క్రైమ్: అతనొక దివ్యాంగుడు. వైకల్యాన్ని లెక్కచేయకుండా.. బాగా చదువుకున్నాడు. ఎవరి మీదా ఆధారపడకూడదని ఓ చిన్న ఉద్యోగం సంపాదించుకుని.. జీవితంలో ముందుకు వెళ్తున్నాడు. అయితే వయసు మూడు పదులు దాటడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదే అతని పాలిట మరణ శాసనం అయ్యింది.
వివాహం చేసుకోవాలని ఉందని చెప్పినందుకు ఓ దివ్యాంగుడిని.. సవతి తల్లి, అతని తండ్రి సాయంతోనే కడతేర్చింది. ఒడిషా నయాగఢ్ జిల్లా పథరాపుంజ గ్రామం దసపల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం చోటు చేసుకుంది. బాధితుడు విజయ్ ప్రధాన్(35).. తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. దీంతో అతని తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. ఆమెకు సంతానం ఉంది.
తన పిల్లలను బాగా చూసుకుంటూ.. విజయ్‌ను రాచిరంపాన పెడుతూ వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. అయినా విజయ్ మాత్రం పట్టించుకోకుండా బాగా చదువుకుని.. స్థానికంగా ఓ చిన్నకంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో వివాహం చేసుకోమని అతని మేనత్త, మేనమామలు సూచించారు. వాళ్ల కోరిక ప్రకారం స్థిరపడాలనుకున్నాడు. అయితే.. పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం విజయ్ లాక్కెళ్లిపోతాడేమోనని ఆ సవతి తల్లి భయపడింది. అతని వివాహానికి ససేమీరా చెప్పింది.
అయినా విజయ్ మేనత్త సంబంధాలు చూడసాగింది. ఇది ఆ సవతి తల్లికి కోపం తెప్పించింది. శనివారం ఈ విషయంపై ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. ఈ క్రమంలో సవతి తల్లి, విజయ్ తండ్రి, వాళ్ల పిల్లల సాయంతో.. విజయ్‌ను కర్రలతో కొట్టి చంపారు. ఈ మేరకు విజయ్ బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. వాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment