రామ్మోహన్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు
కాజీపేట అర్బన్: అంగవైకల్యాన్ని జయించి ఉన్నత విద్యనభ్యసించినా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో జీవితంలో ఓడిపోయిన ఓ నిరుద్యోగ దివ్యాంగుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఆదివారం హన్మకొండ సుబేదారిలోని వికలాంగుల హాస్టల్‌లో చోటుచేసుకుంది. తోటి దివ్యాంగులు, సుబేదారి పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం రామంజపూర్ గ్రామానికి చెందిన రాగుల లింగయ్య రెండో కుమారుడు రామ్మోహన్(34) దివ్యాంగుడు. పీజీ పూర్తి చేసి సుబేదారిలోని వికలాంగుల హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగ, స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకుంటున్నాడు. పీజీ చదివినా ఉద్యోగం రాక, ఉపాధి దొరక్క, ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలు సైతం లభించకపోవడంతో ఆదివారం సీలింగ్ ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించి తోటి దివ్యాంగులు కాపాడేం దుకు ప్రయత్నించి ఫలితం లేకుండా పోయింది.
వికలాంగులకు కొత్త చట్టాన్ని అమలు చేయని ప్రభుత్వం..
వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేయడంలో అలసత్వం వహించడంతోనే రామ్మోహన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తోటి దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాల్లో ఒకే ఒక బ్యాగ్‌లాగ్ పోస్టులను ప్రకటించి ఇంత వరకు భర్తీ చేయలేదన్నారు. గతంలో ఉద్యోగావకాశాల్లో 3 శాతం ఉన్న రిజర్వేషన్‌ను 4 శాతం, సంక్షేమ పథకాల్లో 5 శాతం అందిస్తూ కొత్త చట్టాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అమలుకు మాత్రం ముందుకు రాలేదని తోటి దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగావకాశం కోసం, సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజం లేకపోవడంతోనే రామ్మోహన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు వాపోయారు.
ఉద్యోగం లేదని.. వివాహం రద్దు..
ఏడాదిన్నర క్రితం రామ్మోహన్‌కు ఓ అమ్మాయితో తల్లిదండ్రులు ఎంగేజ్‌మెంట్ ఘనంగా నిర్వహించారు. ఎంగేజ్‌మెంట్ పూర్తయిన చాలా రోజుల వరకు ఉద్యోగావకాశం, ఉపాధి లభించకపోవడంతో నిరుద్యోగికి తమ కుమార్తెను ఇవ్వబోమని వివాహాన్ని సదరు అమ్మాయి తల్లిదండ్రులు రద్దు చేసుకున్నారని, తన వివాహం రద్దు కావడానికి నిరుద్యోగమే కారణమని తోటి దివ్యాంగులతో ఆవేదనను పంచుకుంటు ఆదివారం ఆత్మహత్య చేసుకుంటానని పలువురితో తెలుపగా ‘అన్న జోక్ చేయకు’ అంటు వారు తమ పనిలో ఉండిపోయారు.
కన్నీరు మున్నీరుగా రోదించిన సోదరులు..
హాస్టల్‌లో విగత జీవిగా పడి ఉన్న తమ సోదరుడు రామ్మోహన్‌ను చూసి సోదరులు ప్రభాకర్ ,నరేష్ కన్నీరు మున్నీరుగా రోదించారు. దీంతో హాస్టల్‌లోని దివ్యాంగులు మాకు మనోధైర్యాన్ని ఇచ్చే అన్న నువ్వే ఇలా ధైర్యం కోల్పోయా అని రోదించారు. ఈ సంఘటనతో వికలాంగుల హాస్టల్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. సంఘటన స్థలానికి సుబేదారి ఎస్సై నవీన్‌కుమార్ చేరుకుని ఘటనను పరిశీలించి మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ప్రభుత్వం భరోసా కల్పించకపోవడంతోనే..
ఉన్నత విద్యనభ్యసించిన నిరుద్యోగ దివ్యాంగులకు ప్రభుత్వం భరోసా కల్పించకపోవడంతోనే రాగుల రామ్మోహన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలు అందించాలి.
బిల్ల మహేదర్, దివ్యాంగ,
ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు
ప్రభుత్వ హత్య...
రాగుల రామ్మోహన్‌ది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య. బ్యాగ్‌లాగ్‌పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఉద్యోగం రాదనే మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వికలాంగుల శాఖ 32 సంవత్సరాలుగా ప్రత్యేక శాఖగా కొనసాగగా తెలంగాణ ప్రభుత్వం స్త్రీ,శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయడం దారుణం.
వీరయ్య,
టీపీసీసీ వికలాంగుల సెల్ రాష్ట్ర చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment