అర్థవంతమైన జీవితం | sakshi interview Shakunthaladevi | Sakshi
Sakshi News home page

అర్థవంతమైన జీవితం

Published Wed, Nov 8 2023 1:45 AM | Last Updated on Wed, Nov 8 2023 6:00 AM

sakshi interview Shakunthaladevi - Sakshi

‘ఆసక్తి ఉంటే అనంత విశ్వాన్ని మధించవచ్చు’ అనడానికి ప్రతీక శకుంతలాదేవి. అరవై దాటిన తర్వాత యూ ట్యూబర్‌గా ప్రపంచానికి పరిచయమయ్యారు. అంతకంటే ముందు ఆమె తనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ఆ ప్రపంచంలో సంగీతం, సాహిత్యం, మొక్కల పెంపకం ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్‌ మీడియా వేదికగా సృజనాత్మకతను పంచుతున్నారు.భర్త బాటలో తాను కూడా మరణానంతరం దేహాన్ని డొనేట్‌ చేశారు.

శకుంతలాదేవి అత్యంత సాధారణ గృహిణి. నలుగురు పిల్లల్ని పెంచుతూ ఆమె తన అభిరుచులను కొనసాగించారు. సాహిత్యాన్ని ఆస్వాదించకుండా ఉట్టిగా పాటలు వినడంలో ఏదో అసంతృప్తి. అందుకే హిందీ పాటల సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి హిందీ– తెలుగు డిక్షనరీలో అర్థాలు వెతుక్కున్నారు. స్మార్ట్‌ఫోన్, సోషల్‌ మీడియాలను ఉబుసుపోని పోస్టులకు పరిమితం చేయలేదామె. సాంకేతిక పాఠాలను స్మార్ట్‌ఫోన్ తోనే నేర్చుకున్నారు.

వీడియో రికార్డ్‌ చేయడం, ఎడిటింగ్, థంబ్‌నెయిల్‌ పెట్టడం, యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడం వరకు అవసరమైనవి అన్నీ సొంతంగా నేర్చుకున్నారు. తనకు తెలిసిన మంచి విషయాలను డిజిటల్‌ మీడియా వేదికగా ప్రపంచంతో పంచుకుంటున్నారు. ‘నన్ను ప్రపంచానికి తెలియచేసిన యూట్యూబ్‌కి తొలుత కృతజ్ఞతలు’ అంటూ తన వివరాలను ‘సాక్షి’తో పంచుకున్నారు స్వర్ణ శకుంతలాదేవి.

ఆధ్యాత్మికం నుంచి అభ్యుదయం వరకు ...
‘‘మాది తెనాలి దగ్గర మూల్పూరు గ్రామం. నాన్న వ్యవసాయంతోపాటు గుడిలో పూజలు చేసేవారు. ఏడుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు చదివింది నేనే. మా వారు బీఏఎమ్‌ఎస్‌ చదువుతూ ఉండడంతో ఆయన చదువు పూర్తయ్యే వరకు, నాకూ చదువుకునే అవకాశం వచ్చింది. ఫిఫ్త్‌ఫారమ్‌లో ఉండగా పెళ్లయింది. తర్వాత పుట్టింట్లోనే ఉండి ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేసి రిజల్ట్స్‌ వచ్చే నాటికి చీరాలలో అత్తగారింటిలో ఉన్నాను. అప్పట్లో ఆ చదువుకే సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ ఉద్యోగం ఇచ్చేవారు.

మా అత్తగారు ‘ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందిప్పుడు’ అనడంతో ఇంటికే పరిమితమయ్యాను. టీచర్‌ అయ్యే అవకాశం అలా చేజారింది. కానీ మా వారి నుంచి ప్రోత్సాహం మాత్రం ఎప్పుడూ ఉండేది. ఆయన ఆయుర్వేద వైద్యులుగా ఒంగోలు దగ్గర అమ్మనబ్రోలులో ప్రాక్టీస్‌ చేసేవారు. అక్కడే 35 ఏళ్ల పాటు ఉన్నాం. ఇద్దరు పిల్లలు పుట్టిన తరవాత వీణ నేర్చుకున్నాను.

ఆ తర్వాత మరో ఇద్దరు పిల్లలు. వాళ్లందరి ఆలనపాలన చూస్తూ నా అభిరుచులను కొనసాగించగలిగాను. ఆధ్యాత్మిక గ్రంథాల నుంచి రంగనాయకమ్మ రాసిన బలిపీఠం, కౌసల్యాదేవి– చక్రవాకం, రవీంద్రనాథుని గీతాంజలి, బాలగంగాధర తిలక్‌ అమృతం కురిసిన రాత్రి.. ఇలా అదీ ఇదీ అనే వర్గీకరణ లేకుండా చదివేదాన్ని. యద్దనపూడి, మాదిరెడ్డి, యండమూరి, శ్రీశ్రీ రచనలను, అబ్దుల్‌కలామ్‌ వంటి ప్రముఖుల జీవిత చరిత్రలను ఇష్టంగా చదివాను. కొన్ని రచనలు రేడియోలో నాటికలుగా వచ్చేవి. వాటి కోసం రేడియోకి అంకితమయ్యేదాన్ని. ఇలా సాగుతున్న జీవితంలో పిల్లలు నలుగురూ సెటిల్‌ అయిన తర్వాత మా వారుప్రాక్టీస్‌ చాలించారు. 2005లో చీరాలకు వచ్చాం. 

పెద్దబ్బాయి కొత్తదారిలో నడిపించాడు
మా పెద్దబ్బాయి నన్ను కొత్తగా ఆవిష్కరించాడు. తను మెకానికల్‌ ఇంజనీర్‌. తాను ఆసక్తి కొద్దీ జెమాలజీ కోర్సు చేశాడు. రత్నాల గురించిన కబుర్లు నాకు ఎక్కువ ఆసక్తినివ్వడంతో రత్నాలకు – రాళ్లకు మధ్య తేడాను గుర్తించడం నేర్పించాడు. ముత్యాలు, పగడాలతోపాటు రకరకాల బీడ్స్, జెమ్స్, సెమీ ప్రెషియస్‌ స్టోన్ ్సతో ఆర్నమెంట్‌ మేకింగ్‌ నేర్పించాడు.

జీవితాన్ని మనం ఎంత ఉత్సాహవంతంగా, రాగరంజితంగా మార్చుకున్నప్పటికీ ఏదో ఒక వెలితిని సృష్టించి ప్రశ్నార్థకంగా మన ముందు పెడుతుంది. నా అభిరుచులు మాత్రమే నాతో మిగిలాయి, వాటినిప్రోత్సహించిన మావారు మాకు దూరమయ్యారు. ఆయన కోరిక మేరకు దేహాన్ని వైద్యవిద్యార్థుల అధ్యయనం కోసం ఒంగోలులో మెడికల్‌ కాలేజ్‌కి ప్రదానం చేశాం. ఆయన బాటలో నేను కూడా మరణానంతరం నా దేహాన్ని డొనేట్‌ చేస్తూ సంతకం చేశాను. మనం జీవిస్తూ మరొకరికి ఉపయోగం కలిగించడమే జీవితానికి అసలైన అర్థం అని నమ్ముతాను. ఆయన జ్ఞాపకాలతో రోజులు సాగుతున్న సమయంలో కోవిడ్‌ ప్రపంచాన్ని కుదిపేసింది.

యూ ట్యూబ్‌ ఆత్మీయులనిచ్చింది
కోవిడ్‌ సమయంలో అగాధంలాంటి విరామం. ఆ విరామం ఎంత కాలమో కూడా తెలియదు. యూ ట్యూబ్‌ చానెల్స్‌ చూస్తూ, మా వారు సుబ్రహ్యణ్య కుమార్‌ రాసిన వైద్య గ్రంథాన్ని చదువుతూ గడిపాను. అప్పుడు నాక్కూడా నాకు తెలిసిన సంగతులు చెప్పాలనిపించింది. గూగుల్‌ లేని రోజుల్లోనే నిత్యాన్వేషిగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. చేతిలోకి స్మార్ట్‌ఫోన్  వచ్చిన తర్వాత ఇక కష్టమేముంది? యూ ట్యూబ్‌కి సంబంధించిన పరిజ్ఞానమంతా ‘హౌ టూ అప్‌లోడ్, హౌ టూ డూ ఎడిటింగ్, హౌ టూ డూ థంబ్‌నెయిల్‌’ అంటూ ‘హౌ టూ’ అని అడుగుతూ నేర్చుకున్నాను.

మొదట వంటలు, ఇంటి అలంకరణ, మా వారు రాసిన వైద్యగ్రంథంలోని విషయాలను చెప్పాలనుకుని 2021లో యూ ట్యూబ్‌ చానెల్‌ మొదలుపెట్టాను.  కొంతకాలం తర్వాత యూ ట్యూబ్‌ గుర్తించాలంటే ఏదో ఒక టాపిక్‌ మీదనే దృష్టి పెట్టమని సూచించారు పిల్లలు. వంటలు చాలామంది చేస్తున్నారు. ముత్యాలు, పగడాల గురించి చాలామందికి తెలియని సంగతులు చాలా ఉన్నాయి.

వాటి గురించి చెప్పమన్నారు మా పిల్లలు. ఆ తర్వాత నాకు సబ్‌స్రైబర్స్‌ రెండున్నర లక్షలకు పెరగడంతోపాటు ఫాన్  ఫాలోయింగ్‌ కూడా పెరిగింది. డాక్టర్‌లు, సైంటిస్ట్‌లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌లు... సందేహాలడుగుతుంటే నాకు తెలిసినదెంత? ఇంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ల సందేహాలు నేను తీర్చడమేమిటని ఆశ్చర్యంగా ఉంటుంది కూడా. అసలు ముత్యాన్ని, నకిలీ ముత్యాన్ని ఎలా గుర్తించాలి, తైవాన్  పగడం ఎలా ఉంటుంది, ఇటాలియన్  పగడాలెలా ఉంటాయి, వేటిని క్యారట్‌లలో తూస్తారు, వేటిని గ్రాముల్లో తూస్తారు... వంటి విషయాలనెన్నో చెప్పాను.

యూ ట్యూబర్‌గా నేను డబ్బుకంటే వెలకట్టలేని ఆత్మీయతను, అభిమానాన్ని సంపాదించుకున్నాను. ఆంటీ, అమ్మా అనే పిలుపులతోపాటు ఈ తరం యువతులు వాళ్ల సందేహాల కోసం ఫోన్  చేసి ‘అమ్మమ్మా’ అని పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంటోంది. మనిషి, మెదడు పని లేకుండా ఖాళీగా ఉండకూడదు. అలాగే ఎంటర్‌టైన్ మెంట్‌ మన మైండ్‌ని చెడగొట్టకూడదని నమ్ముతాను. అందుకే టీవీ సీరియల్స్‌ నన్ను ఆకర్షించలేదు. నాకు నేనుగా సమయాన్ని ఇలా ఆనందంగా, ఉపయుక్తంగా మలుచుకున్నాను’’ అన్నారు శకుంతలాదేవి.  – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement