divyangudu
-
Crime: ‘పిన్నమ్మా.. నాకు పెళ్లి చెయ్యవా?’
క్రైమ్: అతనొక దివ్యాంగుడు. వైకల్యాన్ని లెక్కచేయకుండా.. బాగా చదువుకున్నాడు. ఎవరి మీదా ఆధారపడకూడదని ఓ చిన్న ఉద్యోగం సంపాదించుకుని.. జీవితంలో ముందుకు వెళ్తున్నాడు. అయితే వయసు మూడు పదులు దాటడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదే అతని పాలిట మరణ శాసనం అయ్యింది. వివాహం చేసుకోవాలని ఉందని చెప్పినందుకు ఓ దివ్యాంగుడిని.. సవతి తల్లి, అతని తండ్రి సాయంతోనే కడతేర్చింది. ఒడిషా నయాగఢ్ జిల్లా పథరాపుంజ గ్రామం దసపల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం చోటు చేసుకుంది. బాధితుడు విజయ్ ప్రధాన్(35).. తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. దీంతో అతని తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. ఆమెకు సంతానం ఉంది. తన పిల్లలను బాగా చూసుకుంటూ.. విజయ్ను రాచిరంపాన పెడుతూ వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. అయినా విజయ్ మాత్రం పట్టించుకోకుండా బాగా చదువుకుని.. స్థానికంగా ఓ చిన్నకంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో వివాహం చేసుకోమని అతని మేనత్త, మేనమామలు సూచించారు. వాళ్ల కోరిక ప్రకారం స్థిరపడాలనుకున్నాడు. అయితే.. పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం విజయ్ లాక్కెళ్లిపోతాడేమోనని ఆ సవతి తల్లి భయపడింది. అతని వివాహానికి ససేమీరా చెప్పింది. అయినా విజయ్ మేనత్త సంబంధాలు చూడసాగింది. ఇది ఆ సవతి తల్లికి కోపం తెప్పించింది. శనివారం ఈ విషయంపై ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. ఈ క్రమంలో సవతి తల్లి, విజయ్ తండ్రి, వాళ్ల పిల్లల సాయంతో.. విజయ్ను కర్రలతో కొట్టి చంపారు. ఈ మేరకు విజయ్ బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. వాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
చదువు చెప్పిస్తూ.. భరోసా కల్పిస్తూ .. అంధుల జీవితాల్లో ‘వెలుగు’ రేఖ
ఈ పోటీ ప్రపంచంలో అడుగు తీసి అడుగు వేయాలన్నా ఏదో తెలియని భయం వెనక్కు లాగుతూనే ఉంటుంది. ఆర్థిక స్థోమత.. కుటుంబ నేపథ్యం.. పరిస్థితులు.. ఎక్కడో ఒక చోట ఏదో ఒక అవాంతరం ఉండనే ఉంటుంది. అన్నీ అవయవాలు బాగున్న వాళ్ల పరిస్థితే విజయం, అపజయం మధ్య ఊగిసలాడుతుంటుంది. అలాంటిది అసలు కళ్లే కనిపించకపోతే. అందునా ఎవరి ప్రోత్సాహం లేకపోతే.. లోకులు కాకులైతే.. ఆ జీవితం ‘అంధకారమే’. అదే చీకటి సంధించిన ప్రశ్నలకు సమాధానంగా వేసిన అడుగు.. ఓ అంధుని బంగారు భవితకు బాటగా మారింది. అలాంటి ఎన్నో జీవితాల్లో ‘వెలుగు’లు నింపుతోంది. గూడూరు(తిరుపతి జిల్లా): ఓజిలి మండలం, కురుగొండకు చెందిన బచ్చల సుబ్బారెడ్డి, సుదర్శనమ్మల రెండో సంతానం శివకుమార్‌రెడ్డి. ఐదేళ్ల వయసులోనే చూపు మందగించింది. క్రమంగా అంధత్వానికి దారితీసింది. విధి ఆ చిన్నారికి చూపు లేకుండా చేసిందే కానీ.. ఆ వయస్సులోనే విద్యపై చిగురించిన ఆసక్తిని తుడిచేయలేకపోయింది. కళ్లే కనిపించని పిల్లాడికి చదువు ఎందుకన్నారు.. ఇంట్లో వాళ్ల మెదళ్లలోనూ ఆ విషబీజం నాటుకుంది. ఆ పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం అండగా నిలిచింది. చదువుకుంటేనే తాను సమాజంలో నిలదొక్కుకోగలననే విషయం అర్థమైంది. అలా మొక్కవోని దీక్ష తోడు కావడంతో పదో తరగతి వరకు వెంకటగిరిలో.. ఆ తర్వాత ఇంటర్మీడియెట్, డిగ్రీ తిరుపతి ఎస్వీ ఆర్ట్ కళాశాలలో పూర్తయింది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజ్‌లో ఎంఏ ఇంగ్లిష్, డిప్లొమో ఇన్ మాస్‌కమ్యూనికేషన్ చేసి విమర్శలకు నోళ్లు మూయించాడు. ఎంఏ మాస్ కమ్యూనికేషన్, ఎంఫిల్, పీహెచ్‌డీలతో పాటు డిప్లొమో ఇన్ కమ్యూనికేట్ ఇంగ్లిష్, డిప్లొమో ఇన్ హ్యూమన్ రైట్స్, డిప్లొమో ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పూర్తిచేసి సరస్వతీ పుత్రుడు అనిపించుకున్నారు. యూజీసీ ప్రతి ఏటా నిర్వహించే మాస్ కమ్యూనికేషన్ పరీక్షను మొదటి ప్రయత్నంలోనే పూర్తి చేసి ఏఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోగా దేశంలోనే ఆ ఖ్యాతి దక్కించుకున్న తొలి అంధ విద్యార్థిగా నిలవడం విశేషం. పది మందికి సహాయపడాలని.. చదువుకుంటున్న రోజుల్లోనే తనలాంటి వారికి అండగా నిలవాలని నిశ్చయించుకున్నాడు. ఈ కోవలోనే తల్లిదండ్రులు.. సోదరుడు నారాయణరెడ్డి, వదిన లీలావతి సహకారంతో నెల్లూరులోని బాలాజీనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కొందరు అంధులను చేరదీశాడు. వాళ్లకు చదువు చెప్పిస్తూ బాగోగులు చూసుకున్నాడు. ఇదంతా ఉద్యోగం రాకముందు వచ్చిన ఫెలోషిప్ డబ్బుతోనే సాధించారు. ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగం వరించడంతో ఆయన చేరదీసిన అంధుల సంఖ్య కూడా పెరిగింది. అలా ఓ అంధుల పాఠశాలను ఏర్పాటు చేసి సుమారు 40 మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. నిద్రలేని రాత్రులెన్నో.. ఉద్యోగం వచ్చే వరకు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. ఇంట్లో, బయటా వీడేం చదువుతాడు.. దండగన్న వాళ్లే. ఎంతో కుంగిపోయేవాన్ని. విద్యలో రాణిస్తున్న కొద్దీ నా పట్ల అందరి దృక్పథంలోనూ మార్పు వచ్చింది. ప్రోత్సాహం లభించింది. జీవితంలో స్థిరపడాలనే దృఢ సంకల్పం నన్ను విజయతీరాలకు చేర్చింది. ఇప్పుడు నేను మరికొందరికి సహాయం చేసే స్థితిలో ఉండడం గర్వంగా ఉంది. అప్పటి కష్టాలను ఈ జీవితం మరిపిస్తోంది. – శివకుమార్‌రెడ్డి, ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్, నెల్లూరు రోడ్డు దాటేందుకే గంట.. నేను 2001లో హైదరాబాద్‌లో డిగ్రీ చదివే రోజుల్లో షాపింగ్‌కు వెళ్లా. అక్కడ రోడ్డు దాటేందుకు ఏ ఒక్కరూ సాయం చేయలేదు. సుమారు గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. అధిక శాతం కిందిస్థాయి ఉద్యోగులే.. చదువుతో పాటు చదరంగంలోనూ పట్టు సాధించే క్రమంలో ఇతర రాష్ట్రాల్లో పర్యటించా. మూడు పర్యాయాలు జాతీయ స్థాయిలో రాణించా. ఆయా రాష్ట్రాల్లో అంధులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా, పెద్ద కంపెనీలకు సీఈఓలుగా ఉండటాన్ని గమనించా. అయితే మన రాష్ట్రంలో అంధులు అధిక శాతం కిందిస్థాయి ఉద్యోగులుగానే ఉండిపోతున్నారు. .. ఈ రెండు ఘటనలు నాలో కసిపెంచాయి. ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు మంచి స్థాయికి చేరుకోవాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత నాలాంటి వాళ్లకు ఉన్నంతలో అండగా నిలవాలనుకున్నా. ఇలాంటి చీకటి జీవితాలకుశివకుమార్ దిక్సూచి ఆయన చలువతోనే.. శివన్న సహకారంతో 9వ తరగతి నుంచి బీకాం వరకు చదువుకున్నా. ఆయనను కలిశాక జీవితంపై నాలో పట్టుదల పెరిగింది. ఆ కసితోనే ఎల్ఐసీలో ఏఓగా(అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) ఉద్యోగం సాధించా. ఇప్పుడు నా జీతం రూ.80వేలు. నా కుటుంబానికి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నా. ఇదంతా ఆయన చలువే. – బి.సురేష్, గుడినరవ, ఉదయగిరి మండలం కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో.. నాకు ఐదేళ్ల వయసు నుంచి శివన్నే చదివిస్తున్నారు. ప్రస్తుతం బీకాం రెండో సంవత్సరం. మొదటి సంవత్సరంలో 9.3 గ్రేడ్ వచ్చింది. బాగా చదవి అన్నకు మంచి పేరు తీసుకొస్తా. కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. – యనమల జీవిత, ముత్యాలపాడు, చిల్లకూరు మండలం భుజం తట్టండి.. చూపు లేకపోవడం మా తప్పు కాదు. అంత మాత్రాన సమాజం మమ్మల్ని చులకనగా చూడటం సరికాదు. ఇలా చేయడం మమ్మల్ని ఎంతగానో కుంగదీస్తుంది. శివన్నలా భుజం తట్టి ప్రోత్సహిస్తే మేము కూడా అద్భుతాలు సృష్టిస్తాం. – ఎస్.తరుణ్, కొణిదెల, కర్నూల్ జిల్లా -
పేదరికంపై అలుపెరగని పోరాటం చేస్తున్న దివ్యాంగుడు
-
ఫింగర్ ప్రింట్స్ సమస్య.. తక్షణమే స్పందించిన గుంటూరు కలెక్టర్
గుంటూరు: దివ్యాంగుడి సమస్యపై గుంటూరు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు. ఫింగర్ ప్రింట్స్ అరిగిపోవడంతో పింఛన్ రాలేదని కేవీపీ కాలనీకి చెందిన దివ్యాంగుడు షేక్ బాజీ ‘ముఖ్యమంత్రి స్పందన సెల్’కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ వివేక్ యాదవ్ తక్షణమే స్పందించి.. దివ్యాంగుడికి పింఛన్‌తో పాటు ట్రైసైకిల్ అందించారు. కలెక్టర్ వివేక్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు జిల్లాలో 5లక్షల 73 వేల మందికి పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో రూ.133 కోట్లు ప్రతి నెల ఇస్తున్నామని తెలిపారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా 99 శాతం పెన్షన్లు ఒకే రోజు అందిస్తున్నామన్నారు. ఈకేవైసీ అప్డేట్ కాలేనివారిని గుర్తించి వారికి పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంకా ఎవరికైనా పింఛన్ రాకపోతే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. ఇవీ చదవండి: కామారెడ్డి వివాహిత కేసులో ట్విస్ట్.. ఏం జరిగిందో తెలిస్తే షాక్.. అడక్కుండానే పానీ పూరి తెచ్చిన భర్త.. కోపంతో ఊగిపోయిన భార్య.. -
3 నెలలుగా పింఛన్ లేదు.. బతికుండగానే చంపేశారు!
సాక్షి. జనగామ: అతనో దివ్యాంగుడు. ప్రభుత్వం నుంచి ప్రతినెలా రూ. 3,016 పింఛన్ తీసుకుంటున్నాడు. అయితే గత ఏప్రిల్ నుంచి ఆయనకు పింఛన్ రావడం లేదు. దీంతో ఈనెల 4న మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మెప్మా పీడీ హర్షవర్ధన్‌ను నిలదీశాడు. తన పేరును చనిపోయిన జాబితాలో చేర్చారని అధికారి చెప్పడంతో హతాశుడయ్యాడు. జనగామ జిల్లా కేంద్రంలోని 25వ వార్డు కృష్ణాకళామందిర్ ఏరియాకు చెందిన దివ్యాంగుడు కానుగ బాల్‌నర్సయ్య సర్వే సమయంలో ఇంటి దగ్గర లేకపోవడంతో, మెప్మా సిబ్బంది డోర్‌లాక్ అని రాసుకుని, ఆ తరువాత విచారణ చేపట్టకుండానే ఆయన పేరును చనిపోయిన జాబితాలోకి ఎక్కించారు. కాగా, ఈ విషయాన్ని బహిర్గతం చేయవద్దని బాల్‌నర్సయ్యను పీడీ హర్షవర్ధన్ కోరినట్టు తెలిసింది.దీనిపై పీడీ హర్షవర్ధన్‌ను వివరణ కోరగా, ఇంటింటి సర్వేలో డోర్‌లాక్ ఉండడంతోనే బాల్‌నర్సయ్య చనిపోయినట్లుగా తమ సిబ్బంది నమోదు చేసుకున్నారని చెప్పారు. ఆర్పీకి మెమో ఇచ్చి ఘటనపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. -
జాబ్ రావట్లేదని.. పెళ్లి రద్దయ్యిందని..
కాజీపేట అర్బన్: అంగవైకల్యాన్ని జయించి ఉన్నత విద్యనభ్యసించినా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో జీవితంలో ఓడిపోయిన ఓ నిరుద్యోగ దివ్యాంగుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఆదివారం హన్మకొండ సుబేదారిలోని వికలాంగుల హాస్టల్లో చోటుచేసుకుంది. తోటి దివ్యాంగులు, సుబేదారి పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం రామంజపూర్ గ్రామానికి చెందిన రాగుల లింగయ్య రెండో కుమారుడు రామ్మోహన్(34) దివ్యాంగుడు. పీజీ పూర్తి చేసి సుబేదారిలోని వికలాంగుల హాస్టల్లో ఉంటూ ఉద్యోగ, స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకుంటున్నాడు. పీజీ చదివినా ఉద్యోగం రాక, ఉపాధి దొరక్క, ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలు సైతం లభించకపోవడంతో ఆదివారం సీలింగ్ ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించి తోటి దివ్యాంగులు కాపాడేం దుకు ప్రయత్నించి ఫలితం లేకుండా పోయింది. వికలాంగులకు కొత్త చట్టాన్ని అమలు చేయని ప్రభుత్వం.. వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేయడంలో అలసత్వం వహించడంతోనే రామ్మోహన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తోటి దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాల్లో ఒకే ఒక బ్యాగ్‌లాగ్ పోస్టులను ప్రకటించి ఇంత వరకు భర్తీ చేయలేదన్నారు. గతంలో ఉద్యోగావకాశాల్లో 3 శాతం ఉన్న రిజర్వేషన్‌ను 4 శాతం, సంక్షేమ పథకాల్లో 5 శాతం అందిస్తూ కొత్త చట్టాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అమలుకు మాత్రం ముందుకు రాలేదని తోటి దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగావకాశం కోసం, సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజం లేకపోవడంతోనే రామ్మోహన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు వాపోయారు. ఉద్యోగం లేదని.. వివాహం రద్దు.. ఏడాదిన్నర క్రితం రామ్మోహన్‌కు ఓ అమ్మాయితో తల్లిదండ్రులు ఎంగేజ్మెంట్ ఘనంగా నిర్వహించారు. ఎంగేజ్మెంట్ పూర్తయిన చాలా రోజుల వరకు ఉద్యోగావకాశం, ఉపాధి లభించకపోవడంతో నిరుద్యోగికి తమ కుమార్తెను ఇవ్వబోమని వివాహాన్ని సదరు అమ్మాయి తల్లిదండ్రులు రద్దు చేసుకున్నారని, తన వివాహం రద్దు కావడానికి నిరుద్యోగమే కారణమని తోటి దివ్యాంగులతో ఆవేదనను పంచుకుంటు ఆదివారం ఆత్మహత్య చేసుకుంటానని పలువురితో తెలుపగా ‘అన్న జోక్ చేయకు’ అంటు వారు తమ పనిలో ఉండిపోయారు. కన్నీరు మున్నీరుగా రోదించిన సోదరులు.. హాస్టల్లో విగత జీవిగా పడి ఉన్న తమ సోదరుడు రామ్మోహన్‌ను చూసి సోదరులు ప్రభాకర్ ,నరేష్ కన్నీరు మున్నీరుగా రోదించారు. దీంతో హాస్టల్లోని దివ్యాంగులు మాకు మనోధైర్యాన్ని ఇచ్చే అన్న నువ్వే ఇలా ధైర్యం కోల్పోయా అని రోదించారు. ఈ సంఘటనతో వికలాంగుల హాస్టల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. సంఘటన స్థలానికి సుబేదారి ఎస్సై నవీన్‌కుమార్ చేరుకుని ఘటనను పరిశీలించి మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వం భరోసా కల్పించకపోవడంతోనే.. ఉన్నత విద్యనభ్యసించిన నిరుద్యోగ దివ్యాంగులకు ప్రభుత్వం భరోసా కల్పించకపోవడంతోనే రాగుల రామ్మోహన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలు అందించాలి. బిల్ల మహేదర్, దివ్యాంగ, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ప్రభుత్వ హత్య... రాగుల రామ్మోహన్‌ది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య. బ్యాగ్లాగ్పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఉద్యోగం రాదనే మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వికలాంగుల శాఖ 32 సంవత్సరాలుగా ప్రత్యేక శాఖగా కొనసాగగా తెలంగాణ ప్రభుత్వం స్త్రీ,శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయడం దారుణం. వీరయ్య, టీపీసీసీ వికలాంగుల సెల్ రాష్ట్ర చైర్మన్ -
దివ్యాంగుడికి పింఛను పంపిణీ
ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు బంధువుల ఇంటివద్ద కోలుకుంటున్న బాధితుడు నల్లూరు(కపిలేశ్వరపురం) : మండలంలోని నల్లూరుకు చెందిన గుత్తుల వీరవెంకట సత్యనారాయణ అలియాస్ కొండయ్య కుటుంబ సభ్యులకు అధికారులు శుక్రవారం పింఛను పంపిణీ చేశారు. పింఛను రాకపోవడంతో మనస్తాపానికి గురైన కొండయ్య గురువారం బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విషయం పాఠకులకు తెలిసిందే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొండయ్య ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ప్రస్తుతం బంధువుల ఇంటి వద్ద కోలుకుంటున్నాడు. కాగా వైఎస్సార్ సీపీ నాయకులు కుడుపూడి సత్యనారాయణ (చిన్నా), సవిలే శరత్, నరాల వెంకట్రావు కొండయ్య నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అఘాయిత్యంతో పింఛను పంపిణీకి సంబంధం లేదు ఇంటి వద్ద ఇతర కారణాలతో అఘాయిత్యానికి పాల్పడి అందుకు పింఛను ఇవ్వకపోవడమేననడంతో çసంబంధం లేదని ఎంపీడీఓ అబ్రహం లింక¯ŒS శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వేలిముద్రలు, ఐరిష్ సమస్యలు తలెత్తడంతో సత్యనారాయణకు ఏడాది కాలంగా కార్యదర్శి వేలిముద్రతో పింఛను ఇస్తున్నామని, ఆధార్‌ను మీ సేవా కేంద్రంలో అప్డేట్ చేసుకోమని చెప్తున్నా లబ్ధిదారుడుస్పందించలేదన్నారు. అందువల్లే సెప్టెంబరు నుంచి పింఛన్ నిలిచిపోయిందని, ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో కుటుంబ సభ్యులకు పింఛను అందజేశామని ఎంపీడీఓ తెలిపారు. కాగా ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు ఎస్సై పెద్దిరాజు ఆత్మహత్యాయత్నం నేరం మీద కొండయ్యపై కేసు నమోదు చేశారు.