికేసి చేలల్లోనే కాల్చేసేవారు. అయితే ఇప్పుడు పరిశ్రమల్లోని బాయిలర్లలో ఉపయోగించే బ్రికెట్లను ఈ పత్తి కట్టెతో తయారు చేస్తుండటంతో పత్తికట్టె కూడా అన్నదాతకు లాభసాటిగా మారింది.

రైతులు పత్తి ఏరివేసిన అనంతరం మిగిలిన పత్తి కట్టెకు వ్యాపారులు ఎకరాకు రూ.300 చెల్లించి.. వారే ట్రాక్టర్ల ద్వారా తొలగించి జిల్లా కేంద్రంలోని ఓ పరిశ్రమకు తరలిస్తున్నారు. అక్కడ క్రష్ చేసి బ్రికెట్స్‌ను తయారు చేస్తున్నారు. దీంతో పత్తి కట్టె అన్నదాతకు అదనపు లాభంగా మారింది.
చి‘వరి’కి పశువుల మేతగా..
ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): రైతుల ఆరుగాలం కష్టం పశువులకు మేతగా మారుతోంది. సాగునీరు అందక ఎండుతున్న పంటలను పశువులకు మేతగా వదిలేస్తున్న రైతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండాకు చెందిన రైతు గుగులోతు మహేశ్‌నాయక్.. అప్పులు చేసి ఆరు ఎకరాల్లో వరిపంట సాగు చేశాడు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నాలుగు బోర్లు ఎత్తిపోయాయి.

మల్కపేట రిజర్వాయర్ నుంచి కాలువల వెంట సాగునీటిని విడుదల చేయకపోవడంతో.. సాగు చేసిన పంట కళ్ల ముందే ఎండిపోతోంది. సాగునీటి కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోవడంతో చి‘వరి’కి రైతు మహేశ్‌నాయక్ పంట పొలాన్ని పశువులకు వదిలేశాడు. ఇలాంటి పరిస్థితి జిల్లావ్యాప్తంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment