‘‘బరిలో దూకండి. నన్ను ఓడించండి. ఆ దమ్మున్న మగవాడినే నేను పెళ్లి చేసుకుంటా’’.. పురుషాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఓ మహిళ విసిరిన సవాల్ ఇది. సాధారణ మహిళ అయితే చర్చకు అంతగా ఆస్కారం ఉండేది కాదు. కానీ, ఆ సవాల్ విసిరింది హమీదా బాను. ఇంతకీ ఇవాళ గూగుల్ హోం పేజీని గమనించారా?.. అందులో ఉంది ఆమెనే.
1940-55 మధ్య.. కుస్తీ పోటీల్లో వందల మందిని ఓడించానని తనకు తానుగా ప్రకటించుకుంది హమీదా బాను. కళ్లారా ఆమె పాల్గొన్న పోటీలు చూసి అప్పటి మీడియా పొగడ్తలతో ఆమెను ఆకాశానికి ఎత్తేసింది. భారతదేశంలో తొలి మల్ల యోధురాలిగా హమిదా బాను పేరు చరిత్రకెక్కింది. ఇప్పుడు.. డూడుల్ రూపంలో ఆ యోధురాలికి గౌరవం ఇచ్చింది గూగుల్.
సంప్రదాయ కుటుంబంలో పుట్టి.. హేతుబద్ధమైన పెద్దల్ని ఎదురించి.. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది హమీదా. ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ ఆమె స్వస్థలం. అక్కడి నుంచి ఆమె అలీఘడ్ వలస వెళ్లింది. అక్కడే సలాం పహిల్వాన్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర కుస్తీ శిక్షణ తీసుకుంటూ పలు పోటీల్లో పాల్గొందామె. అయితే 1954 ఫిబ్రవరిలో ఆమె ఇచ్చిన ఒక బహిరంగ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను ఓడించిన వాళ్లను వివాహం చేసుకుంటానని ప్రకటించి అటు ప్రజలు, ఇటు మీడియా దృష్టిని ఆకర్షించింది.
ఛాలెంజ్‌లో భాగంగా.. పంజాబ్‌లో ఒకరిని, కోల్‌కతాలో ఒకరిని బాను ఓడించింది. ఆ తర్వాత గుజరాత్ బరోడాకు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. అప్పటికి ఆమె వయసు 34 ఏళ్లు. ఆ సవాల్ విసిరిన నాటికి ఆమె 300 మ్యాచ్‌లు పూర్తి చేసుకుందట. అయితే ఆమెతో తలపడాల్సిన చోటే గామా పహిల్వాన్ ఆఖరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆమె బాబా పహిల్వాన్‌తో తలపడి.. కేవలం నిమిషం వ్యవధిలోనే ఆమె నెగ్గింది.
బాను పాపులారిటీ ఏ స్థాయికి చేరిందో.. 1944లో బాంబే క్రానికల్ రాసిన ఒక కథనం చూస్తే తెలుస్తుంది. బాంబేలో ఆమె పాల్గొన్న ఒక మ్యాచ్ చూసేందుకు 20 వేల మంది ప్రేక్షకులు వచ్చారట. అయితే ప్రత్యర్థి గూంగా పహిల్వాన్ అసంబంద్ధమైన డిమాండ్లతో ఆ మ్యాచ్ జరగకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన ప్రేక్షకులు స్టేడియంలో బీభత్సం సృష్టించారట.
అమెజాన్ ఆఫ్ అలీగఢ్.. ముద్దుగా హమీదా బానుకు అప్పటి మీడియా పెట్టుకున్నపేరు. ఐదడుగల మూడు అంగుళాలు, 108 కేజీల బరువుతో.. రోజుకు ఐదున్నర లీటర్ల పాలు, రెండు లీటర్ల పండ్ల రసేఆలు, కేజీ మటన్, అరకేజీ బటర్, ఆరు గుడ్లు, రెండు ప్లేట్ల బిర్యానీ.. ఇలా ఆమె డైట్ గురించి కూడా అప్పట్లో పేపర్లు కథనాలు రాసేవి.
హమిదా బాను కెరీర్ సగానికి పైగా వివాదాలతోనే సాగింది. మగవాళ్లతో ఆమె తలపడడాన్ని పలువురు బహిరంగంగానే వ్యతిరేకించారు. మొరార్జీ దేశాయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పోటీలపై నిషేధం విధించారు. అందుకు ఆమె బహిరంగంగానే ఆయనపై విమర్శలు గుప్పించింది. అలాగే.. ఆమె పాల్గొన్న పోటీల్లోనూ ప్రేక్షకుల నుంచి దాడులు తప్పలేదట. 1954 దాకా దేశ, విదేశీ రెజ్లర్లతో ఆమె తలపడింది. అయితే అదే ఏడాది విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినా.. ఆర్థిక స్తోమత లేకపోవడం, స్పానర్లు ఎవరూ ముందుకు రాలేదన్న కారణాలతో ఆమె ఆగిపోయింది. అయితే ఆ ఆగిపోవడం.. బరికి శాశ్వతంగా హమిదా బానును దూరం చేసింది కూడా.
1987లో మహేశ్వర్ దయాల్ అనే రచయిత ఆమె జీవితం మీద రాసిన పుస్తకంలో సంచలన విషయాల్ని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లో ఆమె కుస్తీ పోటీల్లో పాల్గొందని, మగ పోటీదారులతో మాత్రమే ఆమె తలపడేదని, అయితే కొన్ని చోట్ల ఆమె రహస్య ఒప్పందాలు కూడా చేసుకునేదని ఆయన రాశారు.
రెజ్లింగ్ కెరీర్ మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకుల నడుమ సాగింది. కోచ్ సలాం పహిల్వాన్‌తో కలిసి అప్పటిదాకా ప్రొఫెషనల్ రిలేషన్ సాగించిన ఆమె.. ఆ తర్వాత ఆయనతో సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే ఆమెను విదేశీ పోటీలకు వెళ్లకుండా సలామే అడ్డుకున్నాడనన్న ఆరోపణ ఒకటి ఉంది. ఇంకోవైపు ఉత్తర భారతం నలుమూలల పోటీల్లో పాల్గొన్న హమిదాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ముంబై కల్యాణ్ ప్రాంతంలో ఉంటూ.. సలాంతో కలిసి పాల వ్యాపారం మొదలుపెట్టింది.
సలాం కూతురు సహారా, బానును పినమ్మగా చెబుతుంటుంది. అయితే సలాం ఆమెను శారీరకంగానూ ఎంతో వేధించేవాడని బాను మనవడు ఫిరోజ్ షేక్(ఆమె దత్తపుత్రుడి కొడుకు) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యూరప్‌కు వెళ్లకుండా బానును నిలువరించిన సలాం.. ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని, ఈ క్రమంలోనే ఆమె కాళ్లు, చేతులు విరిగియాని ఆరోపించారాయన. కొన్నాళ్లకు సలాం, బానులు విడిపోయారు. సలాం కల్యాణ్‌లోనే ఉంటూ పాల వ్యాపారం కొనసాగించింది. డబ్బు సరిపోని సమయంలో పిండి వంటలు చేసి రోడ్ల మీద అమ్ముకునేది. అలా మల్లు యోధురాలిగా పేరున్న హమీదా బాను.. చివరి రోజులు మాత్రం కష్టంగానే గడిచాయని పలు కథనాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment