దేశవ్యాప్తంగా వందకిపైగా నగరాలు.. లక్షా పదిహేను ఎంట్రీలు.. ఆ మొత్తంలో గూగుల్‌ను మెప్పించి విజేతగా నిలిచాడు ఓ కుర్రాడు. ఆ డూడుల్ ఇప్పుడు బాలల దినోత్సవం సందర్భంగా.. గూగుల్ హోం పేజీలో దర్శనమిస్తోంది.
గూగుల్ సోమవారం ఉదయం డూడుల్ ఫర్ గూగుల్ 2022 పోటీల ఫలితాలను ప్రకటించింది. ఈ పోటీలో పశ్చిమ బెంగాల్ కోల్‌కతాకు చెందిన శ్లోక్ ముఖర్జీగా విజేతగా నిలిచాడు. ఇండియా ఆన్ ది సెంటర్ స్టేజ్ అనే డూడుల్‌ను రూపొందించాడు శ్లోక్. అది స్ఫూర్తిదాయకంగా ఉందని ప్రకటించింది గూగుల్. సోమవారం ఆ డూడుల్ Google.co.inలో ప్రదర్శితమవుతోంది.
న్యూటౌన్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నాడు శ్లోక్. ‘‘రాబోయే పాతికేళ్లలో.. మానవాళి అభివృద్ధికి నా దేశ శాస్త్రవేత్తలు తమ సొంత పర్యావరణ అనుకూల రోబోట్‌ను అభివృద్ధి చేస్తారు. భారతదేశం భూమి నుంచి అంతరిక్షానికి క్రమం తప్పకుండా ఇంటర్ గెలాక్టిక్ ప్రయాణాలను చేస్తుంటుంది. యోగా, ఆయుర్వేదంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజుల్లో దేశం మరింత బలపడుతుంది’’ అంటూ తన డూడుల్ సందేశంలో పేర్కొన్నాడు.
దేశవ్యాప్తంగా మొత్తం వంద నగరాల నుంచి లక్షా 15వేల ఎంట్రీలు వచ్చాయి ఈ పోటీకి. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులు ఈ పోటీకి అర్హులు. మొత్తం ఎంట్రీల నుంచి చివరగా 20 మందిని ఎంపిక చేశారు. చివరికి శ్లోక్‌ను విజేతగా ప్రకటించారు. గూగుల్ డూడుల్ టీంతో పాటు న్యాయనిర్ణేతల ప్యానెల్‌లో ప్రముఖ నటి, ఫిల్మ్ మేకర్ నీనా గుప్తాతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు.
డూడుల్ ఫర్ గూగుల్ పోటీలు.. యువతరంలో సృజనాత్మకతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment