జగన్‌ ఏలిక...ఆంధ్రావనికి ఏరువాక!  | Poli Raghavareddy Exclusive Interview with Sakshi | Sakshi
Sakshi News home page

జగన్‌ ఏలిక...ఆంధ్రావనికి ఏరువాక! 

Published Sun, Apr 14 2024 3:07 AM | Last Updated on Sun, Apr 14 2024 3:07 AM

Poli Raghavareddy Exclusive Interview with Sakshi

రైతు జనబాంధవుడు డాక్టర్‌ వైఎస్సార్‌... 

తండ్రి బాటలోనే సీఎం జగన్‌ వందడుగులు ముందుకు.. 

పరిశోధనా కేంద్రాల్లో మౌలిక వసతులకు రూ.50 కోట్లు 

రైతు ముంగిటకే సాగు ఉత్పాదకాల పంపిణీ 

ఉత్పత్తులకు మద్దతు ధర.. ధాన్యం కొనుగోలు 

వైఎస్‌ మాదిరిగానే రైతు పక్షపాతిగా నిలిచిన వైఎస్‌ జగన్‌   

సాక్షితో ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్వ వీసీ, ఐసీఏఆర్‌ గవర్నింగ్‌ బాడీ మాజీ సభ్యుడు ప్రొ.పోలి రాఘవరెడ్డి

జనం బాధలు తమవిగా భావించే నేతలే ప్రజా సమస్యల పరిష్కారానికి తపిస్తారు. అలా తపించే నాయకులే నేటి సమాజానికి కావాలి. ఎవరికి ఏ కష్టమొచ్చినా చలించే మనసు ఉండాలి. చలించడంతో సరిపోదు... ఆ బాధలను తీర్చాలన్న పట్టుదల... ఆ కష్టం తీరేదాకా జనం వెన్నంటి ఉన్నప్పుడే రాజకీయ నాయకుడికి గుర్తింపు. అలాంటి గుర్తింపును తండ్రీ తనయులైన దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్సార్, ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలోనూ అతి దగ్గరగా చూసిన ఒక వ్యవసాయ శాస్త్రవేత్త మనోగతమిది... రైతులకు ఏం చేస్తే వారి బతుకులు బాగుపడతాయని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేర్వేరు సందర్భాల్లో ఈ శాస్త్రవేత్తను సలహాలు అడిగారు.

తాను చెప్పిన వాటన్నిటినీ తూచా తప్పకుండా ఆచరించడమే జగన్‌లోని ఆదర్శ నాయకుడిని చూపించాయని ఆ శాస్త్రవేత్త చెబుతున్నారు. జగన్‌లోని వినే గుణం, విన్న తర్వాత ఆచరణలోకి తీసుకురావడమనేది ఈ రాష్ట్ర వ్యవసాయ రంగానికి పట్టిన అదృష్టమని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పూర్వపు వీసీ, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) గవర్నింగ్‌ బాడీ మాజీ సభ్యుడు, ఏపీ అగ్రి మిషన్‌ సభ్యుడు...ప్రొఫెసర్‌ పోలి రాఘవరెడ్డి కొనియాడారు... జగన్‌తో తన స్ఫూర్తిదాయక అనుభవాలను ఇలా ‘సాక్షి’ తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... 
– సాక్షి, అమరావతి 

‘నాడు ఆ మహానేత వైఎస్సార్‌.. నేడు ఆయన తనయుడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.. రైతుల కోసం ఆలోచించే విధానం.. స్పందించే తీరు ఒకే రీతిలో ఉంది. ప్రతీ అడుగులోనూ రైతులకు మేలు చేయాలన్న తపన వారిద్దరిలోనూ కన్పించింది. ఇద్దరి పాలనా తీరును దగ్గర నుంచి చూశాను. నాన్న ఒక అడుగు వేస్తే నేను నాలుగడుగులు వేస్తానన్న సీఎం వైఎస్‌ జగన్‌.. ఐదేళ్లలో రైతుల కోసం ఏకంగా వంద అడుగులు వేశారనే చెప్పాలి.

మహానేత హయాంలో రైతులు ఎంత సుభిక్షంగా ఉన్నారో అంతకు రెట్టింపు సంతోషంగా ఈ ఐదేళ్లలో ఉన్నారని వ్యవసాయ రంగ నిపుణుడిగా నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ ఐదేళ్లలో ఈ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు..నాకు తెలిసి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ 77 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఐదేళ్లలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సమ్మిళిత అభివృద్ధికి బాటలు పడ్డాయని చెప్పొచ్చు. 

శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు ... 
రైతులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. పాదయాత్రలో రైతుల కష్టాలను దగ్గర నుంచి చూసిన నేతగా వైఎస్‌ జగన్‌ వారి ప్రతీ సమస్య పట్ల స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ప్రతీ విషయాన్ని పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. సమస్యలను ఆకళింపు చేసుకోవడమే కాదు వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. వ్యవసాయం లాభసాటి కావాలంటే సాగుకు అవసరమైన పెట్టుబడి, సారవంతమైన నేల, అవసరమైన మేరకు నీరు, సాగు ఉత్పాదకాలు, సాంకేతిక బదలాయింపు, గిట్టుబాటు ధర కల్పన, సరైన మార్కెటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు అవసరం. ఈ ఐదేళ్లలో వీటిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఎన్నో విప్లవాత్మక  సంస్కరణలు తీసుకొచ్చారు.  

రైతులకు మేలు చేయాలన్నదే ఆయన తపన 
మహానేత మాదిరిగానే వైఎస్‌ జగన్‌ రైతుకు మేలు చేసేందుకు ఎవరు ఏ సలహా ఇచ్చినా తీసుకుంటున్నారు. అగ్రిమిషన్‌ తొలి సమావేశంలో పెట్టుబడి సాయం ఇచ్చేటప్పుడు ఎంత విస్తీర్ణం ఉండాలి. ఎవరిని రైతులుగా గుర్తించాలని అడిగారు. అప్పుడు నేను చెప్పిన రెండు సూచనలు ఆచరణలో పెట్టారు. తమలపాకు రైతులు చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. పైగా మెజార్టీ సాగుదారులకు ఎకరం కంటే తక్కువ భూమే ఉందని చెప్పాను. ఒక రైతుకు ఇద్దరు ముగ్గురు కొడుకులుంటారు.

పెళ్లయిన తర్వాత వారికి పొలాలు వాటాలు పంచినా ఒకే ఇంట్లో ఉంటారు. అలాంటప్పుడు వారందరినీ ఒకే కుటుంబంగా పరిగణించడం సరికాదన్నా.. అని చెప్పాను. అలా చెప్పిన మరుక్షణమే.. రైతుకు 15 సెంట్లున్నా పెట్టుబడి సాయం ఇవ్వాలని, పెళ్లయితే చాలు ఒక ఇంట్లో ఎంత మంది ఉన్నా వేర్వేరు కుటుంబాలుగా పరిగణించి రైతు భరోసా ఇద్దామని సీఎం జగన్‌ ప్రకటించి ఆచరణలో పెట్టారు. రైతులకు ఒక్క రూపాయి అయినా అదనంగా మేలు చేయాలన్న తపన, తాపత్రయం పెద్దాయనలో మాదిరిగానే వైఎస్‌ జగన్‌లోనూ చూశాను.  

పరిశోధనలకు పెద్ద పీట... 
మహానేత వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు నేను మార్టేరు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తగా ఉండేవాణ్ని. సీఎంగా పగ్గాలు చేపట్టిన తొలి నాళ్లలో మా పరిశోధనా స్థానానికి వచ్చినప్పుడు  రైతుల కోసం ఏం చేస్తే బాగుంటుందని సలహా అడిగారు. పరిశోధనలు బాగా పెరగాలి. వాటి ఫలాలు క్షేత్ర స్థాయిలో రైతులకు చేరువ చేసిన రోజు కచ్చితంగా వారికి మేలు జరుగుతుందని చెప్పాను. అంతే.. క్షణం ఆలోచించకుండా పరిశోధనా కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన కోసం అక్కడికక్కడే రూ.50 కోట్లు మంజూరు చేశారు. ఫలితంగా కొత్త రకాలు సృష్టించగలిగాం.

ఉత్పత్తిని పెంచేందుకు బలమైన అడుగు వేయగలిగాం. ఆ తర్వాత డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌గా, వీసీగా ఆయన హయాంలో పనిచేసే అవకాశం కలిగింది. ఆ సమయంలో నేను ఇచ్చిన సలహాలు, సూచనలకు ఎంతో విలువ ఇచ్చేవారు. ఆచరణలో పెట్టేందుకు కృషి చేశారు. ఆ మహానేత కంటే మిన్నగా నేడు సీఎం వైఎస్‌ జగన్‌ తాను అమలు చేసే ప్రతీ కార్యక్రమం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement