చదువు చెప్పిస్తూ.. భరోసా కల్పిస్తూ .. అంధుల జీవితాల్లో ‘వెలుగు’ రేఖ | Tirupati: Divyang Bachala Shivakumar Reddy Inspirational Journey | Sakshi
Sakshi News home page

చదువు చెప్పిస్తూ.. భరోసా కల్పిస్తూ .. అంధుల జీవితాల్లో ‘వెలుగు’ రేఖ 

Published Sat, Jul 30 2022 4:05 PM | Last Updated on Sat, Jul 30 2022 4:25 PM

Tirupati: Divyang Bachala Shivakumar Reddy Inspirational Journey - Sakshi

ఈ పోటీ ప్రపంచంలో అడుగు తీసి అడుగు వేయాలన్నా ఏదో తెలియని భయం వెనక్కు లాగుతూనే ఉంటుంది. ఆర్థిక స్థోమత.. కుటుంబ నేపథ్యం.. పరిస్థితులు.. ఎక్కడో ఒక చోట ఏదో ఒక అవాంతరం ఉండనే ఉంటుంది. అన్నీ అవయవాలు బాగున్న వాళ్ల పరిస్థితే విజయం, అపజయం మధ్య ఊగిసలాడుతుంటుంది. అలాంటిది అసలు కళ్లే కనిపించకపోతే. అందునా ఎవరి ప్రోత్సాహం లేకపోతే.. లోకులు కాకులైతే.. ఆ జీవితం ‘అంధకారమే’. అదే చీకటి సంధించిన ప్రశ్నలకు సమాధానంగా వేసిన అడుగు.. ఓ అంధుని బంగారు భవితకు బాటగా మారింది. అలాంటి ఎన్నో జీవితాల్లో ‘వెలుగు’లు నింపుతోంది. 


గూడూరు(తిరుపతి జిల్లా):
ఓజిలి మండలం, కురుగొండకు చెందిన బచ్చల సుబ్బారెడ్డి, సుదర్శనమ్మల రెండో సంతానం శివకుమార్‌రెడ్డి. ఐదేళ్ల వయసులోనే చూపు మందగించింది. క్రమంగా అంధత్వానికి దారితీసింది. విధి ఆ చిన్నారికి చూపు లేకుండా చేసిందే కానీ.. ఆ వయస్సులోనే విద్యపై చిగురించిన ఆసక్తిని తుడిచేయలేకపోయింది. కళ్లే కనిపించని పిల్లాడికి చదువు ఎందుకన్నారు.. ఇంట్లో వాళ్ల మెదళ్లలోనూ ఆ విషబీజం నాటుకుంది. ఆ పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం అండగా నిలిచింది. చదువుకుంటేనే తాను సమాజంలో నిలదొక్కుకోగలననే విషయం అర్థమైంది. అలా మొక్కవోని దీక్ష తోడు కావడంతో పదో తరగతి వరకు వెంకటగిరిలో.. ఆ తర్వాత ఇంటర్మీడియెట్, డిగ్రీ తిరుపతి ఎస్వీ ఆర్ట్‌ కళాశాలలో పూర్తయింది. 

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌లో ఎంఏ ఇంగ్లిష్, డిప్లొమో ఇన్‌ మాస్‌కమ్యూనికేషన్‌ చేసి విమర్శలకు నోళ్లు మూయించాడు. ఎంఏ మాస్‌ కమ్యూనికేషన్, ఎంఫిల్, పీహెచ్‌డీలతో పాటు డిప్లొమో ఇన్‌ కమ్యూనికేట్‌ ఇంగ్లిష్, డిప్లొమో ఇన్‌ హ్యూమన్‌ రైట్స్, డిప్లొమో ఇన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ను సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో పూర్తిచేసి సరస్వతీ పుత్రుడు అనిపించుకున్నారు. యూజీసీ ప్రతి ఏటా నిర్వహించే మాస్‌ కమ్యూనికేషన్‌ పరీక్షను మొదటి ప్రయత్నంలోనే పూర్తి చేసి ఏఆర్‌ఎఫ్‌ జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోగా దేశంలోనే ఆ ఖ్యాతి దక్కించుకున్న తొలి అంధ విద్యార్థిగా నిలవడం విశేషం. 


పది మందికి సహాయపడాలని.. 

చదువుకుంటున్న రోజుల్లోనే తనలాంటి వారికి అండగా నిలవాలని నిశ్చయించుకున్నాడు. ఈ కోవలోనే తల్లిదండ్రులు.. సోదరుడు నారాయణరెడ్డి, వదిన లీలావతి సహకారంతో నెల్లూరులోని బాలాజీనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కొందరు అంధులను చేరదీశాడు. వాళ్లకు చదువు చెప్పిస్తూ బాగోగులు చూసుకున్నాడు. ఇదంతా ఉద్యోగం రాకముందు వచ్చిన ఫెలోషిప్‌ డబ్బుతోనే సాధించారు. ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగం వరించడంతో ఆయన చేరదీసిన అంధుల సంఖ్య కూడా పెరిగింది. అలా ఓ అంధుల పాఠశాలను ఏర్పాటు చేసి సుమారు 40 మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు.


నిద్రలేని రాత్రులెన్నో.. 

ఉద్యోగం వచ్చే వరకు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. ఇంట్లో, బయటా వీడేం చదువుతాడు.. దండగన్న వాళ్లే. ఎంతో కుంగిపోయేవాన్ని. విద్యలో రాణిస్తున్న కొద్దీ నా పట్ల అందరి దృక్పథంలోనూ మార్పు వచ్చింది. ప్రోత్సాహం లభించింది. జీవితంలో స్థిరపడాలనే దృఢ సంకల్పం నన్ను విజయతీరాలకు చేర్చింది. ఇప్పుడు నేను మరికొందరికి సహాయం చేసే స్థితిలో ఉండడం గర్వంగా ఉంది. అప్పటి కష్టాలను ఈ జీవితం మరిపిస్తోంది. 
– శివకుమార్‌రెడ్డి, ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజర్, నెల్లూరు 

రోడ్డు దాటేందుకే గంట.. 
నేను 2001లో హైదరాబాద్‌లో డిగ్రీ చదివే రోజుల్లో షాపింగ్‌కు వెళ్లా. అక్కడ రోడ్డు దాటేందుకు ఏ ఒక్కరూ సాయం చేయలేదు. సుమారు గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. 

అధిక శాతం కిందిస్థాయి ఉద్యోగులే.. 
చదువుతో పాటు చదరంగంలోనూ పట్టు సాధించే క్రమంలో ఇతర రాష్ట్రాల్లో పర్యటించా. మూడు పర్యాయాలు జాతీయ స్థాయిలో రాణించా. ఆయా రాష్ట్రాల్లో అంధులు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా, పెద్ద కంపెనీలకు సీఈఓలుగా ఉండటాన్ని గమనించా. అయితే మన రాష్ట్రంలో అంధులు అధిక శాతం కిందిస్థాయి ఉద్యోగులుగానే ఉండిపోతున్నారు. 
.. ఈ రెండు ఘటనలు నాలో కసిపెంచాయి. ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు మంచి స్థాయికి చేరుకోవాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత నాలాంటి వాళ్లకు ఉన్నంతలో అండగా నిలవాలనుకున్నా. 

ఇలాంటి చీకటి జీవితాలకుశివకుమార్‌ దిక్సూచి 


ఆయన చలువతోనే.. 

శివన్న సహకారంతో 9వ తరగతి నుంచి బీకాం వరకు చదువుకున్నా. ఆయనను కలిశాక జీవితంపై నాలో పట్టుదల పెరిగింది. ఆ కసితోనే ఎల్‌ఐసీలో ఏఓగా(అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌) ఉద్యోగం సాధించా. ఇప్పుడు నా జీతం రూ.80వేలు. నా కుటుంబానికి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నా. ఇదంతా ఆయన చలువే. 
– బి.సురేష్, గుడినరవ, ఉదయగిరి మండలం


కలెక్టర్‌ కావాలన్న లక్ష్యంతో.. 

నాకు ఐదేళ్ల వయసు నుంచి శివన్నే చదివిస్తున్నారు. ప్రస్తుతం బీకాం రెండో సంవత్సరం. మొదటి సంవత్సరంలో 9.3 గ్రేడ్‌ వచ్చింది. బాగా చదవి అన్నకు మంచి పేరు తీసుకొస్తా. కలెక్టర్‌ కావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. 
– యనమల జీవిత, ముత్యాలపాడు, చిల్లకూరు మండలం  


భుజం తట్టండి.. 

చూపు లేకపోవడం మా తప్పు కాదు. అంత మాత్రాన సమాజం మమ్మల్ని చులకనగా చూడటం సరికాదు. ఇలా చేయడం మమ్మల్ని ఎంతగానో కుంగదీస్తుంది. శివన్నలా భుజం తట్టి ప్రోత్సహిస్తే మేము కూడా అద్భుతాలు సృష్టిస్తాం.  
– ఎస్‌.తరుణ్, కొణిదెల, కర్నూల్‌ జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement