శకుంతలాదేవికి గూగుల్ నివాళులు | google honours human computer Shakuntala Devi | Sakshi
Sakshi News home page

శకుంతలాదేవికి గూగుల్ నివాళులు

Published Mon, Nov 4 2013 11:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM

శకుంతలాదేవికి గూగుల్ నివాళులు

శకుంతలాదేవికి గూగుల్ నివాళులు

మానవ కంప్యూటర్.. గణిత మేధావి శకుంతలాదేవి 84వ జయంతి సందర్భంగా గూగుల్ తన డూడుల్ తో ఆమెకు ఘనంగా నివాళులు అర్పించింది. కాలుక్యులేటర్లోని డిజిటల్ అంకెల రూపంలో గూగుల్ అనే అక్షరాలను రూపొందించి, పక్కనే ఎస్ డి అనే రెండు అక్షరాలు, శకుంతలా దేవి బొమ్మను ఉంచింది.

లెక్కల్లో తిరుగులేని శకుంతలా దేవి పలుమార్లు అత్యంత వేగవంతమైన కంప్యూటర్లను సైతం చిటికెలో ఓడించి భారతీయుల గణిత మేధస్సును ప్రపంచానికి చాటి చెప్పారు. ఇదే అంశంపై ఆమె 1982లో గిన్నెస్ బుక్ రికార్డును కూడా సాధించారు. చిన్నతనంలో ఇంకా స్కూలుకు వెళ్లకముందే అంకెలతో ఆమె చేస్తున్న మేజిక్.. సర్కస్ లో పనిచేసే ఆమె తండ్రి కంట పడింది. అప్పటికి శకుంతలాదేవి వయస్సు మూడేళ్లే!! అప్పటినుంచి గణితంలో తిరుగులేని ప్రతిభను కనబరుస్తూ ప్రపంచప్రఖ్యాతి పొందారామె.

1977లో అమెరికాలో ఓ కంప్యూటర్ తో శకుంతలా దేవికి పోటీ పెట్టారు. 188132517 అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టగా, ఆమె కంప్యూటర్ ను ఓడించేశారు. ఇక 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు. 76,86,36,97,74,870 అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలా దేవిని ప్రశ్నించింది.

దానికి ఆమె కేవలం 28 సెకన్లలో సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం.. 18,947,668,177,995,426,462,773,730. ఆ దెబ్బకు గిన్నెస్ రికార్డు ఆమె పాదాక్రాంతమైంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సెన్ స్వయంగా శకుంతలా దేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యారు.

ఇంత ప్రతిభావంతురాలైన శకుంతలాదేవి.. తన 83వ ఏట 2013 ఏప్రిల్ నెలలో గుండె, మూత్రపిండాల సమస్యలతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆమె ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథెబ్లిట్ లాంటి పుస్తకాలు రాశారు.

ఆరేళ్ల వయసులో తొలిసారి శకుంతలా దేవి యూనివర్సిటీ ఆఫ్ మైసూరులో తన గణిత ప్రతిభను బహిరంగంగా ప్రదర్శించారు.
రెండేళ్ల తర్వాత.. అంటే ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై యూనివర్సిటీలో ఆమె ప్రదర్శనతో శకుంతలాదేవిని బాలమేధావిగా గుర్తించారు.
గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పేవారు.
1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఎంతో కేవలం 50 సెకండ్లలో చెప్పేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement